IND vs ENG 2nd Test Preview: ఈసారైన ‘లార్డ్స్‌’ కలిసొచ్చేనా.. కోహ్లీ సేనను భయపెడుతోన్న రికార్డులు.. ఇంగ్లండ్‌తో నేటి నుంచి రెండో టెస్ట్!

Excerpt: India vs England 2nd Test Prediction:తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో.. ప్రస్తుతం ఇరుజట్లు రెండవ టెస్టుపై పడ్డాయి. నేటి నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న టెస్టులో సత్తా చూపి సిరీస్‌లో ముందడుగు వేయాలని రెండు జట్లు ఆశపడుతున్నాయి.

IND vs ENG 2nd Test Preview: ఈసారైన ‘లార్డ్స్‌’ కలిసొచ్చేనా.. కోహ్లీ సేనను భయపెడుతోన్న రికార్డులు.. ఇంగ్లండ్‌తో నేటి నుంచి రెండో టెస్ట్!
Ind Vs Eng 2nd Test
Follow us

|

Updated on: Aug 12, 2021 | 9:04 AM

తొలి టెస్ట్ డ్రాగా ముగియడంతో.. ప్రస్తుతం ఇరుజట్లు రెండవ టెస్టుపై పడ్డాయి. నేటి నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న టెస్టులో సత్తా చూపి సిరీస్‌లో ముందడుగు వేయాలని రెండు జట్లు ఆశపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మక లార్డ్స్‌ ‎మైదానంలో భారత్, ఇంగ్లండ్‌ మధ్య రెండవ పోరుకు రంగం సిద్ధమైంది. ఇరు జట్లలోని బ్యాటింగ్‌ బలహీనతలు స్పష్టంగా కనిపించాయి. బౌలింగ్‌లో సత్తా చాటుతున్నా.. బ్యాటింగ్‌లో నిలబడిన జట్టునే విజయం వరించేలా ఉంది. మరి ఎవరి బలాలు ఏంటో చూద్దాం..

ఇంగ్లండ్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ గెలవాలన్న గట్టి పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగనుంది. తొలిటెస్టులో బరిలోకి దిగిన జట్టులో ఒకే ఒక మార్పుతో రెండవ టెస్టులోకి దిగనుంది. ఇద్దరు పేసర్లు గాయాలతో బాధపడుతుండడంతో ఇంగ్లీష్ జట్టుకి కొత్త తలనొప్పిగా తయారైంది. కీలకమైన రెండవ టెస్టులో ఎవరు రాణిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఇంగ్లండ్‌పై టీమిండియాదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. లార్డ్స్ మైదానం మాత్రం భారత్‌ను కలవరపెడుతోంది. ఇక్కడ 18 టెస్టులు ఆడిన టీమిండియా కేవలం 2 రెండు టెస్టుల్లో మాత్రమే గెలిచింది. అలాగే ప్రధాన భారత్ బ్యాట్స్‌మెన్లు ఎవరూ ఇక్కడ రాణించకపోవడం సమస్య కానుంది.

టీమిండియా పేసర్ ఔట్‌.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఒక మార్పు ఖారారైంది. పేస్‌ బౌలర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ గాయంతో రెండవ టెస్టులో ఆడడం లేదు. అతని స్థానంలో మరో పేస్‌ బౌలర్‌ ఇషాంత్‌ లేదా ఉమేశ్‌లకు అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది. లేదా అశ్విన్‌కు కూడా ఛాన్స్ ఇచ్చే అవకావం ఉందని తెలుస్తోంది. అయితే ట్రెంట్‌బ్రిడ్జ్‌ మైదానంతో పోలిస్తే లార్డ్స్ మైదానం కొంత పొడిగా ఉండనుందని తెలుస్తోంది. దీంతో అశ్విన్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ రెండో టెస్టుకు సిద్ధంగా ఉన్నా… తొలి టెస్టులో రాణించిన కేఎల్ రాహుల్‌నే బరిలోకి దించనుంది. దాంతో మయాంక్‌‌కు ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. టీమిండియా ప్రధాన బ్యాట్స్‌మెన్లు పుజారా, కోహ్లి, రహానే తొలి టెస్టులో దారుణంగా విఫలమయ్యారు. రెండవ టెస్టులో వీరు ఏమాత్రం రాణిస్తారో చూడాలి. వీరిలో కనీసం ఒకరైనా క్రీజులో నిలబడితే భారత్‌కు పరుగుల వరద ఖాయమే. ఆల్ రౌండర్ జడేజా బ్యాటింగ్‌లో సత్తా చాటడంతో టీమిండియా ఆ మాత్రమైన స్కోర్ చేయగలిగింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో రాణించలేక ఇబ్బంది పడిన టీమిండియా పేసర్ బుమ్రా.. తొలి టెస్టులో 9 వికెట్లతో తన సత్తా చాటాడు. దీంతో రెండోవ టెస్టులో షమీ, షిరాజ్‌తో కలిసి మరోసారి రెచ్చిపోయేందుకు సిద్ధమయ్యాడు.

ఎప్పుడు: గురువారం, ఆగస్ట్ 12, 2021. సాయంత్రం 3.30 గంటలకు

ఎక్కడ: లార్డ్స్, మేరీలెబోన్, లండన్

పిచ్, వాతావరణం: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. వర్ష సూచన లేదు. టాస్‌ గెలిచిన టీమ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోనుంది.‎

చివరి ఐదు మ్యాచుల్లో… ఇంగ్లండ్ డ్రా, ఓటమి, ఓటమి, డ్రా, ఓటమి, ఓటమి భారతదేశం డ్రా, ఓటమి, విజయం, విజయం, విజయం

గణాంకాలు.. గ్రాహం గూచ్ 8900 టెస్ట్ పరుగులను దాటేందుకు జోరూట్ ఇంకో 14 పరుగులు చేయాల్సి ఉంది. అలాగే 9000 టెస్టు పరుగులను చేరుకోవడానికి 113 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఒకవేళ బ్రాడ్ లేదా ఆండర్సన్ ఆడకపోతే, 2007 నుంచి ఓ ప్రధాన బౌలర్‌ లేకుండా ఇంగ్లండ్‌కు బరిలోకి దిగడం ఇది రెండో హోమ్ టెస్ట్ మాత్రమే. (2012 బర్మింగ్‌హామ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో బౌలర్ లేకుండా బరిలోకి దిగింది)

ఇబ్బందుల్లో ఇంగ్లండ్ పేస్.. లార్డ్స్ టెస్టుకు ముందు ఆతిథ్య జట్టుకు పేస్ బౌలింగ్ రూపంలో భారీ దెబ్బ తగిలింది. సీనియర్‌ పేస్‌ బౌలర్, కెరీర్‌లో 150వ టెస్టు ఆడాల్సిన స్టువర్ట్‌ బ్రాడ్‌ గాయంతో సిరీస్‌కే దూరమయ్యాడు. అతని స్థానంలో మార్క్‌ వుడ్‌ను ఇంగ్లండ్‌ తుది జట్టులోకి ఎంచుకుంది. పరిమిత ఓవర్లలో అనుభవమున్న వుడ్‌ ఏలాంటి ప్రభావం చూపుతాడో మరి. మరో సీనియర్‌ బౌలర్ అండర్సన్‌ ఫిట్‌నెస్‌పై కూడా డౌట్‌గానే ఉంది. ఈయన కూడా మ్యాచ్‌కు దూరమైతే ఇంగ్లండ్‌కి బౌలింగ్ రూపంలో భారీ ఎదురు దెబ్బ తగలనుంది.

ఇక బ్యాటింగ్‌లో ఆ జట్టు పరిస్థితి కూడా ఏమాత్రం బాగోలేదు. తొలి టెస్టులో రూట్‌ ఒక్కడే ఆకట్టుకున్నాడు. దీంతోనే ఇంగ్లండ్ ఆమాత్రమైనా స్కోర్ చేయగలిగింది. లేదంటే అత్యల్ప స్కోర్‌కే చాపచుట్టేసేది. బర్న్స్, సిబ్లీ, క్రాలీ, లారెన్స్‌ వరుసగా విఫలమవుతూ ఇంగ్లండ్‌ టీంకు ఇబ్బందిగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీకి మరలా టెస్టు టీమ్‌లో స్థానం కల్పించారు. టీమిండియాపై మంచి రికార్డు ఉన్న అలీని రంగంలోకి దించింది.

స్లో ఓవర్ రేట్.. తొలి టెస్టులో ‘స్లో ఓవర్‌ రేట్‌’ను నమోదు చేసిన ఇరు జట్లపై ఐసీసీ చర్య తీసుకుంది. రెండు జట్లకు డబ్ల్యూటీసీ పాయింట్ల నుంచి చెరో 2 పాయింట్లు కోత పెట్టింది. తొలి టెస్టు ‘డ్రా’ కావడంతో ఇరు జట్లకు దక్కే 4 పాయింట్లలో ఒక్కో జట్టుకు ఇప్పుడు రెండేసి పాయింట్లు మాత్రమే లభించాయి. పాయింట్లతో పాటు మ్యాచ్‌ ఫీజులో ఒక్కో జట్టుకు 40 శాతం జరిమానా కూడా విధించింది.

తుది జట్లు (అంచనా): భారత్‌: కోహ్లి (కెప్టె న్‌), రోహిత్, రాహుల్, పుజారా, రహానే, పంత్, జడేజా, అశ్విన్, షమీ, బుమ్రా, సిరాజ్‌. ఇంగ్లండ్‌: రూట్, బర్న్స్, సిబ్లీ, హసీబ్‌ హమీద్, బెయిర్‌స్టో, బట్లర్, అలీ, స్యామ్‌ కరన్, రాబిన్సన్, వుడ్, ఒవర్టన్‌/సాఖిబ్‌.

Also Read: India Vs England: టీమిండియాలో రెండు మార్పులు.. మిడిల్ ఆర్డర్‌ మరింత బలం.. ఎవరెవరంటే.?

Ind vs Eng 2nd Test Live Streaming : ఈ రోజు నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్.. లార్డ్స్‌లో భారత్‌కి కేవలం రెండు విజయాలు మాత్రమే..