Vinod Kambli: అతను నా కొడుకులాంటి వాడు.. ఇకపై ఆయన బాగోగులు మావే: సునీల్ గవాస్కర్
Vinod Kambli: వినోద్ కాంబ్లీ మద్యపానం కారణంగా చాలా కాలంగా అనారోగ్యంతో ఉన్నాడు. ఇప్పుడు అతనికి సహాయం చేయడానికి మాజీ భారత దిగ్గజం సునీల్ గవాస్కర్‌తోపాటు 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు ఆటగాళ్లు ముందుకు వచ్చారు.

Sunil Gavaskar on Vinod Kambli: సచిన్ టెండూల్కర్ చిన్ననాటి స్నేహితుడు, భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి భారత మాజీ దిగ్గజం సునీల్ గవాస్కర్ సాయం అందించారు. కాంబ్లీ తన కుమారుడిలాంటివాడని, అతడి కోసం సాధ్యమైనదంతా చేస్తానంటూ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. తద్వారా ఈ ఆటగాడి జీవితం తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని భావిస్తున్నాడు.
వినోద్ కాంబ్లీకి ఏమైంది?
నిజానికి వినోద్ కాంబ్లీ ఆరోగ్యం చాలా దారుణంగా తయారైంది. మానసిక అనారోగ్యంతో పాటు శారీరకంగా కూడా చాలా అనారోగ్యంతో ఉన్నాడు. అనారోగ్యంతో బాధపడుతూ వైద్యం చేయించుకునేందుకు అతడి వద్ద డబ్బు లేదు. ఈ సంక్షోభ సమయంలో, 1983 ప్రపంచ కప్ గెలిచిన టీమ్ ఇండియాలో భాగమైన సునీల్ గవాస్కర్ స్పందించారు. ‘ నేను మాత్రమే కాదు, 1983 ప్రపంచకప్ గెలిచిన జట్టులోని ఆటగాళ్లందరూ నిజంగా వినోద్ కాంబ్లీకి సహాయం చేయాలనుకుంటున్నారు. మేమంతా కాంబ్లీ తన కాళ్లపై తిరిగి నిలబడాలని కోరుకుంటున్నాం. మేము ఈ సహాయం ఎలా అందించాలో సమీప భవిష్యత్తులో ప్లాన్ చేస్తాం. మేం కాంబ్లీకి మాత్రమే కాకుండా విధి చాలా కఠినంగా మారిన క్రికెటర్లకు కూడా సహాయం చేయాలనుకుంటున్నాం అంటూ చెప్పుకొచ్చాడు.
సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. అతను నాకు కొడుకు లాంటివాడు. మేం అందరం కలిసి అతనికి సహాయం చేయాలనుకుంటున్నాం. నాకు హెల్ప్ అనే పదం నచ్చలేదు. వాళ్ళని మేం చూసుకుంటాం’ అంటూ తెలిపాడు.
వినోద్ కాంబ్లీ కెరీర్..
వినోద్ కాంబ్లీ గురించి మాట్లాడితే, ఇటీవల అతను ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్‌తో కలిసి కనిపించాడు. ఈ క్రమంలో కాంబ్లీ సరిగ్గా నడవలేకపోయాడు. దీంతోపాటు మద్యానికి బానిసై ఇబ్బంది పడుతున్నాడు. అలాగే, మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. 1993 నుంచి 2000 మధ్యకాలంలో కాంబ్లీ భారత్ తరపున 17 టెస్టులు, 104 వన్డేలు ఆడాడు. కానీ అతని కెరీర్ ఎక్కువ కాలం కొనసాగలేదు. రీఎంట్రీ ఇవ్వలేకపోయాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








