Ravi Shastri: ఒక శకం ముగిసినట్లయినా.. అతని ప్రస్థానం, ప్యాషన్ మరవలేనివి.. తరువాత సంగతి ఏమో మరి!
భారత క్రికెట్ అభిమానులకు మే నెల షాక్ ఇచ్చింది. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి తన 14 ఏళ్ల గొప్ప ప్రయాణానికి ముగింపు పలికాడు. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి అతని భవిష్యత్ పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్‌లలో అత్యుత్తమ ప్రదర్శనలు, కెప్టెన్సీ విజయాలతో కోహ్లీ క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు.

మే నెల భారత క్రికెట్ అభిమానులకు ఎప్పటిలాగే మిశ్రమ భావాలను మిగిల్చింది. అయితే, ఈసారి మరింత గాఢంగా, ఎందుకంటే భారత క్రికెట్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. తన 14 ఏళ్ల గొప్ప ప్రయాణానికి స్వస్తి పలుకుతూ, అభిమానులను తడిచే వార్తను తెలియజేశాడు. కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో పాటు, అభిమానుల మనసుల్లో వెంటనే ఒక ప్రశ్న ఉదయించింది. “ఇప్పుడు విరాట్ పయనం ఎటు?” ఆటగాడిగా అత్యున్నత స్థాయిలో నిలిచిన కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత ఏ పాత్రలో కనిపించబోతున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ సందేహాల నడుమ, భారత మాజీ కోచ్ రవిశాస్త్రి తన తాజా వ్యాఖ్యలతో ఆసక్తికరమైన దృక్కోణాన్ని పంచుకున్నారు. స్పోర్ట్‌స్టార్‌లో రాసిన తన కాలమ్‌లో రవిశాస్త్రి, విరాట్ భవిష్యత్‌పై మాట్లాడాడు. “వన్డేల్లో భారత క్రికెట్‌కు సేవ చేయడానికి కోహ్లీ ఇంకా ఉన్నాడు. కానీ అతను క్రికెట్‌ను పూర్తిగా వదిలిన తర్వాత, మరే పాత్రను ఆశించకుండా ఆట నుంచి పూర్తిగా తప్పుకుంటాడనే నమ్మకం నాకు ఉంది. అతను కోచ్‌గా మారతాడా? మైక్‌తో కామెంటేటర్‌గా కనిపిస్తాడా? అనేది కాదనుకుంటున్నా. అతను అటువంటి రకం కాదు. ఇంగ్లాండ్‌లో భారత్ తన తదుపరి టెస్ట్ ఆడినప్పుడు నేను అతనిని మిస్సవుతాను. అతను అసలైన ఛాంపియన్. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గని వ్యక్తి. నేను గుర్తుంచుకోవాలనుకుంటే అదే కోహ్లీ” అని శాస్త్రి పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో ఉన్నతమైన వారసత్వాన్ని సృష్టించాడు. టెస్ట్ ఫార్మాట్‌కు విశ్వాసాన్ని చాటుతూ, తన ఆటతీరుతో ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేశాడు. దృఢ సంకల్పం, ఉత్సాహం, అచంచలమైన ఫిట్‌నెస్‌తో కోహ్లీ తన ఆటలో కొత్త ప్రమాణాలను స్థాపించాడు. అతను ఆడిన 113 టెస్ట్ మ్యాచ్‌ల్లో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో కలిపి మొత్తం 9230 పరుగులు సాధించాడు. అతని కెరీర్‌లో అతి ముఖ్యమైన అంశం అతని కెప్టెన్సీ. అతని నేతృత్వంలో టీం ఇండియా 68 టెస్టులలో 40 విజయాలను సాధించింది. 2018-19లో ఆస్ట్రేలియాలో భారత జట్టు తొలి టెస్ట్ సిరీస్‌ను గెలిచిన ఘనత కోహ్లీకి చెందుతుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గౌరవంగా మారింది.
విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌తో ఒక శకం ముగిసినట్లయినా, అతని ప్రస్థానం, ప్యాషన్, ఆటపై చూపిన నిబద్ధత ఎన్నటికీ మరవలేనివి. అతని తర్వాతి అడుగు ఏమవుతుందన్నది తెలియదు కానీ, అతను ఏదైనా చేస్తే అదే పూర్తి స్థాయిలో, అంకిత భావంతో చేస్తాడన్న విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆయన మైక్ వెనుక మాట్లాడకపోవచ్చు, డగౌట్‌లో కనిపించకపోవచ్చు, కానీ అభిమానుల గుండెల్లో మాత్రం చిరకాలం కోహ్లీ పేల్చిన స్ఫూర్తి మెరిసిపోతూనే ఉంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



