
Vaibhav Suryavanshi : ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లను ఊచకోత కోసి, రాజస్థాన్ రాయల్స్ (RR)కు ఒంటిచేత్తో విజయాన్ని అందించిన 15 ఏళ్ల బీహార్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. బుధవారం జరిగిన మ్యాచ్‌లో కేవలం 29 బంతుల్లోనే 97 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించిన ఈ బుడ్డోడు.. మ్యాచ్ ముగిసిన తర్వాత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక చిన్న పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.
హైదరాబాద్‌పై తాను ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఫొటోలను షేర్ చేస్తూ.. హంగ్రీ ఫర్ మోర్ (ఇంకా పరుగుల కసి తీరలేదు) అంటూ కేవలం మూడు ముక్కల క్యాప్షన్ ఇచ్చాడు. ఈ చిన్న పోస్ట్‌తో త్వరలో జరగబోయే క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ఇంకా పెద్ద స్కెచ్ వేసినట్లు ఈ చిన్నోడు హింట్ ఇచ్చేశాడు.
హైదరాబాద్‌తో జరిగిన ఈ చారిత్రాత్మక మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ కేవలం 3 రన్స్ తేడాతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డును తృటిలో మిస్ చేసుకున్నాడు. ఐపీఎల్‌లో 30 బంతుల్లోనే శతకం బాదిన క్రిస్ గేల్ రికార్డు ఇప్పటికీ అలాగే చెక్కుచెదరకుండా ఉంది. అయితే, గేల్ సెంచరీ రికార్డును అందుకోలేకపోయినా.. దశాబ్ద కాలంగా ఎవరికీ సాధ్యంకాని క్రిస్ గేల్ మరో భారీ రికార్డును మాత్రం వైభవ్ బద్దలు కొట్టాడు.
ఈ మ్యాచ్‌లో 5 ఫోర్లు, ఏకంగా 12 ఆకాశమే హద్దుగా చెలరేగిన సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ దాడితో ఐపీఎల్ ఒకే ఒక సీజన్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా వైభవ్ రికార్డు సృష్టించాడు. గతంలో క్రిస్ గేల్ ఒకే సీజన్లో 59 సిక్సర్లు కొట్టగా.. ఇప్పుడు వైభవ్ ఆ రికార్డును దాటేసి ఏకంగా 65 సిక్సర్లతో టాప్‌లో దూసుకుపోతున్నాడు.
తన రికార్డును 15 ఏళ్ల పిల్లాడు బద్దలు కొట్టడాన్ని వెస్టిండీస్ లెజెండ్ క్రిస్ గేల్ మనస్ఫూర్తిగా అభినందించాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే గేల్ తన ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ.. “వైభవ్ ఎంత అద్భుతమైన ప్లేయర్.. చిన్నోడా, నీ ఆట నిజంగా నెక్ట్స్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్! ఐపీఎల్‌కు ఇప్పుడు ఒక సరికొత్త సిక్స్ మెషిన్ దొరికింది” అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు.
What a phenomenal player Vaibhav is. Great entertainment young man! New Six machine @IPL pic.twitter.com/ofElAousF7
— Chris Gayle (@henrygayle) May 27, 2026
అటు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ధ్రువ్ జురెల్ సైతం ఒక వీడియో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటో వివరిస్తూ ఆకాశానికెత్తేశాడు. సౌతాఫ్రికా మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్ సైతం జియో స్టార్ పోస్ట్-గేమ్ షోలో వైభవ్ మెచ్యూరిటీని చూసి ఆశ్చర్యపోయాడు. “ఈ ఇన్నింగ్స్‌లో నన్ను బాగా ఆకట్టుకుంది ఏంటంటే.. ప్రెజర్ మ్యాచ్‌లో కూడా వైభవ్ చూపించిన ప్రశాంతత. సన్‌రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎన్నో రకాల ప్లాన్లు వేశాడు, బౌలర్లను మార్చాడు.. కానీ వైభవ్ మాత్రం తన చుట్టూ ఒక సొంత బబుల్ క్రియేట్ చేసుకుని మ్యాచ్‌పైనే పూర్తి ఫోకస్ పెట్టాడు. అంత చిన్న వయసులో ఆ స్థాయి గేమ్ అవేర్‌నెస్ ఉండటం నిజంగా గ్రేట్” అని కొనియాడాడు.
ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ మొదట బ్యాటింగ్ చేసి 243/8 పరుగుల కొండంత స్కోరు బోర్డుపై ఉంచగా.. ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 196 పరుగులకే కుప్పకూలింది. దీంతో రాజస్థాన్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి క్వాలిఫైయర్ 2 లో అడుగుపెట్టింది. మే 28, 2026 నాటికి ఐపీఎల్ టోర్నమెంట్‌లో అత్యధికంగా 680 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న వైభవ్ సూర్యవంశీ.. తదుపరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో ఫైనల్ ఫైట్‌కు సిద్ధం కావాలని కసిగా ఉన్నాడు. 2022 తర్వాత రాజస్థాన్ జట్టును ఫైనల్‌కు చేర్చడమే ఈ చిన్నోడి ప్రస్తుత ఏకైక లక్ష్యం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..