AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaibhav Suryavanshi : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ!

Vaibhav Suryavanshi : కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ వేగంగా వంద సిక్సర్ల మైలురాయిని చేరుకుని వైభవ్ సూర్యవంశీ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు 817 బంతులతో ఉన్నప్పటికీ, వైభవ్ దానిని దాదాపు 300 బంతుల ముందే అధిగమించాడు.

Vaibhav Suryavanshi : ఐపీఎల్ చరిత్రలో సరికొత్త అధ్యాయం.. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన వైభవ్ సూర్యవంశీ!
Vaibhav Suryavanshi (8)
Rakesh
|

Updated on: May 10, 2026 | 7:14 AM

Share

Vaibhav Suryavanshi : భారత క్రికెట్ రంగానికి మరో సంచలన తార దొరికింది. రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ ప్రపంచ క్రికెట్ రికార్డులను తిరగరాస్తున్నాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అసాధారణ ప్రతిభను కనబరుస్తూ, అంతర్జాతీయ దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రీతిలో వేగంగా వంద సిక్సర్ల మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ మరోసారి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ ముందున్న భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేవలం 16 బంతుల్లోనే 36 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఫోర్లు, మూడు భారీ సిక్సర్లు ఉన్నాయి. మహమ్మద్ సిరాజ్ వేసిన తొలి బంతికే సిక్సర్ బాదడం ద్వారా తన ఖాతాను తెరవడమే కాకుండా, టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాటర్‌గా రికార్డులకు ఎక్కాడు. ఈ ప్రయాణంలో అతను అనేక మంది సీనియర్ ఆటగాళ్లను వెనక్కి నెట్టడం విశేషం.

వైభవ్ సూర్యవంశీ ఈ ఘనతను కేవలం 15 ఏళ్ల వయసులోనే సాధించడం విశేషం. 20 ఏళ్ల వయసు కంటే ముందే టీ20 ఫార్మాట్‌లో వంద సిక్సర్లు బాదిన ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా నిలిచాడు. అంతేకాకుండా, కేవలం 514 బంతుల్లోనే ఈ వంద సిక్సర్ల మార్కును చేరుకుని అత్యంత వేగవంతమైన ఆటగాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు 817 బంతులతో ఉన్నప్పటికీ, వైభవ్ దానిని దాదాపు 300 బంతుల ముందే అధిగమించాడు. ఇన్నింగ్స్‌ల పరంగా చూస్తే, కేవలం 29 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.

ఈ సీజన్‌లో వైభవ్ కేవలం రికార్డులకే పరిమితం కాకుండా, ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ లేని ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాడు. పవర్ ప్లే ఓవర్లలోనే 30 కంటే ఎక్కువ సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గతంలో అభిషేక్ శర్మ పేరిట ఉన్న 29 సిక్సర్ల రికార్డును ఈ యువ కిశోరం చెరిపివేశాడు. అతని బ్యాటింగ్ శైలి, భయం లేని ఆటతీరు భవిష్యత్తులో భారత జట్టుకు గొప్ప ఆస్తిగా మారుతుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

20 ఏళ్ల లోపు వయసులో టీ20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో వైభవ్ ఇప్పుడు 102 సిక్సర్లతో మొదటి స్థానంలో ఉన్నాడు. అతని వెనుక రహ్మానుల్లా గుర్బాజ్ (90), డెవాల్డ్ బ్రెవిస్ (73) వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. తక్కువ వయసులోనే ఇంతటి పరిణతితో ఆడుతున్న వైభవ్ ప్రదర్శన చూస్తుంటే, క్రికెట్ ప్రపంచంలో ఒక కొత్త శకం మొదలైందని స్పష్టమవుతోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us