కుక్కపిల్లను కాపాడి.. బైక్ పై తిప్పుతున్న డెలివరీ బాయ్స్.. !
మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించే ఘటనలు ఆశ్చర్యపరుస్తుంటాయి. ముంబైలో కారు ప్రమాదంలో గాయపడిన కుక్కపిల్లను కొందరు బ్లింకిట్ డెలివరీ సిబ్బంది చేరదీశారు. దానికి చికిత్స అందించి సంరక్షించారు. ఆ కుక్కపిల్ల వారి గోదాములోనే ఉంటోంది. అంతేకాదు.. డెలివరీ బాయ్స్తో కలిసి బైక్పై డెలివరీలకు కూడా వెళ్తోంది. ఆ ఫొటో వైరల్ కావడంతో నెటిజన్లు డెలివరీ సిబ్బందిని ప్రశంసిస్తున్నారు.

ముంబైకి చెందిన రోషన్ మాత్రే ఇటీవల బ్లింకిట్ యాప్లో కొన్ని వస్తువుల కోసం ఆర్డర్ పెట్టారు. 15 నిమిషాల తర్వాత డెలివరీ పార్ట్నర్ అతని ఇంటికి చేరుకున్నాడు. పార్సిల్ తీసుకోవడానికి కిందకు వెళ్లిన రోషన్కు ఓ ఆసక్తికర దృశ్యం కనిపించింది. డెలివరీ బాయ్ తన బైక్పై కూర్చుని ఉండగా.. అతడి దగ్గర ఓ కుక్కపిల్ల కూడా ఉంది. దీంతో ఆ కుక్కపిల్ల ఎవరిది? అతడి దగ్గర ఎందుకు ఉందని రోషన్ అడిగాడు. డెలివరీ బాయ్ చెప్పిన విషయం విని రోషన్ ఆశ్చర్యపోయాడు. ఆ కుక్కపిల్ల ఇటీవల ఓ కారు టైర్ కింద పడి తీవ్రంగా గాయపడిందని, దాని పరిస్థితి దారుణంగా ఉండేదని వివరించాడు.
గాయపడిన కుక్కపిల్లకు అండగా డెలివరీ సిబ్బంది
కుక్కపిల్ల పరిస్థితిని చూసి బ్లింకిట్ గోదాముకు చెందిన తమ డెలివరీ సిబ్బంది నిర్లక్ష్యం చేయలేదనీ దానిని సంరక్షించి కొద్ది రోజులు జాగ్రత్తగా చూసుకున్నారనీ దాంతో కుక్కపిల్ల కోలుకుందనీ తెలిపాడు. ప్రస్తుతం ఆ కుక్కపిల్ల బ్లింకిట్ గోదాములోనే ఉంటూ డెలివరీ సిబ్బందితో కలిసిపోయి వారితో స్నేహంగా మెలుగుతోందనీ.. అంతేకాదు.. వారు డెలివరీలకు వెళ్లినప్పుడు వారితో పాటే బైక్పై కూడా వెళ్తోందనీ డెలివరీ బాయ్ చెప్పాడు. ఈ విషయాన్ని రోషన్ మాత్రే లింక్డ్ఇన్లో పంచుకున్నారు. మొదట సాధారణ డెలివరీ అనుభవంలా కనిపించిన ఈ ఘటన.. చివరకు మనసును హత్తుకునే కథగా మారింది.
‘బ్లింకిట్ కాదు.. భౌవిట్’ .. నెటిజన్ల కామెంట్లు
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు డెలివరీ సిబ్బందిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. గాయపడిన మూగజీవాన్ని చేరదీసి, దానికి ఆశ్రయం కల్పించడం నిజమైన మానవత్వమని అభిప్రాయపడ్డారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. మొదట ఈ పోస్టును చూసినప్పుడు ఏదైనా సమస్య గురించి చెబుతున్నారని అనుకున్నానని, పూర్తిగా చదివాక చాలా సంతోషంగా అనిపించిందని అన్నాడు. ఇలాంటి మంచి పనులను కూడా సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించాడు. మరో వ్యక్తి స్పందిస్తూ.. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ‘జానే నహీ దేంగే తుఝే’ పాటలోని భావనను గుర్తుచేసే ఘటన ఇదని కామెంట్ చేశాడు. మానవత్వంపై తనకు మళ్లీ నమ్మకం కలిగిందని ఇంకొకరు తెలిపారు. వీధి కుక్కపిల్లను కాపాడటమే కాకుండా, తమతో పాటు తీసుకెళ్తూ ప్రేమగా చూసుకుంటున్న సిబ్బందిని అభినందించారు. మరో నెటిజన్ సరదాగా ‘ఇకపై ఇది బ్లింకిట్ కాదు.. భౌవిట్!’ అంటూ కామెంట్ చేశాడు. చిన్న ప్రాణి కష్టంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేయకుండా, తమకు చేతనైన సాయం అందించిన డెలివరీ సిబ్బంది మంచి మనసుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మూగజీవాల పట్ల ప్రేమ చూపించడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.