Video: సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందే.. అభిమానులకు షాకిచ్చిన వైభవ్ సూర్యవంశీ..!
Vaibhav Sooryavanshi Funny Prank with Fans: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన మెరుపు బ్యాటింగ్‌తోనే కాకుండా, తన అల్లరి చేష్టలతోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల విమానాశ్రయంలో తనను సెల్ఫీ అడిగిన చిన్నారి అభిమానులకు ఒక షరతు పెట్టి వారిని ఆశ్చర్యపరిచాడు. ఈ అద్భుత బ్యాటింగ్ వీరుడు చేసిన సరదా ప్రాంక్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Vaibhav Sooryavanshi Funny Prank with Fans: ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా రాణిస్తున్నాడు. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 57 బంతుల్లోనే సెంచరీ బాది క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. అయితే, మైదానంలో బౌలర్ల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించే ఈ యువ ఆటగాడు, బయట మాత్రం చాలా సరదాగా ఉంటాడని తాజా ఘటన నిరూపించింది. జట్టు తదుపరి మ్యాచ్ కోసం ప్రయాణిస్తున్న సమయంలో విమానాశ్రయంలో కొందరు చిన్నారులు అతనిని ఫోటో అడిగారు.
రూ. 100లు ఇస్తేనే ఫొటో..
తన వద్దకు వచ్చిన అభిమానులతో వైభవ్ మాట్లాడుతూ.. “నేను ఫొటో దిగడానికి డబ్బులు తీసుకుంటాను, నిజంగానే చెబుతున్నాను” అని సీరియస్ ముఖం పెట్టి అన్నాడు. ఆ మాట విన్న చిన్నారులు ఒక్కసారిగా కంగుతిన్నారు. అంతటితో ఆగకుండా, “ఒక్కో ఫొటోకు రూ.100 తీసుకుంటాను, మీరు ఇస్తానంటేనే దిగుతాను” అని షరతు పెట్టాడు. ఒక చిన్నారి వెంటనే జేబులో నుంచి రూ.200 తీసి ఇస్తానని అనడంతో వైభవ్ నవ్వేశాడు. అది కేవలం తమాషా కోసమే చేశానని చెప్పి వారితో సరదాగా ఫోటోలు దిగాడు.
రాజస్థాన్ రాయల్స్ కఠిన సవాలు..
Baccha party always a step ahead 😂 pic.twitter.com/locrozR0Yh
— Rajasthan Royals (@rajasthanroyals) April 27, 2026
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ జట్టు మధ్యంతర దశలో కొంత తడబడుతోంది. తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచినప్పటికీ, తర్వాతి పోరులో నిలకడ కోల్పోయింది. కెప్టెన్ రియాన్ పరాగ్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనున్న నేపథ్యంలో, పరాగ్ తన బ్యాట్‌కు పని చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది.
సూర్యవంశీ అద్భుత ప్రయాణం..
బీహార్‌కు చెందిన ఈ చిన్నారి ఆటగాడు గత సీజన్‌లోనే అరంగేట్రం చేసినా, ఈ ఏడాది ఆడుతున్న తీరు అమోఘం. కేవలం 15 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ వంటి భారీ వేదికపై సెంచరీలు బాదుతూ దిగ్గజాల ప్రశంసలు అందుకుంటున్నాడు. జట్టు వరుస ఓటముల్లో ఉన్నా, సూర్యవంశీ వ్యక్తిగత ప్రదర్శన మాత్రం రాజస్థాన్ అభిమానులకు కొండంత ఆశను ఇస్తోంది. పంజాబ్‌తో జరిగే కీలక పోరులో ఈ యువ కెరటం మళ్లీ చెలరేగాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
