AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heat Wave: వాయమ్మో.. దంచికొడుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి మీరు సేఫ్..

పగటిపూటే కాదు.. రాత్రుల్లో కూడా ఎండ వేడి కొనసాగుతోంది. దీంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇక దేశంలో వడదెబ్బ మరణాలు కూడా పెరుగుతున్నాయి. వడదెబ్బ తలిగిన వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావొచ్చు. దీంతో జాగ్రత్తలు పాటిస్తే బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Heat Wave: వాయమ్మో.. దంచికొడుతున్న ఎండలు.. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ నుంచి మీరు సేఫ్..
Heat Wave
Venkatrao Lella
|

Updated on: May 23, 2026 | 9:15 AM

Share

దేశంలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్‌ను దాటిపోతున్నాయి. కేవలం పగటిపూట మాత్రమే గరిష్ట ఉష్ణోగ్రతలు పరిమితం కావడం లేదు. రాత్రి పూట కూడా వేడి కొనసాగుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, రాత్రుల్లో వేడి, అధికమవుతున్న తేమ, తగ్గుతున్న నేలలోని తేమతో భవిష్యత్తులో మరింత ప్రమాదం ఏర్పడే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 1961 నుండి 2020 మధ్య భారతదేశంలోని కోర్ హీట్‌వేవ్ జోన్ అంతటా వడగాలుల ప్రభావం ప్రతి దశాబ్దానికి 0.1 రోజులు పెరిగింది. ఈ వడగాలుల కాలవ్యవధి కూడా ప్రతి దశాబ్దానికి 0.44 రోజులు పెరిగింది. అదే సమయంలో తీవ్రమైన వడగాలులు మరింత తరచుగా సంభవిస్తూ ఎక్కువ కాలం కొనసాగుతున్నాయి. భారతదేశంలో సగటు రాత్రి ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి సుమారుగా 0.21 డిగ్రీల సెల్సియస్ చొప్పున పెరుగుతున్నాయి.

అయితే అధిక ఉష్ణోగ్రతల క్రమంలో దేశంలో లక్షలాది మంది ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. వేడి సంబంధిత అనారోగ్యాలలో అత్యంత ప్రమాదకరమైన వాటిల్లో ఇది ఒకటి. సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంటుంది. శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా పెరిగి మెదడు, గుండె, మూత్రపిండాలు, కండరాలకు హాని కలిగించే అవకాశం ఉంది. కొన్ని సమయాల్లో ఇది ప్రాణాంతకం కావచ్చు. శరీర అంతర్గత ఉష్ణోగ్రత వేగంగా 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగినప్పుడు వడదెబ్బ తగులుతుంది. దీనికి తక్షణ వైద్య సహాయం అవసరమని, లేకపోతే ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు వెంటనే చికిత్స తీసుకోకపోతే.. అది మెదడుకు గాయం, మూత్రపిండాల వైఫల్యం, గుండె సమస్యలు, కండరాల క్షీణత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులతో పాటు మరణానికి దారితీయవచ్చని హెచ్చరిస్తున్నారు.

వడదెబ్బ బారి నుంచి తప్పించుకోవాలంటే..?

-వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండాలి

-మధ్యాహ్నం వేళల్లో ఎండ తగలకుండా చూసుకోవాలి

-తేలికైన, వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి

-తీవ్రమైన వేడి సమయాల్లో శ్రమతో కూడిన పనుల చేయకూడదు

వడదెబ్బ తగిలితే ఏం చేయాలి..?

-అదనపు దుస్తులను వదులు చేయడం లేదా తొలగించడం చేయాలి

-చర్మానికి చల్లని, తడి టవల్స్ కట్టుకోవాలి

-శరీరంపై చల్లటి నీటిని చల్లాలి

-మెడ, తల, గజ్జలు, చంకలపై ఐస్ ప్యాక్‌లను ఉపయోగించాలి

-వ్యక్తి స్పృహలో, అప్రమత్తంగా ఉంటేనే ద్రవపదార్థాలు అందించాలి

-వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి

వడదెబ్బ లక్షణాలు ఇవే..

-తల తిరగడం లేదా తల భారంగా అనిపించం

-తీవ్రమైన అలసట లేదా బలహీనత

-తలనొప్పి, వికారం లేదా వాంతులు

-శరీరంలో అధిక వేడి అనుభూతి

-ఆకస్మిక అలసట, అధికంగా చెమట పట్టడం

-వేగవంతమైన హృదయ స్పందన, కండరాల తిమ్మిర్లు

Follow Us