IND vs BAN: టీమిండియా కెప్టెన్‌కు ‘నో షేక్ హ్యాండ్’.. ఆ వివాదంపై దిగొచ్చిన బంగ్లాదేశ్
India vs Bangladesh No Handshake Controversy: ఈ విజయోత్సవంతో భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా, టాస్ వివాదానికి బంగ్లాదేశ్ బోర్డు వివరణతో ప్రస్తుతానికి తెరపడినట్లయింది. మరి ముందుముందు ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందోనని ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

India vs Bangladesh No Handshake Controversy: జింబాబ్వే వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. టాస్ సమయంలో ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం (Handshake) చేసుకోకుండా వెనుదిరగడం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే రాజకీయ, క్రికెట్ సంబంధాల్లో ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, ఈ సంఘటన ప్రాధాన్యత సంతరించుకుంది. తాజాగా దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధికారికంగా స్పందించింది.
శనివారం బులవాయోలో జరిగిన గ్రూప్-ఏ మ్యాచ్‌లో భారత కెప్టెన్ ఆయుష్ మ్హత్రే, బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్ కోసం మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన అనంతరం ఇద్దరూ కనీసం ఒకరినొకరు పలకరించుకోకుండా, కరచాలనం చేసుకోకుండా నేరుగా బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడేందుకు వెళ్లారు. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో టాస్ ముగిసిన తర్వాత కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆనవాయితీ. కానీ, ఇక్కడ అది జరగకపోవడంతో ‘నో హ్యాండ్‌షేక్ పాలసీ’ ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) వివరణ..
ఈ వివాదం ముదురుతుండటంతో బీసీబీ శనివారం సాయంత్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. “టాస్ సమయంలో భారత కెప్టెన్‌తో కరచాలనం చేయకపోవడం పూర్తిగా అనాలోచితంగా జరిగింది. అది ఏమాత్రం ఉద్దేశపూర్వకం కాదు. కేవలం ఏకాగ్రత లోపం వల్లే అలా జరిగింది. ప్రత్యర్థి జట్టు పట్ల మాకు ఎటువంటి అగౌరవం లేదు” అని బోర్డు స్పష్టం చేసింది.
కెప్టెన్ అనారోగ్యం..
నిజానికి బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజిజుల్ హకీమ్ అనారోగ్యం కారణంగా టాస్ కోసం రాలేదు. అతని స్థానంలో వచ్చిన వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్, ఒత్తిడిలో ఉండటం వల్ల ఈ ఆనవాయితీని మర్చిపోయి ఉండవచ్చని బోర్డు పేర్కొంది. క్రీడా స్ఫూర్తిని కాపాడటం ప్రతి ఆటగాడి బాధ్యత అని, దీనిని తాము సీరియస్‌గా తీసుకున్నామని.. జట్టు మేనేజ్‌మెంట్‌కు కూడా తగిన సూచనలు జారీ చేశామని బీసీబీ తెలిపింది.
మైదానంలో ఎంత ఉద్రిక్తత ఉన్నప్పటికీ, ఆట ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు చాలా స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా వైభవ్ సూర్యవంశీ (72), అభిజ్ఞాన్ కుందు (80) రాణించడంతో 238 పరుగులు చేసింది. వర్షం కారణంగా లక్ష్యాన్ని సవరించగా, బంగ్లాదేశ్ చివరకు 18 పరుగుల తేడాతో (DLS పద్ధతిలో) ఓటమి పాలైంది. భారత బౌలర్ విహాన్ మల్హోత్రా 4 వికెట్లతో చెలరేగి టీమ్ ఇండియా విజయానికి కీలక పాత్ర పోషించాడు.
