WI vs IND: అర్ధసెంచరీతో రప్ఫాడించిన తెలుగబ్బాయి.. మరో రికార్డును ఖాతాలో వేసుకున్న తిలక్ వర్మ..

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా శుభారంభం అందించడంలో విఫలమైంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కేవలం 7 పరుగుల వద్ద అల్జారీ జోసెఫ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు చేసే యత్నంలో సూర్యకుమార్ యాదవ్ (1) రనౌట్ అయ్యాడు.

WI vs IND: అర్ధసెంచరీతో రప్ఫాడించిన తెలుగబ్బాయి.. మరో రికార్డును ఖాతాలో వేసుకున్న తిలక్ వర్మ..
Tilak Varma

Updated on: Aug 06, 2023 | 11:56 PM

గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న 2వ టీ20 మ్యాచ్‌లో టీమిండియా మరోసారి తడబడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది. తెలుగబ్బాయి తిలక్‌ వర్మ మరోసారి అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అతను తప్ప మరెవరూ రాణించకపోవడంతో టీమిండియా నామమాత్రపు స్కోరు మాత్రమే చేసింది. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ ఇండియా శుభారంభం అందించడంలో విఫలమైంది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కేవలం 7 పరుగుల వద్ద అల్జారీ జోసెఫ్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. ఆ తర్వాత వేగంగా పరుగులు చేసే యత్నంలో సూర్యకుమార్ యాదవ్ (1) రనౌట్ అయ్యాడు. మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న ఇషాన్ కిషన్ 23 బంతులు ఎదుర్కొని 27 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో గత మ్యాచ్‌లో మెరిసిన తిలక్‌ వర్మనే మరోసారి టీమిండియాకు పెద్ద దిక్కుగా మారాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన ఈ తెలుగు కుర్రాడు క్రీజులో నిలదొక్కాక 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, ఒక సిక్స్‌ ఉన్నాయి.

అర్ధసెంచరీ అనంతరం తిలక్ వర్మ (51 పరుగులు, 41 బంతుల్లో) బౌండరీ లైన్ వద్ద క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. కాగా ఆఖరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ కూడా పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. 18 బంతుల్లో 24 పరుగులు చేసిన పాండ్యా అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అలాగే అక్షర్ పటేల్ (14) కూడా 20వ ఓవర్ తొలి బంతికే వికెట్ చేజార్చుకున్నాడు. చివరి ఓవర్లో అర్షదీప్ సింగ్ కొట్టిన ఫోర్, రవి బిష్ణోయ్ కొట్టిన సిక్సర్ తో టీమిండియా స్కోరు 7 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది . విండీస్‌ బౌలర్లలో అఖిల్‌ హోస్సెన్‌, అల్జారీ జోసెఫ్‌, రొమారియో షెపర్డ్‌ తలా 2 వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో అర్ధసెంచరీ చేయడం ద్వారా మరో రికార్డును కొల్లగొట్టాడు తిలక్‌ వర్మ. 20 ఏళ్ల 271 రోజుల వయసులో అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో హాఫ్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన రెండో భారతీయుడిగా తిలక్ నిలిచాడు.  రోహిత్‌ శర్మ ఈ లిస్టులో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..