Tilak Varma : ఒకే సారి రెండు పదవులు.. హైదరాబాద్ కుర్రోడికి డబుల్ ధమాకా
Tilak Varma : తిలక్ వర్మకు భారత్ ఏ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు బీసీసీఐ అప్పగించింది. శ్రీలంక వన్డే సిరీస్‌లో జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ సూచనలు ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యా పేరు లేకపోవడం చర్చనీయాంశమైంది. వైస్ కెప్టెన్‌గా కూడా అతనికి పదవి దక్కింది.

Tilak Varma : భారత యువ క్రికెటర్, హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మకు బీసీసీఐ కీలక బాధ్యతలను అప్పగించింది. శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత ఎ జట్టుకు కెప్టెన్‌గా తిలక్‌ను నియమిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. అక్కడ జరగబోయే ముక్కోణపు వన్డే సిరీస్‌లో తిలక్ వర్మ భారత జట్టును ముందుండి నడిపించబోతున్నాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌తో పాటు శ్రీలంక ‘ఎ’, ఆఫ్ఘనిస్తాన్ ‘ఎ’ జట్లు తలపడనున్నాయి. ఈ ప్రతిష్టాత్మక ముక్కోణపు సిరీస్ జూన్ 9 నుంచి జూన్ 21, 2026 వరకు జరగనుంది. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు శ్రీలంకలోని ప్రసిద్ధ రంగిరి దంబూల్లా ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఈ సిరీస్ డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో సాగుతుంది. అంటే ప్రతి జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జూన్ 21న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టుకు 2 పాయింట్లు, డ్రా అయితే 1 పాయింట్ ఇస్తారు.
రోహిత్ శర్మకు క్రెడిట్.. పాండ్యాకు హ్యాండ్
ఈ టోర్నీ ప్రారంభానికి ముందు తిలక్ వర్మ రెవ్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్సీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను నాయకత్వ బాధ్యతల గురించి సీనియర్ ఆటగాళ్లతో ఎప్పుడూ చర్చిస్తూ ఉంటానని చెప్పాడు. ముఖ్యంగా రోహిత్ శర్మతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా కింద తిలక్ వర్మ ఆడినప్పటికీ.. కెప్టెన్సీ పాఠాల గురించి మాట్లాడుతూ హార్దిక్ పేరును అస్సలు ఎత్తకపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఒత్తిడిని ఎలా జయించాలో చెప్పిన రోహిత్
తన ఇంటర్వ్యూలో తిలక్ మాట్లాడుతూ.. ‘నేను రోహిత్ భాయ్‌తో మాట్లాడినప్పుడల్లా మా మధ్య ఎక్కువగా బ్యాటింగ్ గురించి చర్చ రాదు. మేము కెప్టెన్సీ గురించే మాట్లాడుకుంటాం. మైదానంలో తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, చిన్న చిన్న విషయాలపై ఎలా దృష్టి పెట్టాలి అనే విషయాలను రోహిత్ భాయ్ నాకు క్లియర్‌గా వివరించాడు. ఆయన ఇచ్చిన సలహాలు, నేర్పిన పాఠాలను రాబోయే మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా ఉపయోగిస్తాను’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
Tilak Varma reveals Gautam Gambhir’s long-term blueprint for him as a Leader More in Revsportz YT – Reports @rohitjuglan from Dambulla pic.twitter.com/oXymklBUq9
— RevSportz Global (@RevSportzGlobal) June 8, 2026
టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్
తిలక్ వర్మకు కేవలం ఇండియా ‘ఎ’ కెప్టెన్సీ మాత్రమే కాదు.. ఏకంగా సీనియర్ టీమిండియా టీ20 జట్టు వైస్ కెప్టెన్సీ పదవి కూడా దక్కింది. రాబోయే ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్‌ల కోసం కొత్తగా నియమితుడైన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ బాధ్యతలు చేపట్టనున్నాడు. శ్రీలంక ముక్కోణపు సిరీస్ ముగిసిన వెంటనే తిలక్ ఐర్లాండ్‌కు బయలుదేరి వెళ్తాడు. అక్కడ జూన్ 26, జూన్ 28 తేదీల్లో రెండు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.
తిలక్ వర్మ కెప్టెన్సీ రికార్డులు ఇవే
తిలక్ వర్మకు కెప్టెన్సీ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ అతను పలు టోర్నీల్లో భారత్‌ను విజయవంతంగా నడిపించాడు. 2024 చివర్లో ఒమన్‌లో జరిగిన ఎమర్జింగ్ ఆసియా కప్‌లో ఇండియా ‘ఎ’ జట్టుకు తిలక్ నాయకత్వం వహించాడు. అంతేకాకుండా, స్వదేశంలో సౌతాఫ్రికా ‘ఎ’ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల అఫీషియల్ వన్డే సిరీస్‌లోనూ తిలక్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలోనే భారత్ ఆ సిరీస్‌ను 2-1 తో గెలుచుకుని సత్తా చాటింది. మైదానంలో ప్రణాళికలు రచించడంలో తిలక్ వర్మకు మంచి పట్టు ఉందని ఈ రికార్డులు నిరూపిస్తున్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
