AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket Facts : క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే

Cricket Facts : క్రికెట్‌లో హ్యాట్రిక్ పదం 1858లో మొదలైంది. బౌలర్ స్టీఫెన్సన్ వరుసగా 3 వికెట్లు తీసినందుకు అభిమానులు టోపీని బహుమతిగా ఇవ్వడంతో హ్యాట్రిక్ అనే పేరు స్థిరపడిపోయింది. మూడు వికెట్లు తీయడం గొప్ప ట్రిక్ అని భావించి, దానికి హ్యాట్ జోడించి.. కాలక్రమేణా హ్యాట్రిక్ అని పిలవడం అలవాటుగా మారింది.

Cricket Facts : క్రికెట్‌లో హ్యాట్రిక్ అంటే ఏంటి? ఆ పేరు ఎలా వచ్చింది? దీని వెనుక ఉన్న అసలు కథ ఇదే
Hat Trick
Rakesh
|

Updated on: Mar 23, 2026 | 4:07 PM

Share

Cricket Facts : క్రికెట్ మైదానంలో బ్యాటర్లు సెంచరీలు బాదితే వచ్చే కిక్కు ఒక ఎత్తు అయితే, బౌలర్ వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ పంపితే వచ్చే జోష్ మరో ఎత్తు. దీనినే మనం హ్యాట్రిక్ అని పిలుచుకుంటాం. అయితే, అస్సలు ఈ హ్యాట్రిక్ అనే పదానికి, క్రికెట్‌కు సంబంధం ఏంటి? మూడు వికెట్లు తీస్తే హ్యాట్ (టోపీ) అని ఎందుకు అంటారు? దీని వెనుక 168 ఏళ్ల నాటి ఒక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఆ విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

1858లో మొదలైన అసలు కథ

హ్యాట్రిక్ అనే పదం 19వ శతాబ్దంలో ఇంగ్లాండ్ గడ్డపై పుట్టింది. 1858లో జరిగిన ఒక మ్యాచ్‌ ఈ పదానికి పునాది వేసింది. హీత్‌ఫీల్డ్ హార్మన్ స్టీఫెన్సన్ అనే బౌలర్ ఆ రోజుల్లో రౌండ్‌ ఆర్మ్ బౌలింగ్‌తో బ్యాటర్లను హడలెత్తించేవాడు. ఆయన ఆల్ ఇంగ్లాండ్ టీమ్ తరపున ఆడుతూ హలామ్ అండ్ స్టేవ్లీ జట్టుపై వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. ఆ కాలంలో ఇది ఒక అసాధారణమైన ఘనత. స్టీఫెన్సన్ ప్రదర్శనకు ఫిదా అయిన అభిమానులు, తోటి ఆటగాళ్లు ఆయనను వినూత్నంగా గౌరవించాలని అనుకున్నారు.

వికెట్లకు.. టోపీకి లింక్ ఏంటి?

స్టీఫెన్సన్ వరుసగా మూడు వికెట్లు తీసిన తర్వాత, మైదానంలోని అభిమానులందరూ కలిసి చందాలు పోగుచేశారు. ఆ డబ్బుతో ఒక కొత్త హ్యాట్(టోపీ)ని కొని, దాన్ని స్టీఫెన్సన్‌కు బహుమతిగా ఇచ్చారు. అంటే, వరుసగా మూడు వికెట్లు తీసిన బౌలర్‌కు ఒక టోపీని బహుమతిగా ఇచ్చే సంప్రదాయం అక్కడ మొదలైంది. మూడు వికెట్లు తీయడం అనేది ఒక గొప్ప ట్రిక్ అని భావించి, దానికి హ్యాట్ బహుమతిని జోడించి.. కాలక్రమేణా ఆ ఘనతను హ్యాట్రిక్ అని పిలవడం అలవాటుగా మారింది.

అచ్చులో కనిపించిన తొలి హ్యాట్రిక్

ఈ పదం మొదట వాడుకలోకి వచ్చినప్పటికీ, 1878-79లో ఫ్రెడ్ స్పాఫోర్త్ టెస్ట్ క్రికెట్‌లో మొదటి హ్యాట్రిక్ సాధించినప్పుడు వార్తాపత్రికలు తొలిసారిగా హ్యాట్రిక్ అనే పదాన్ని అధికారికంగా వాడాయి. అప్పటి నుంచి క్రికెట్ భాషలో ఈ పదం విడదీయలేని భాగమైపోయింది. నేడు క్రికెట్ మాత్రమే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో కూడా వరుసగా మూడు గోల్స్ చేసినా లేదా మూడు విజయాలు సాధించినా హ్యాట్రిక్ అని పిలుస్తున్నారు. కానీ దీని మూలాలు మాత్రం 1858 నాటి క్రికెట్ మైదానంలోనే ఉన్నాయి.

ఆధునిక క్రికెట్‌లో హ్యాట్రిక్ ప్రాముఖ్యత

నేటి టీ20, వన్డే క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడం మరింత కష్టతరంగా మారింది. బ్యాటర్లు ఎదురుదాడి చేస్తున్న తరుణంలో, బౌలర్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి మూడు వరుస వికెట్లు తీయడం అనేది అత్యున్నత ప్రదర్శనగా పరిగణించబడుతుంది. భారత్ తరపున చేతన్ శర్మ మొదలుకొని కపిల్ దేవ్, కుల్దీప్ యాదవ్, షమీ వంటి బౌలర్లు అంతర్జాతీయ వేదికలపై హ్యాట్రిక్ తీసి చరిత్ర సృష్టించారు. కాబట్టి, వచ్చేసారి ఏదైనా మ్యాచ్‌లో బౌలర్ హ్యాట్రిక్ తీసినప్పుడు.. అది కేవలం మూడు వికెట్లు మాత్రమే కాదు, 160 ఏళ్ల నాటి ఒక అద్భుతమైన సంప్రదాయంగా గుర్తుండిపోతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us