Shoaib Akhtar: ఆ రోజు నేను చేసింది తప్పే.. అక్తర్‌కు మిలియన్ సార్లు క్షమాపణలు చెబుతున్నా: పీటీవీ హోస్ట్
Shoaib Akhtar - Dr Nauman Niaz: టీవీ యాంకర్, పాకిస్తాన్ మాజీ టెలివిజన్ హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్ వారం క్రితం లైవ్ టీవీ షోలో షోయబ్ అక్తర్‌తో తన దుష్ప్రవర్తనకు క్షమాపణలు తెలిపాడు.
Shoaib Akhtar – Dr Nauman Niaz: అక్టోబరు 27న పీటీవీ స్పోర్ట్స్ ప్రోగ్రాం “గేమ్ ఆన్ హై” కోసం వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ సర్ వివియన్ రిచర్డ్స్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ డేవిడ్ గోవర్, మాజీ పాకిస్థాన్ మహిళా కెప్టెన్ సనా మీర్, మాజీ ఫాస్ట్ బౌలర్ ఉమర్ వంటి అతిథులతో పాటుగా టీవీ యాంకర్, పాకిస్తాన్ మాజీ టెలివిజన్ హోస్ట్ డాక్టర్ నౌమాన్ నియాజ్, పాకిస్తాన్ మాజీ పేసన్ షోయబ్ అక్తర్ కూడా ప్యానెల్‌లో భాగమయ్యారు. పాక్-న్యూజిలాండ్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో పాక్ విజయం సాధించడంపై ప్యానెల్ చర్చిస్తోంది. పాకిస్తాన్ జట్టుపై చర్చ సందర్భంగా, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రవూఫ్‌ల ప్రతిభను వెలికితీసినందుకుగాను అక్తర్ పాకిస్తాన్ సూపర్ లీగ్ ఫ్రాంచైజీ లాహోర్ క్వాలండర్స్‌ను మొచ్చుకున్నాడు.
అక్తర్ వ్యాఖ్యలను తప్పంటూ నౌమాన్ నియాజ్ గొడవకు దిగాడు. “మీరు కొంచెం మొరటుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి నేను ఈ విషయం చెప్పదలచుకోలేదు. మీరు అతి తెలివిగా ఉంటే ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు. ఈ విషయాలను మేం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాం” అంటూ అక్తర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపాడు.
విరామం అనంతరం కార్యక్రమం పునఃప్రారంభం కావడంతో అక్తర్ ప్యానెల్‌లోని అతిథులకు నియాజ్ క్షమాపణలు తెలిపాడు. అలాగే పీటీవీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. జాతీయ టెలివిజన్‌లో నా ప్రవర్తన కారణంగా ఆ ప్రోగ్రామ్‌ను కొనసాగించలేనని పేర్కొన్నాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వీరిద్దరూ ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండ్ అయ్యారు. అలాగే వీరి గొడవకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. దీంతో అక్తర్ ఓ వీడియో సందేశాన్ని కూడా విడుదల చేయడం గమనార్హం.
ఈ పరిణామాలతో ఈ గొడవపై పీటీవీ విచారణ ప్రారంభించింది. విచారణ పూర్తయ్యే వరకు డాక్టర్ నియాజ్, అక్తర్ పాల్గొన్న కార్యక్రమాలను ప్రసారం చేయకూడదని పేర్కొంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో జర్నలిస్ట్ రౌఫ్ క్లాస్రాతో ఇంటర్వ్యూలో డాక్టర్ నియాజ్ తన తప్పుని నిజాయితీగా ఒప్పుకున్నాడు. ఆరోజు జరిగినదానికి క్షమాపణలు కూడా తెలిపాడు.
అయితే షోయబ్ అక్తర్ పీటీవీతో చేసుకున్ కొన్ని ఒప్పందాలను ఉల్లఘించాడని నియాజ్ ఆరోపించారు. ” అక్టోబరు 17న షోయబ్ ఓ కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. కానీ, అతను దుబాయ్‌కి వెళ్లి హర్భజన్ సింగ్‌తో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొన్నాడు. రెండు రోజుల తర్వాత పీటీబీ షో కోసం తిరిగి వస్తానని తెలిపాడని, కానీ, మరలా ఆ షోకు హాజరుకాలేదు” అని ఆయన తెలిపాడు.
అక్తర్ ఒక బ్రాండ్ ప్లేయర్ అని, పీటీవీతో చేసుకున్న ఒప్పందంలోని క్లాజ్-5 మేరకు అక్తర్ మరే ఇతర టాక్ షోలో పాల్గొనకుండా పూర్తిగా నిరోధించిందని నియాజ్ స్పష్టం చేశాడు. అయితే ఈ కాలంలో షోయబ్ ఇతర ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నాడని ఆయన పేర్కొన్నాడు. మొత్తానికి ఇద్దరి మధ్య ఓ ఒప్పందం కుదిరిందని, అందుకే క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.