Shane warne: షేన్ వార్న్ గదిలో రక్తపు మరకలపై థాయ్ పోలీసుల స్పందన.. వార్న్ అందుకే మరణించాడని వెల్లడి..
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. అతని గదిలో రక్తపు మరకలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి...
స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ మరణంపై పలు ప్రశ్నలు తలెత్తాయి. అతని గదిలో రక్తపు మరకలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై థాయ్‌లాండ్ పోలీసులు ఓ ప్రకటన చేశారు. వార్న్‌ది సహజ మరణమేనని తేల్చారు. సోమవారం వార్న్ మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించిన అనంతరం.. ఆయనది సహజ మరణమేనని వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. వార్న్ మృతదేహానికి శవ పరీక్ష నిర్వహించిన వైద్యులు అందించిన నివేదికను.. వార్న్ కుటుంబ సభ్యులకు, ఆస్ట్రేలియా రాయబార కార్యాలయానికి పంపినట్లు థాయ్‌లాండ్ పోలీసుల ప్రతినిధి కిస్సానా పథనాచెరోన్ తెలిపారు.
వార్న్ గుండెపోటుతోనే లెజెండరీ క్రికెటర్ తుదిశ్వాస విడిచాడని వైద్యులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు . కాగా వార్న్ హఠాన్మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు థాయ్‌ల్యాండ్ పోలీసులు. విచారణలో భాగంగా అతడు బస చేసిన విల్లాలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కాగా వార్న్ మరణించిన గదిలో ఫ్లోర్, టవల్స్‌పై రక్తపు మరకలు గుర్తించామని థాయ్ పోలీసులు షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ థాయ్ మీడియా కూడా కథనాలను ప్రసారం చేసింది. దీంతో వార్న్ మృతిపై ఒక్కసారిగా అనుమానాలు రేకెత్తాయి. దీంతో వార్న్ పార్థివ దేహానికి పోస్ట్ మార్టం నిర్వహించారు.
వార్న్ హఠాన్మరణంపై ఆయన కుటుంబ సభ్యులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదని కిస్సానా వెల్లడించారు. అయితే, వార్న్ మృతదేహాన్ని ఆస్ట్రేలియాకు ఎప్పుడు పంపుతారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, వార్న్ మరణానికి గల కారణాన్ని థాయ్‌లాండ్ పోలీసులు వెల్లడించలేదు. థాయ్‌లాండ్‌లోని రెండో అతి పెద్ద ద్వీపమైన కోహ్ సమూయిలోని తన రిసార్ట్‌లో శుక్రవారం.. అచేతనంగా పడి ఉన్న వార్న్‌ని తన వ్యక్తిగత సిబ్బంది హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయిన విషయం తెలిసిందే.