Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగబ్బాయ్ సంచలనం.. టాప్ 3లోకి దూసుకెళ్లిన హైదరాబాదీ స్టార్..!

Tilak Varma: తిలక్ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ప్రవేశించడం భారత క్రికెట్‌కు శుభసూచకం. అతని నిలకడైన ప్రదర్శన, బ్యాటింగ్‌లోని పరిణతి భవిష్యత్తులో భారత జట్టుకు ఒక కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అతడిని నిలబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు.

టీ20 ర్యాంకింగ్స్‌లో తెలుగబ్బాయ్ సంచలనం.. టాప్ 3లోకి దూసుకెళ్లిన హైదరాబాదీ స్టార్..!
Tilak Varma
Follow us
Venkata Chari

|

Updated on: Jun 11, 2025 | 7:41 PM

ICC T20I Batsman Rankings: టీమిండియా యువ సంచలనం, హైదరాబాద్‌కు చెందిన తిలక్ వర్మ తన అద్భుతమైన ప్రదర్శనలతో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు. తాజాగా విడుదలైన ఐసీసీ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో తిలక్ వర్మ ఏకంగా నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి దూసుకెళ్లి సంచలనం సృష్టించాడు. ఈ అద్భుతమైన పురోగతి అతడి నిలకడైన ఆటతీరు, భవిష్యత్ లో భారత జట్టుకు కీలక ఆటగాడిగా మారగల సామర్థ్యాన్ని చాటి చెబుతోంది.

ర్యాంకింగ్స్‌లో మార్పులు, తిలక్ వర్మ దూకుడు..

తాజా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం, ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ ట్రావిస్ హెడ్ 856 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. భారత యువ సంచలనం అభిషేక్ శర్మ 829 పాయింట్లతో రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ఈ జాబితాలో తిలక్ వర్మ 804 పాయింట్లతో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్ నుంచి ఇంగ్లాండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన పేరును ఉపసంహరించుకోవడంతో, అతని ర్యాంకు పడిపోయి తిలక్ వర్మకు ఈ లాభం చేకూరింది. సాల్ట్ ఒక స్థానం దిగజారి నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

సూర్యకుమార్‌కు బిగ్ షాక్..

ఇక టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు ఈ తాజా ర్యాంకింగ్స్‌లో నిరాశ ఎదురైంది. 772 పాయింట్లతో సూర్య ఒక స్థానం దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు. అతని స్థానాన్ని ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఆక్రమించాడు.

తిలక్ వర్మ నిలకడ..

తిలక్ వర్మ టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అతను తన చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌తో ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2025 ఫిబ్రవరి 2న ఆడాడు. ఆ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లలో 44.33 సగటుతో 133 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా, తిలక్ వర్మ ఇప్పటివరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 49.93 సగటుతో, 155 స్ట్రైక్ రేట్‌తో 749 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతను రెండు సెంచరీలు కూడా నమోదు చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్‌లో అతని రెండు సెంచరీలు (120*, 107*), ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అతడి కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది.

తిలక్ వర్మ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్ 3లోకి ప్రవేశించడం భారత క్రికెట్‌కు శుభసూచకం. అతని నిలకడైన ప్రదర్శన, బ్యాటింగ్‌లోని పరిణతి భవిష్యత్తులో భారత జట్టుకు ఒక కీలకమైన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా అతడిని నిలబెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరపున కూడా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన తిలక్, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో తన సత్తా చాటుతున్నాడు. ఈ తెలుగింటి యువ సంచలనం మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని కోరుకుందాం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..