
Team India ODI Captain Rohit Sharma: భారత క్రికెట్ జట్టు సారథి, ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 ముగిసిన తర్వాత తన ఎడమ హ్యామ్‌స్ట్రింగ్‌కు శస్త్రచికిత్స చేయించుకోవాలని రోహిత్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. 2027లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పూర్తి ఫిట్‌నెస్‌తో బరిలోకి దిగడమే దీని ప్రధాన లక్ష్యమని సమాచారం.
గత ఐదేళ్లుగా రోహిత్ శర్మ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. అయితే, భారత జట్టుకు 3 ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నందున, బిజీ షెడ్యూల్ కారణంగా ఈ సమస్యకు చికిత్స చేయించుకునేందుకు అతనికి సమయం దొరకలేదు. ఇటీవలే టెస్ట్ క్రికెట్, టీ20ల నుంచి రిటైర్ అయిన నేపథ్యంలో రోహిత్ షెడ్యూల్ ఖాళీగా మారింది. ఆగస్టులో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ తర్వాత, అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో తదుపరి వన్డే సిరీస్ ఉంది. ఈ మధ్యలో లభించే సమయాన్ని రోహిత్ శస్త్రచికిత్సకు, దాని నుంచి కోలుకోవడానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.
ఐపీఎల్ 2025 తర్వాత, అంతర్జాతీయ వన్డే షెడ్యూల్ తక్కువగా ఉంది. రోహిత్ శర్మకు ఈ సర్జరీ చేయించుకోవడానికి ఇది సరైన సమయంగా మారింది. గతంలో 2016 నవంబర్‌లో క్వాడ్రిసెప్స్ సర్జరీ చేయించుకున్నప్పుడు, పూర్తిగా కోలుకోవడానికి మూడు నెలల సమయం పట్టింది. అలాంటి సుదీర్ఘ విరామం మళ్లీ దొరకదనే ఆలోచనతోనే రోహిత్ ఇన్నాళ్లు ఈ సర్జరీని వాయిదా వేస్తూ వచ్చాడని సమాచారం.
“రోహిత్ 2027 ప్రపంచకప్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలంటే, ఈ సమయంలో సర్జరీ చేయించుకోవడం సరైనది. నాయకత్వ బాధ్యతల కారణంగా అతను చాలా సంవత్సరాలుగా దీనిని వాయిదా వేస్తున్నాడు. కానీ, ఇప్పుడు షెడ్యూల్ అతనికి పూర్తిగా కోలుకోవడానికి వీలు కల్పిస్తుంది” అని రోహిత్ సన్నిహితుడు తెలిపాడంట.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. అతని హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగానే అతను పూర్తి స్థాయిలో ఫీల్డింగ్ చేయలేకపోతున్నాడని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో అతని బ్యాటింగ్ స్థిరత్వంపై కూడా ఈ గాయం ప్రభావం చూపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2027 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించాలనే రోహిత్ శర్మ లక్ష్యం నెరవేరాలంటే, ఈ హ్యామ్‌స్ట్రింగ్ సమస్యను పూర్తిగా నయం చేసుకోవడం అత్యవసరం. ఈ సర్జరీ ద్వారా రోహిత్ పూర్తిగా కోలుకొని, 2027 ప్రపంచకప్‌లో తన పూర్తి సత్తాతో ఆడతాడని అభిమానులు ఆశిస్తున్నారు. అయితే, ఈ విషయమై బీసీసీఐ లేదా రోహిత్ శర్మ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..