Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ ముందు టీమిండియాకు బిగ్ షాక్! తండ్రి చనిపోవడంతో..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలోనే సరిగ్గా టోర్నీ ఆరంభానికి ముందు జట్టుకు కీలకమైన వ్యక్తి దూరం అయ్యాడు. తండ్రి మరణంతో అతను స్వదేశానికి వచ్చేశాడు. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

పటిష్టమైన 8 జట్ల మధ్య జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి పాకిస్థాన్ హోస్ట్ కంట్రీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు తలపడతాయి. ఇక టీమిండియా తమ తొలి మ్యాచ్‌ను ఈ నెల 20న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. అయితే టోర్నీ ఆరంభానికి కొన్ని గంట ముందు, టీమిండియా ఫస్ట్ మ్యాచ్‌కు రెండు రోజుల మందు భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియాకు ప్రధాన బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్నే మోర్కెల్, జట్టును వీడి తన స్వదేశం సౌతాఫ్రికాకు వెళ్లిపోయాడు. మోర్కెల్ తండ్రి మరణించడంతో అతను టీమిండియాను వీడాల్సి వచ్చింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమిండియాతో కలిసి దుబాయ్ వెళ్లిన మోర్కెల్, ఆదివారం ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. కానీ, సోమవారం మాత్రం అతను టీమ్‌తో కనిపించలేదు. తండ్రి మరణ వార్త తెలియగానే, బీసీసీఐ నుంచి అనుమతి తీసుకొని, హుటాహుటిన దుబాయ్ నుంచి సౌతాఫ్రికాకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ దుఃఖ సమయంలో బీసీసీఐ మోర్కెల్‌కు అండగా నిలుస్తూ.. వెంటనే అతని ప్రయాణ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అయితే మోర్కెల్ ఎప్పుడు తిరిగి వస్తాడనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు. ఈ బాధ నుంచి అతను బయటపడి, టీమిండియాతో మళ్లీ జత కలవాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఎందుకంటే.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో జట్టుతో పాటు ప్రధాన కోచ్ లేకపోతే, బౌలర్లను టోర్నీకి ట్రైన్ చేయడం కష్టంగా మారుతోంది. ఇది హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌పై ఒత్తిడిని పెంచుతుంది.
పైగా ఇప్పటికే టీమిండియా ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. జట్టుతలో ఉన్న ఏకైక సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ ఒక్కడే. అతను కూడా అంత మంచి టచ్‌లో లేదు. ఒక మిగిలిన ఇద్దరు అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఇద్దరూ యంగ్ బౌలర్లు. వారికి వన్డేలు ఆడిన అనుభవం పెద్దగా లేదు. రాణా అయితే ఇటీవలె ఇంగ్లండ్‌తో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌తోనే అరంగేట్రం చేశాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రధాన బౌలింగ్ కోచ్‌గా ఉన్న మోర్కెల్ లేకపోవడం కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ మోర్కెల్‌కు ప్రత్యాన్నాయంగా ఎవరినైనా తీసుకుంటుందా? లేక మోర్కెల్ వీలైనంత త్వరగా వచ్చి టీమ్‌తో జతకలుస్తుడా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




