USA vs PAK, T20 World Cup 2024: పాక్ పరువు పాయే.. పసికూన చేతిలో ఘోర పరాభవం.. సూపర్-8కి కష్టమే!

|

Jun 07, 2024 | 8:31 AM

టీ20 ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న యూఎస్ఏ జట్టు మాజీ ఛాంపియన్, పటిష్టమైన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో యూఏస్‌ఏ సూపర్‌ ఓవర్‌ విజయం సాధించింది.

USA vs PAK, T20 World Cup 2024: పాక్ పరువు పాయే.. పసికూన చేతిలో ఘోర పరాభవం.. సూపర్-8కి కష్టమే!
Pakistan Cricket Team
Follow us on

టీ20 ప్రపంచకప్ లో పెను సంచలనం నమోదైంది. టోర్నీకి ఆతిథ్యమిస్తున్న యూఎస్ఏ జట్టు మాజీ ఛాంపియన్, పటిష్టమైన పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించింది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్ లో యూఏస్‌ఏ సూపర్‌ ఓవర్‌ విజయం సాధించింది. గురువారం (జూన్ 06) టెక్సాస్‌లోని గ్రాండ్‌ ప్రైరీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 160 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 19 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు 1 వికెట్ కోల్పోయి 13 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 5 పరుగుల తేడాతో పాక్ పరాజయం పాలైంది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టుకు శుభారంభం లభించలేదు. 5 ఓవర్లలోపే ఆ జట్టు టాప్ ఆర్డర్ బ్యాటర్లు ముగ్గురు పెవిలియన్‌ చేరారు. 5 ఓవర్లు ముగిసే సరికి దాయాది జట్టు 3 వికెట్లు కోల్పోయి 26 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలి 10 ఓవర్ల వరకు మ్యాచ్‌లో అమెరికా జట్టు పట్టు సాధించింది. అయితే ఆ తర్వాత కెప్టెన్ బాబర్ ఆజం, షాదాబ్ ఖాన్ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. బాబర్ 43 పరుగులతో ఆకట్టుకోగా, షాదాబ్ 40 పరుగులు చేశాడు. చివర్లో షాహీన్ అఫ్రిది 23 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పాక్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 159 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేసింది.

ఇవి కూడా చదవండి

యూఎస్ఏ ఆటగాళ్ల సంబరాలు..

 

 

మోనాక్ కెప్టెన్ ఇన్నింగ్స్

అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అమెరికా జట్టు శుభారంభం లభించింది. ఆ జట్టు 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓపెనర్ స్టీవెన్ టేలర్ 12 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ మోనాంక్ పటేల్, ఆండ్రీస్ గూస్ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆండ్రీస్ గూస్ 35 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ మోనాక్ పటేల్ కూడా వెంటనే ఔటయ్యాడు. దీంతో సులువుగా లక్ష్యాన్ని ఛేదిస్తుందన్న అమెరికా జట్టు.. అనూహ్యంగా వికెట్లు కోల్పోయింది.

సూపర్ ఓవర్ థ్రిల్లర్

కాగా చివరి ఓవర్ చివరి బంతికి అమెరికా జట్టు విజయానికి 5 పరుగులు కావాలి. స్ట్రయిక్‌లో ఉన్న అమెరికా బ్యాటర్ బౌండరీ బాది మ్యాచ్‌ని టై చేశాడు. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా జట్టు 19 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో మొహమ్మద్ అమీర్ కేవలం 1 బౌండరీ మాత్రమే ఇచ్చాడు, కానీ వైడ్ల ద్వారా 7 పరుగులు ఇచ్చాడు. ఇదే జట్టు ఓటమికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇఫ్తికర్ అహ్మద్ భారీ బౌండరీ బాది పాక్ జట్టుకు విజయావకాశం కల్పించాడు. అయితే సూపర్ ఓవర్ మూడో బంతికే అతని వికెట్ పడింది. రెండో బ్యాటర్‌ గా వచ్చిన షాదాబ్ ఖాన్ భారీ షాట్లు కొట్టలేకపోయాడు. చివరికి పాక్ జట్టు 13 పరుగులకే పరిమితమై 5 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..