T20 World Cup 2021: 23 ఏళ్ల వయసులోనే 400 వికెట్లు.. చిన్న దేశం నుంచి పెద్ద స్థాయికి..?
T20 World Cup 2021: ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి గత దశాబ్దపు అత్యుత్తమ టీ20 క్రికెటర్‌గా అవార్డు లభించింది. ఇప్పుడు అతను దానిని కొనసాగిస్తున్నాడు.
T20 World Cup 2021: ఆఫ్ఘనిస్తాన్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌కి గత దశాబ్దపు అత్యుత్తమ టీ20 క్రికెటర్‌గా అవార్డు లభించింది. ఇప్పుడు అతను దానిని కొనసాగిస్తున్నాడు. T20 క్రికెట్‌లో 400 వికెట్లను పూర్తి చేశాడు. కేవలం 23 ఏళ్ల వయసులో ఘనత సాధించిన ప్రపంచంలోనే అతి పిన్న వయసు బౌలర్‌గా నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న T20 లీగ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా రషీద్ వేగంగా 100 వికెట్లు పడగొట్టాడు.
T20 వరల్డ్ కప్ 2021లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడింది. సెమీ-ఫైనల్‌కు చేరుకోవడానికి ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్‌లో గెలవాల్సిన అవసరం ఉంది. అయితే బ్యాట్స్‌మెన్ వైఫల్యంతో రషీద్ ఖాన్ తన స్పిన్ మాయాజాలం ప్రదర్శించలేకపోయాడు. కానీ అంతకుముందే రషీద్ తన ఆకర్షణీయమైన గూగ్లీని ప్రదర్శించి ఒక రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 9వ ఓవర్ ఐదో బంతికే మార్టిన్ గప్టిల్‌ను ఔట్ చేశాడు. ఈ వికెట్‌తో రషీద్ టీ20 క్రికెట్‌లో 400 వికెట్లను పూర్తి చేశాడు. అతను ఈ స్థాయికి చేరుకున్న ప్రపంచంలో నాలుగో బౌలర్ అయ్యాడు కానీ అతని కంటే వేగంగా ఎవరూ చేయలేదు.
తన 289వ మ్యాచ్ ఆడుతున్న రషీద్ 17.55 సగటు 16.5 స్ట్రైక్ రేట్‌తో కేవలం 287 ఇన్నింగ్స్‌లలో 400 వికెట్లు పూర్తి చేశాడు. అంతేకాదు 23 ఏళ్ల 48 రోజుల వయసులో 400 వికెట్లు తీసిన అతి పిన్న వయసు బౌలర్‌గా కూడా నిలిచాడు. ఇదే టోర్నమెంట్‌లో కొన్ని రోజుల క్రితం రషీద్ T20 ఇంటర్నేషనల్స్‌లో తన 100 వికెట్లను కూడా పూర్తి చేశాడు. ఈ సందర్భంలో అతను అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ రికార్డు సృష్టించాడు. కేవలం 23 ఏళ్లలో 53 మ్యాచ్‌లతో రషీద్ ఈ రికార్డును నెలకొల్పాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. అతను 512 మ్యాచ్‌లలో 553 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన బ్రావో ఫ్రాంచైజీ క్రికెట్‌లో తన సత్తా చాటుతూనే ఉంటాడు. బ్రావో తర్వాత, వెస్టిండీస్‌కు చెందిన సునీల్ నరైన్ (425) రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా దిగ్గజ లెగ్-స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ (420) మూడో స్థానంలో ఉన్నారు. నాలుగో స్థానంలో రషీద్ ఉన్నాడు.