Sunil Gavaskar : గిఫ్టుల పేరుతో ఫ్రీ పబ్లిసిటీ..సిగ్గులేని వ్యక్తులను పట్టించుకోవద్దు.. క్రికెటర్లకు గవాస్కర్ హెచ్చరిక
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు నవంబర్ 2న ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఐసీసీ నుండి వచ్చిన రూ.40 కోట్ల ప్రైజ్ మనీతో పాటు, బీసీసీఐ రూ.51 కోట్ల బహుమతిని ప్రకటించింది.

Sunil Gavaskar : హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళా క్రికెట్ జట్టు నవంబర్ 2న ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా వరల్డ్ కప్ టైటిల్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. ఈ విజయాన్ని పురస్కరించుకుని ఐసీసీ నుండి వచ్చిన రూ.40 కోట్ల ప్రైజ్ మనీతో పాటు, బీసీసీఐ రూ.51 కోట్ల బహుమతిని ప్రకటించింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నగదు బహుమతులను ప్రకటిస్తున్నాయి. ఈ వాతావరణంలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ విజేత జట్టుకు ఓ ముఖ్యమైన హెచ్చరిక చేశారు. బహుమతులుగా ఇచ్చిన వాగ్దానాలు నెరవేరకపోతే నిరాశ చెందవద్దని ఆయన మహిళా క్రికెటర్లకు సూచించారు.
భారత మహిళా జట్టు వరల్డ్ కప్ విజయం తర్వాత దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో సునీల్ గావస్కర్ మిడ్-డే పత్రికలో రాసిన తన కాలమ్‌లో మహిళా క్రికెటర్లకు ఒక హెచ్చరిక చేశారు. “ఆటగాళ్లకు ఒకటే హెచ్చరిక.. మీకు వాగ్దానం చేసిన కొన్ని బహుమతులు అందకపోతే నిరాశ చెందకండి.” భారతదేశంలో విజేతల ప్రచారం కోసం యాడ్ ఏజెన్సీలు, బ్రాండ్‌లు, వ్యక్తులు హడావుడి చేసి, విజేతల భుజాలపై ఫ్రీ పబ్లిసిటీ పొందడానికి ప్రయత్నిస్తారని గవాస్కర్ పేర్కొన్నారు.
ఓ సారి టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పే పేజీ నిండా ప్రకటనలు, హోర్డింగ్‌లను పరిశీలించండి. వారు టీమ్ లేదా ఆటగాళ్లకు స్పాన్సర్‌లు కాకపోతే, వారంతా కేవలం తమ బ్రాండ్‌ను లేదా తమను తాము ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారని, దేశానికి గౌరవం తెచ్చిన వారికి ఏమీ ఇవ్వడం లేదని గవాస్కర్ విమర్శించారు. గవాస్కర్ 1983లో భారత్ తొలి వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యుడు. ఆ సమయంలో తమ జట్టుకు ఎదురైన అనుభవాలను ఆయన మహిళా క్రికెటర్లకు గుర్తు చేశారు.
1983 ప్రపంచ కప్ విజయం తర్వాత కూడా తమ జట్టుకు అనేక వాగ్దానాలు చేశారని, అప్పట్లో మీడియాలో పెద్ద ఎత్తున కవరేజ్ కూడా వచ్చిందని గవాస్కర్ గుర్తు చేసుకున్నారు. “అయితే, ఆ వాగ్దానాలలో చాలావరకు ఎప్పుడూ నెరవేరలేదు” అని ఆయన స్పష్టం చేశారు. మీడియాను నిందించలేమని, ఎందుకంటే వారు కేవలం పెద్ద పెద్ద ప్రకటనలను చూపించడంలో సంతోషించారు తప్ప, ఈ వ్యక్తులు తమను కూడా వాడుకుంటున్నారని వారికి తెలియదని గవాస్కర్ వ్యాఖ్యానించారు.
బహుమతుల వాగ్దానాలు నెరవేరకపోయినా, నిరాశ చెందవద్దని గవాస్కర్ మహిళా జట్టుకు ధైర్యం చెప్పారు. “ఒక సాధారణ భారతీయ క్రికెట్ ప్రేమికుడి ప్రేమ, అభిమానం మా అతిపెద్ద సంపద అని 1983 జట్టు సభ్యులు మీకు చెబుతారు. మీరు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు అది మీ సంపద అవుతుంది” అని గవాస్కర్ పేర్కొన్నారు. చివరగా, మహిళా జట్టుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ.. ‘దేశం మీ గురించి గర్వపడుతోంది. జై హింద్!’ అని తమ కాలమ్‌ను ముగించారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




