Harmanpreet Kaur : వరల్డ్ కప్ గెలిచినా సమసిపోని వివాదం.. హర్మన్‌ప్రీత్ కెప్టెన్సీ పై మాజీ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, తొలిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది.

Harmanpreet Kaur : భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో టీమిండియా చరిత్ర సృష్టించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి, తొలిసారిగా ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈ విజయాన్ని యావత్ దేశం సెలబ్రేట్ చేసుకుంటున్న తరుణంలో మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెర తీశాయి. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇకపై కెప్టెన్సీ వదిలి తన బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై దృష్టి పెట్టాలని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ మహిళా వన్డే ప్రపంచ కప్ 2025లో భారత్ విజయం సాధించిన తరువాత దేశమంతా ఆనందంలో మునిగి తేలుతోంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా జట్టును అభినందించారు. ఈ ఉత్సవాల మధ్యే, భారత మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి చేసిన ఒక వ్యాఖ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. హర్మన్‌ప్రీత్ కౌర్ ఇప్పుడు కెప్టెన్సీని వదిలిపెట్టి, తన బ్యాటింగ్‌పై, ఫీల్డింగ్‌పై పూర్తిగా దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి.
శాంతా రంగస్వామి వ్యాఖ్యలపై మరో మాజీ భారత కెప్టెన్ అంజుమ్ చోప్రా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్‌డిటివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన అభిప్రాయాన్ని బలంగా వెల్లడించారు. “ప్రతి ప్రపంచ కప్ తరువాత ఇలాంటి వ్యాఖ్యలు రావడం సాధారణమైపోయింది. గత నాలుగైదు టోర్నమెంట్లు చూడండి, జట్టు ఓడిపోయినప్పుడు హర్మన్‌ను తొలగించాలని అంటారు. జట్టు గెలిచినప్పుడు కూడా హర్మన్‌ను తొలగించాలని అంటున్నారు” అని అంజుమ్ చోప్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టీమిండియా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే సమయం ఇది అని, ఇలాంటి మాటలతో ఆటగాళ్ల కష్టాన్ని విస్మరించకూడదని అంజుమ్ అన్నారు. అందుకే, ఈ సమయంలో తాను దీనిపై ఎటువంటి వ్యాఖ్య చేయదల్చుకోలేదని, ఎందుకంటే అది భారత విజయాన్ని పాడుచేస్తుంది అని ఆమె పేర్కొన్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్, అంజుమ్ చోప్రా మధ్య కేవలం సహచర క్రీడాకారిణి/సీనియర్ సంబంధం మాత్రమే కాదు, అంతకు మించి బలమైన అనుబంధం ఉంది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కూడా హర్మన్‌ప్రీత్ తన కెరీర్ తొలి రోజుల్లో అంజుమ్ ఇచ్చిన మద్దతును బహిరంగంగా గుర్తు చేసుకున్నారు.
2007-08లో ముంబైలో జరిగిన ఛాలెంజర్ ట్రోఫీ టోర్నమెంట్‌లో అండర్-19 ప్లేయర్‌గా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ ఎంత శక్తివంతంగా బంతిని కొట్టగలదో అప్పుడే తాను చూశానని అంజుమ్ గుర్తు చేసుకున్నారు. “అప్పుడే హర్మన్ ఒక ప్రత్యేకమైన ప్రతిభావంతురాలని నేను గ్రహించాను” అని ఆమె అన్నారు. “హర్మన్ మ్యాచ్ విన్నర్ కాదని నేను ఒక్క క్షణం కూడా అనుకోలేదు. అందుకే నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను, హర్మన్ మా కెప్టెన్ అయి ఉండాలి” అని అంజుమ్ చోప్రా గట్టిగా మద్దతు పలికారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




