Arjuna Ranatunga: డబ్బుల కోసం అవమానిస్తారా..భారత రెండోస్థాయి జట్టుతో పోటీ ఏమిటి.. శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ ఫైర్!
Arjuna Ranatunga: భారత శ్రీలంకల మధ్య ఈ నెలలో ప్రారంభం కాబోతున్న క్రికెట్ పోటీలపై విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని సీనియర్ క్రికెటర్లు ఈ పోటీలపై మండిపడుతున్నారు.
Arjuna Ranatunga: భారత శ్రీలంకల మధ్య ఈ నెలలో ప్రారంభం కాబోతున్న క్రికెట్ పోటీలపై విమర్శలు రేగుతున్నాయి. ముఖ్యంగా శ్రీలంకలోని సీనియర్ క్రికెటర్లు ఈ పోటీలపై మండిపడుతున్నారు. తాజాగా శ్రీలంకకు ప్రపంచ కప్ అందించిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ భారత జట్టు పర్యటనపై మండి పడ్డారు. భారత్ తన రెండో స్థాయి జట్టును శ్రీలంక పర్యటనకు పంపిస్తోంది.. ఇటువంటి జట్టుతో ఆడటానికి శ్రీలంక క్రీడా మంత్రి నమల్ రాజపక్సే అంగీకరించడం దేశ గౌరవాన్ని దెబ్బతీసిందని ఆయన అన్నారు. జూలై 13 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డే ఇంటర్నేషనల్, మూడు ట్వంటీ 20 ఆటలకు సిద్ధం కావడానికి శిఖర్ ధావన్ నేతృత్వంలోని భారత జట్టు సోమవారం శ్రీలంక చేరుకుంది. మరోవైపు శ్రీలంక జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ఆ పర్భాయటన ముగించుకుని స్వదేశంలో భారత్ తో తలపడుతుంది. భారత జట్టును రెండు జట్లుగా విభజించి శిఖర్ ధావన్ నేతృత్వంలో ఒక జట్టును శ్రీలంక పర్యటనకు పంపించారు.
ఇప్పుడు ఈ విషయంపైనే అర్జున రణతుంగ ఫైర్ అవుతున్నారు. “శ్రీలంకకు వచ్చిన భారత జట్టు వారి ఉత్తమమైనది కాదు, ఇది రెండవ స్థాయి జట్టు” అని రణతుంగ అన్నారు. “మా క్రీడా మంత్రికి లేదా క్రికెట్ నిర్వాహకులకు ఇది తెలియదా?” అని ఆయన ప్రశ్నిస్తున్నారు. శ్రీలంక ర్యాంకింగ్స్‌లో దిగజారి ఉండవచ్చు కానీ, క్రికెట్ దేశంగా మనకు ఒక గుర్తింపు ఉంది, మాకు గౌరవం ఉంది. అందుకే భారత బి జట్టుతో ప్రస్తుత పోటీల్లో ఆడటానికి మన ఉత్తమమైన జట్టును పంపించకూడదు అంటూ రణతుంగ సూచించారు.
“భారతీయ బి బృంద పర్యటనకు శ్రీలంక క్రికెట్ బోర్డు అంగీకరించడం వెనుక ఉన్న రహస్యం టీవీ హక్కులే” అని రణతుంగ అన్నారు. “ఈ టోర్నమెంట్ నుండి డబ్బు సంపాదించాలని బోర్డు కోరుకుంటుంది. అందుకే ఇలా శ్రీలంక క్రికెటర్లను భారత్ బీ జట్టుతో ఆడటానికి సిద్ధపడేలా చేశారు.” అని ఆయన ఆరోపించారు. శ్రీలంక క్రీడాకారులు ఎదుర్కొంటున్న అవమానాన్ని అధికారులు పరిగణించలేదని ఆయన అన్నారు. రణతుంగ చెబుతున్న దాని ప్రకారం, క్రికెట్ నాయకులు ఆర్థిక లాభాలను మాత్రమే పరిగణించారు.
శ్రీలంకను 1996 ప్రపంచ కప్ లో విజవిజయం వైపు నడిపించిన రణతుంగ, శ్రీలంకలో క్రికెట్ పరిపాలన క్షీణించిందని చెప్పారు. ఆట ప్రమాణాలు, నైపుణ్యాలను మెరుగుపరచడానికి తక్షణమే చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు శ్రీలంక క్రికెట్ జట్టులో కోవిడ్ -19 బయో-సేఫ్ బబుల్ ను ఉల్లంఘించిన ఘటన ముగ్గురు క్రికెటర్లపై వేటు పడేట్టు చేస్తోంది. ఈ కారణంగానే వైస్ కెప్టెన్ కుసల్ మెండిస్, ఓపెనర్ దనుష్కా గుణతిలక, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా ప్రస్తుత ఇంగ్లాండ్ పర్యటన నుండి వైదొలిగారు. ఈ ముగ్గురిని ఇండియా సిరీస్ నుంచి తప్పించే అవకాశం ఉంది.
Also Read: ENG vs SL: వన్డేల్లో చెత్త రికార్డును సొంతం చేసుకున్న లంకేయులు..! కలిసి రాని ఇంగ్లండ్ పర్యటన
IND vs ENG: గాయంతో టీమిండియా ఓపెనర్ ఔట్..! ఈ ముగ్గురిలో ఛాన్స్ ఎవరికో..?