Champions Trophy Rewind: దాదా కసిగా కొడితే ఎలా ఉంటుందో తెలుసా? ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో మరుపురాని రోజు!
2000 సంవత్సరంలోని ఐసిసి నాకౌట్ టోర్నీ సెమీఫైనల్లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సౌరవ్ గంగూలీ అద్భుతమైన 141 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ద్రవిడ్‌తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఈ ఇన్నింగ్స్ ద్వారా టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఇన్నింగ్స్ లొ గంగూలీ ఆఫ్‌సైడ్ షాట్లు అద్భుతంగా ఉంటాయి. ఈ మ్యాచ్ భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయమైనదిగా చెప్పుకోవచ్చు.

సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఇండియన్ క్రికెట్ తలరాతను మార్చిన గొప్ప కెప్టెన్‌గా దాదా ఘ్యాతి చిరస్థాయిగా నిలిచిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదా కేవలం గొప్ప కెప్టెన్ మాత్రమే కాదు. అంతకంటే అద్భుతమైన బ్యాటర్ కూడా. తన కెరీర్‌లో ఎన్నో గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఒకానొక దశలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌ను కూడా డామినేట్ చేసే రేంజ్‌లో దాదా బ్యాటింగ్ విధ్వంసం సాగిందంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు కెప్టెన్‌గా జట్టు భారాన్ని మోస్తూ, మరోవైపు బ్యాటర్‌గా కూడా చెలరేగిపోయేవాడు. దాదా ముందుకొచ్చి షాట్ కొడితే బంతి స్టాండ్స్‌లో పడాల్సిందే. ఆఫ్ సైడ్ సర్కిల్‌లో ఎంత మంది ఫీల్డర్లను పెట్టినా గ్యాప్‌లో బౌండరీ కొట్టగల గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్ అతను. మ్యాచ్ ఫిక్సింగ్ సంక్షోభం భారత క్రికెట్‌ను కుదిపేసిన క్లిష్ట సయమంలో కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న దాదా, మళ్లీ ఇండియాన్ క్రికెట్‌కు పూర్వ వైభవం తెచ్చేందుకు కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ప్రాణం పెట్టి ఆడేవాడు.
అలా ఆడిన ఇన్నింగ్స్‌ల్లో 2000వ సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగిన ఐసీసీ నాకౌట్ టోర్నీ సెమీ ఫైనల్‌లో ఆడిన ఇన్నింగ్స్ ఒకటి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీగా పిలుస్తున్న టోఫీనే అప్పట్లో నాకౌట్ ట్రోఫీగా ఉండేది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇంటికే. అలాంటి టోర్నీలో యంగ్ కెప్టెన్‌గా టీమిండియాను లీడ్ చేశాడు దాదా. ప్రీక్వార్టర్స్‌లో కెన్యాను, క్వార్టర్ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించిన టీమిండియా సెమీ ఫైనల్‌కు చేరుకుంది. సౌతాఫ్రికాతో అక్టోబర్ 13న నైరోబీ వేదికగా సెకండ్ సెమీ ఫైనల్‌లో దాదా సేన తలపడింది. ఆ మ్యాచ్‌లో ముందుగా టీమిండియానే బ్యాటింగ్‌కు దిగింది. క్రికెట్ దేవుడు సచిన్‌తో కలిసి దాదా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. తన కెప్టెన్సీలో భారత జట్టు ఒక పెద్ద టోర్నీలో సెమీ ఫైనల్ ఆడుతోంది. అలాంటి మ్యాచ్‌లో ఒక కెప్టెన్‌గా, ఒక ఓపెనర్‌గా, యంగ్ డైనమిక్ బ్యాటర్‌గా ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాలో అంతకంటే మించి చెలరేగిపోయాడు.
సచిన్ 39 పరుగులు చేసి అవుటైనా అధైర్య పడలేదు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ ద్రవిడ్‌తో కలిసి టీమిండియాకు ఒక సాలిడ్ పార్ట్నర్‌షిప్‌ను అందించాడు. ఆ క్రమంలోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 142 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులతో 141 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరి వరకు క్రీజ్‌లో పాతుకుపోయి.. సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపించాడు. అప్పట్లో సౌతాఫ్రికా బౌలింగ్ ఎటాక్ ఎలా ఉండేదో ప్రత్యేకంగా చెప్పా్ల్సిన అవసరం లేదు. ఆ జనరేషన్‌లో బ్యాటర్లకు వణుకుపుట్టించే బౌలర్లు ప్రొటీస్ సొంతం. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన భారత క్రికెట్ అభిమానులు.. ఇప్పటికీ ఆ మ్యాచ్ తలచుకున్నా.. దాదా చేసిన శివతాండవం ఇంకా వారి కళ్ల ముందు కదలాడుతూనే ఉంటుంది.
దాదా సృష్టించిన ఆ విధ్వంసంతో టీమిండియా 50 ఓవర్లలో 295 పరుగుల భారీ స్కోర్ చేసింది. గంగూలీ ఆడిన ఆ ఇన్నింగ్స్ చూసి సౌతాఫ్రికాకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయినట్టు ఉంది. తర్వాత ఛేజింగ్‌కు దిగి 200 పరుగులకే కుప్పకూలారు. టీమిండియా సగర్వంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఆదివారం ప్రస్తుతం టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో ఆడనుంది. ఈ మెగా ఫైనల్‌కు ముందు దాదా ఆడిని ఆ ఇన్నింగ్స్‌ను ఒక్కసారి గుర్తు చేసుకొని, అప్పటి ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి ఇప్పటి రోహిత్ సేన బదులు తీర్చుకోవాలని కోరుకుందాం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




