Shreyas Iyer : చరిత్ర సృష్టించేందుకు 34 పరుగుల దూరంలో శ్రేయస్ అయ్యర్..కోహ్లీ రికార్డు గల్లంతేనా?
Shreyas Iyer : రాజ్‌కోట్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ 34 పరుగులు చేస్తే భారత క్రికెట్‌లో అతి వేగంగా 3000 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టిస్తాడు. ధావన్, కోహ్లీ రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉంది. రెండో వన్డేలో రానిస్తే కేవలం 69 ఇన్నింగ్స్‌ల్లోనే 3,000 పరుగుల మార్కును చేరుకుంటాడు.

Shreyas Iyer : భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం రాజ్‌కోట్‌లో రెండో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అయ్యర్, తన వన్డే కెరీర్‌లో 3,000 పరుగుల మైలురాయిని చేరుకోవడానికి కేవలం 34 పరుగుల దూరంలో ఉన్నాడు. ఒకవేళ రాజ్‌కోట్ వన్డేలో అతను ఈ పరుగులు సాధిస్తే, భారత క్రికెట్ చరిత్రలో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటి వరకు 68 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2,966 పరుగులు చేశాడు. తదుపరి మ్యాచ్‌లో మరో 34 పరుగులు చేస్తే, కేవలం 69 ఇన్నింగ్స్‌ల్లోనే 3,000 పరుగుల మార్కును చేరుకుంటాడు. తద్వారా భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ రికార్డు శిఖర్ ధావన్ (72 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉంది. విరాట్ కోహ్లీకి ఈ ఘనత సాధించడానికి 75 ఇన్నింగ్స్‌లు పట్టగా, రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు ఈ విషయంలో అయ్యర్ కంటే చాలా వెనుకబడి ఉన్నారు.
ఈ రికార్డు కేవలం భారత క్రికెట్‌కే పరిమితం కాదు. 69 ఇన్నింగ్స్‌ల్లో 3,000 పరుగులు పూర్తి చేస్తే, శ్రేయస్ అయ్యర్ వెస్టిండీస్ లెజెండ్ వివియన్ రిచర్డ్స్ రికార్డును సమం చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే హషీమ్ ఆమ్లా, షాయ్ హోప్, ఫఖర్ జమాన్ మాత్రమే అయ్యర్ కంటే ముందున్నారు. ఇది అయ్యర్ స్థిరత్వాన్ని ప్రతిబింబిస్తోంది. గాయాల నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత అయ్యర్ ఆడుతున్న తీరు అమోఘం. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో కూడా సెంచరీలతో విరుచుకుపడిన అతను, కివీస్‌తో జరిగిన మొదటి వన్డేలోనూ 49 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
రాజ్‌కోట్ పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. ప్రస్తుతం అయ్యర్ ఉన్న ఫామ్ చూస్తుంటే 34 పరుగులు చేయడం అతనికి పెద్ద కష్టమేమీ కాదు. 2017లో అరంగేట్రం చేసిన అయ్యర్, కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూసినా, ప్రతిసారీ తనను తాను నిరూపించుకుంటూ వస్తున్నాడు. రెండో వన్డేలో అయ్యర్ గనుక ఈ ఫీట్ సాధిస్తే, భారత్ సిరీస్ గెలవడమే కాకుండా, ఒక యంగ్ ప్లేయర్ దిగ్గజాలను దాటి తన పేరును చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటాడు. టీమిండియా ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు రాజ్‌కోట్ వన్డే కోసం, అయ్యర్ రికార్డు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
