IPL 2026 : సొంత గడ్డపై మ్యాచులు నిషేధం..ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
IPL 2026 : ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ హోమ్ గ్రౌండ్ మారనుంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీ బెంగళూరులో ఆడే అవకాశం కోల్పోయింది. నవీ ముంబై లేదా రాయ్‌పూర్ కొత్త హోమ్ గ్రౌండ్లుగా మారే ఛాన్స్ ఉంది.

IPL 2026 : ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. అయితే, ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ అభిమానులు తమ అభిమాన జట్టును బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో చూడలేకపోవచ్చు. తాజా నివేదికల ప్రకారం.. ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచులను బెంగళూరుకు బదులుగా ఇతర నగరాల్లో ఆడాల్సి ఉంటుంది. నవీ ముంబై, రాయ్‌పూర్ నగరాలు ఆర్‌సీబీకి కొత్త హోమ్ గ్రౌండ్లుగా మారే అవకాశం ఉంది. గతేడాది ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్‌సీబీ తొలిసారిగా ట్రోఫీని గెలుచుకుంది. జూన్ 3న ఛాంపియన్‌గా నిలిచిన జట్టు, జూన్ 4న బెంగళూరుకు చేరుకుంది. ఆ సమయంలో చిన్నస్వామి స్టేడియం వద్ద భారీ ఎత్తున విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల కారణంగా స్టేడియం ప్రాంగణంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా స్పందించి విచారణకు ఆదేశించింది.
రిటైర్డ్ జస్టిస్ మైఖేల్ డికున్హా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఈ తొక్కిసలాటపై లోతుగా దర్యాప్తు చేసింది. విచారణలో చిన్నస్వామి స్టేడియం భారీ కార్యక్రమాలకు, ముఖ్యంగా ఐపీఎల్ వంటి హై-వోల్టేజ్ మ్యాచులకు సురక్షితం కాదని కమిషన్ తేల్చింది. స్టేడియంలో భద్రతా లోపాలు ఉన్నాయని నివేదిక ఇవ్వడంతో, ప్రభుత్వం అక్కడ పెద్ద ఎత్తున క్రీడా పోటీలు నిర్వహించకుండా నిషేధం విధించింది. దీనివల్ల ఆర్‌సీబీ యాజమాన్యం ప్రత్యామ్నాయ వేదికల వైపు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
చిన్నస్వామి స్టేడియం అందుబాటులో లేకపోవడంతో ఆర్‌సీబీ తన హోమ్ మ్యాచుల కోసం నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియం లేదా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంను ఎంచుకునే అవకాశం ఉంది. ఈ రెండు వేదికల్లో గతంలోనూ ఐపీఎల్ మ్యాచులు జరిగాయి. ఆర్‌సీబీ యాజమాన్యం మరియు ఐపీఎల్ కమిటీ దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. టైటిల్ నెగ్గి సంబరాలు చేసుకున్న చోటే, దురదృష్టవశాత్తూ ఆట ఆడే అవకాశం కోల్పోవడం ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు మింగుడుపడడం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
