Shoaib Akhtar : మా టీం స్వార్థంతోనే ఆడుతుంది.. గెలవాలని కాదు.. సొంత జట్టుపైనే రగిలిపోయిన షోయబ్ అక్తర్
వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం చవిచూడటంతో, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 200+ పరుగుల తేడాతో ఓడిపోయింది. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ డకౌట్ కాగా, బాబర్ అజామ్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచారు.

Shoaib Akhtar : వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన మూడో వన్డేలో పాకిస్తాన్ జట్టు ఘోర పరాజయం పాలైంది. 200 పరుగులకు పైగా భారీ తేడాతో ఓటమిని చవిచూడటంతో, మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ఈ ఓటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా జట్టులో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రయోజనాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
వెస్టిండీస్‌తో పేలవమైన ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టుపై అక్తర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మా కాలంలో మేమంతా ఒక జట్టుగా ఆడేవాళ్లం. దేశం కోసం గెలవడానికి ప్రయత్నించేవాళ్లం. ఒకరిపై ఆధారపడకుండా అందరూ తమ వంతు కృషి చేసేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత 10-15 ఏళ్లుగా ఆటగాళ్లు కేవలం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆడుతున్నారు. వారి సగటును పెంచుకోవడానికి మాత్రమే చూస్తున్నారు” అని అక్తర్ ఘాటుగా విమర్శించారు.
“మీరు దేశం కోసం మ్యాచ్‌లు గెలవాలనే తపన చూపించాలి. ఇప్పటికైనా మీరు మారాలి. పరిస్థితులకు అనుగుణంగా ఆడడం నేర్చుకోవాలి. బంతి బాగా కదులుతున్నప్పుడు జాగ్రత్తగా ఆడాలి. మీరు వచ్చి ఆడే పిచ్ అది కాదు. ఆ పిచ్‌ను మీరు ఎక్కడికీ తీసుకెళ్లలేరు” అంటూ పాక్ బ్యాట్స్‌మెన్‌ల ఆటతీరును ఎత్తిచూపారు.
ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ డకౌట్ కాగా, బాబర్ అజామ్ కేవలం 9 పరుగులకే అవుట్ అయ్యారు. దీంతో పాకిస్తాన్ జట్టు కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ ఓటమితో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. అయితే, అంతకుముందు జరిగిన టీ20 సిరీస్‌ను పాకిస్తాన్ గెలుచుకోవడం గమనార్హం.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




