AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs PAK : పాక్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రావల్పిండి ఎక్స్ ప్రెస్..లైవ్ టీవీలో సొంత ప్లేయర్లపై బండబూతులు

ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్ చేతిలో ఓటమి పాలైన తర్వాత పాకిస్తాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాజీ క్రికెటర్లు, అభిమానులు జట్టు ప్రదర్శనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ పేస్ బౌలర్ షోయబ్ అక్తర్, ఓ టీవీ షోలో తన సొంత జట్టుపై తీవ్ర వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

IND vs PAK : పాక్ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రావల్పిండి ఎక్స్ ప్రెస్..లైవ్ టీవీలో సొంత ప్లేయర్లపై బండబూతులు
Shoaib Akhtar
Rakesh
|

Updated on: Sep 22, 2025 | 11:01 AM

Share

IND vs PAK : ఆసియా కప్ 2025 సూపర్-4లో భారత్-పాక్ మ్యాచ్ తర్వాత పాకిస్థాన్ జట్టు మళ్లీ విమర్శల పాలైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, పాకిస్థాన్ ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తన సొంత జట్టుపై తీవ్రంగా విరుచుకుపడ్డాడు. ఈ జట్టు 200 పరుగులు చేసినా మ్యాచ్ గెలవలేదని ఘాటుగా విమర్శించాడు.

పాక్ వీక్ బౌలింగ్‌పై ప్రశ్నలు

మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్, సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సహాయంతో 171 పరుగులు చేసింది. ఈ స్కోరుతో భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరుగుతుందని పాకిస్థాన్ భావించింది. కానీ భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ 105 పరుగుల భాగస్వామ్యంతో మ్యాచ్‌ను మొదటి నుంచే తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

మ్యాచ్ తర్వాత ఒక టీవీ షోలో షోయబ్ అక్తర్ పాకిస్థాన్ బౌలింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. “పాకిస్థాన్ 200 పరుగులు చేసినా కూడా ఈ బౌలింగ్ లైనప్ ఆ స్కోరును కాపాడలేదు. అబ్రార్ అహ్మద్ వంటి ప్రధాన బౌలర్‌ను వెనక్కి ఉంచి, శామ్ అయూబ్‌తో బౌలింగ్ చేయించడం అర్థం లేని పని. ఒకవేళ ఫహీమ్ అష్రఫ్‌తో బౌలింగ్ చేయించాలనుకుంటే కొత్త బంతితోనే చేయించేవారు. జట్టు వ్యూహం పూర్తిగా తప్పు” అని అన్నాడు.

ఇంకా అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శించాడు. ముఖ్యంగా హారిస్ రౌఫ్, షాహీన్ అఫ్రిదిపై మండిపడ్డాడు. “హారిస్ రౌఫ్ ఒక్క భారత బ్యాట్స్‌మెన్‌ను కూడా అవుట్ చేయలేకపోయాడు. దొరికిన వికెట్లు కూడా భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పుల వల్ల వచ్చాయి. బౌలర్లు సొంతంగా ఒక్క మ్యాజిక్ కూడా చూపించలేదు” అని చెప్పాడు.

టీమిండియా బ్యాటింగ్‌కు ప్రశంసలు

అక్తర్ భారత బ్యాట్స్‌మెన్‌లను కూడా ప్రశంసించాడు. “ఒకవేళ అభిషేక్ శర్మ అవుట్ కాకపోయి ఉంటే, భారత్ ఈ మ్యాచ్‌ను 5 ఓవర్ల ముందే ముగించేది” అని అన్నాడు. “టీమిండియాలో కేఎల్ రాహుల్ లేడు, లేకపోతే పాకిస్థాన్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. సంజు శాంసన్ ఈ లైనప్‌లో వీక్ ప్లేయర్, కానీ మిగతా బ్యాట్స్‌మెన్ అందరూ అద్భుతంగా ఆడారు” అని కూడా అక్తర్ చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌కు ప్రమాద ఘంటికలు

ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది. బౌలర్ల నిరంతర వైఫల్యం, తప్పుడు వ్యూహాలపై ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షోయబ్ అక్తర్ చేసిన ఈ తీవ్రమైన విమర్శలు పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉందని స్పష్టం చేస్తున్నాయి.

పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు తమ జట్టు ఓడిన ప్రతిసారీ లైవ్ టీవీలో విమర్శలు గుప్పించడం అలవాటుగా మారింది. షోయబ్ అక్తర్ విమర్శలు జట్టులోని బలహీనతలను స్పష్టంగా ఎత్తి చూపాయి. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ తమ వ్యూహాలను,  ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈసారి టోర్నమెంట్‌లో వారికి కష్టం తప్పదు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..