Pakistan : పాక్ క్రికెట్‌కు మరో షాక్.. ఇస్లామాబాద్ దాడితో పర్యటన రద్దు.. ఇంటి దారి పట్టిన శ్రీలంక ప్లేయర్లు
పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈ పర్యటనను మధ్యలోనే నిలిపివేయాలని నిర్ణయించింది. ఇటీవల ఇస్లామాబాద్ సమీపంలో జరిగిన ఆత్మహుతి దాడి కారణంగా ఈ పర్యటనపై భయం మరింత పెరిగింది.

Pakistan : పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చేస్తున్న ప్రయత్నాలకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం పాకిస్థాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెట్ జట్టు భద్రతాపరమైన ఆందోళనల కారణంగా ఈ పర్యటనను మధ్యలోనే నిలిపివేయాలని నిర్ణయించింది. ఇటీవల ఇస్లామాబాద్ సమీపంలో జరిగిన ఆత్మహుతి దాడి కారణంగా ఈ పర్యటనపై భయం మరింత పెరిగింది. దీని ఫలితంగా శ్రీలంక జట్టులోని ఎనిమిది మంది కీలక ఆటగాళ్లు తిరిగి తమ దేశానికి పయనం కానున్నారు. దీంతో ఇరు జట్ల మధ్య జరగాల్సిన రెండో వన్డే రద్దైంది. పాకిస్థాన్ క్రికెట్‌పై మరోసారి ఉగ్రవాదం నీడ పడినట్టైంది.
పాకిస్థాన్, శ్రీలంక మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ మధ్యలో ఇస్లామాబాద్‌లోని కోర్టు వెలుపల జరిగిన ఆత్మహుతి దాడి వల్ల ఆటగాళ్లలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగాయి. తాజా నివేదికల ప్రకారం శ్రీలంక జట్టులోని 8 మంది ముఖ్య ఆటగాళ్లు గురువారం (నవంబర్ 14) నాడు స్వదేశానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ అనూహ్య నిర్ణయం కారణంగా రావల్పిండిలో జరగాల్సిన రెండవ వన్డే మ్యాచ్ రద్దు అయింది. మంగళవారం జరిగిన మొదటి వన్డేలో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది.
ఇస్లామాబాద్, రావల్పిండి మధ్య దూరం చాలా తక్కువగా ఉండటం వల్ల ఆటగాళ్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీలంక క్రికెట్ బోర్డు దీనిపై స్పందించింది. శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటన ప్రకారం.. స్వదేశానికి తిరిగి వెళ్లే ఆటగాళ్ల స్థానంలో కొత్త సభ్యులను పంపిస్తామని తెలిపింది. వన్డే సిరీస్ తర్వాత శ్రీలంక జట్టు పాకిస్థాన్, జింబాబ్వే తో కలిసి ట్రై టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పర్యటన మొత్తం అయోమయంలో పడింది.
శ్రీలంక జట్టు భద్రతా ముప్పును ఎదుర్కోవడం పాకిస్థాన్‌లో ఇదే మొదటిసారి కాదు. గతంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత చాలా ఏళ్లు పాకిస్థాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ జరగలేదు. మార్చి 2009లో లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంకు వెళ్తున్న శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో కెప్టెన్ మహేల జయవర్ధనేతో సహా అనేక మంది ఆటగాళ్లు గాయపడ్డారు. పలువురు పాకిస్థానీ భద్రతా సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడి తర్వాత పదేళ్లకు పైగా ఏ విదేశీ జట్టు కూడా పాకిస్థాన్‌లో పర్యటించలేదు. 2019 డిసెంబర్‌లో శ్రీలంక జట్టు తిరిగి పాకిస్థాన్ పర్యటనకు రావడం ద్వారానే అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణకు దారి తీసింది.
ఈసారి పాక్ క్రికెట్ బోర్డు తరఫున మొహ్సిన్ నఖ్వీ స్వయంగా స్టేడియాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాకిస్థాన్ సైన్యం, రేంజర్‌ల అదనపు దళాలను భద్రత కోసం మోహరించారు. అయినప్పటికీ ఆటగాళ్లు వెనక్కి వెళ్లడం పీసీబీ ప్రయత్నాలకు పెద్ద దెబ్బ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




