AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: నా భార్య కన్నీరు పెట్టింది.. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌పై సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్..!

Sarfaraz Khan Dressing Room Leak: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత డ్రెస్సింగ్ రూమ్ లీక్ ఆరోపణలపై సర్ఫరాజ్ ఖాన్ తొలిసారి స్పందించాడు. నా భార్య కన్నీరు పెట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. గంభీర్ ఫోన్ చేసి అండగా నిలిచాడని, బరువు తగ్గాలని సవాల్ విసిరాడని వెల్లడించాడు.

Team India: నా భార్య కన్నీరు పెట్టింది.. డ్రెస్సింగ్ రూమ్ లీక్‌పై సర్ఫరాజ్ ఖాన్ ఎమోషనల్..!
Sarfaraz Khan Dressing Room Leak
Venkata Chari
|

Updated on: Nov 23, 2026 | 1:06 PM

Share

Sarfaraz Khan Dressing Room Leak: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ దాదాపు రెండేళ్లుగా తనను వెంటాడుతున్న ఓ పుకారుపై మౌనం వీడాడు. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భారత్ 3-1తో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన తర్వాత టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ విషయాలు మీడియాకు లీక్ అయ్యాయని ఆరోపణలు వచ్చాయి. ఆ వ్యవహారంలో సర్ఫరాజ్ పేరును సోషల్ మీడియాలో లాగడం జరిగింది. దీనిపై 29 ఏళ్ల స్టార్ బ్యాటర్ తొలిసారి బహిరంగంగా మాట్లాడాడు.

మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ‘బైఠ్ & బోల్’ పాడ్‌కాస్ట్‌లో సర్ఫరాజ్ భావోద్వేగంగా స్పందించాడు. నిరాధార ఆరోపణలు తన కుటుంబాన్ని ఎంత బాధపెట్టాయో వివరించాడు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిగా ఫోన్ చేసి తనకు, తన తండ్రికి ధైర్యం చెప్పాడని, 20 కిలోల బరువు తగ్గడానికి కారణమైన ఫిట్‌నెస్ సవాల్ గురించి వెల్లడించాడు.

ఫ్లైట్ దిగగానే ఫోన్లో వరుస కాల్స్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోని ఐదు టెస్టులకు సర్ఫరాజ్ జట్టులో ఉన్నా తుది జట్టులో చోటు దక్కలేదు. టూర్‌లో గాయపడటంతో స్వదేశానికి వచ్చి NCAలో రీహాబ్‌లో ఉన్నాడు. అప్పటికి ఆన్‌లైన్‌లో జరుగుతున్న రచ్చ గురించి అతడికి తెలియదు.

సిరీస్ ముగిసి 20-25 రోజుల తర్వాత ఒక్కసారిగా వివాదం మొదలైంది. ఫ్లైట్ దిగగానే ఫోన్ కాల్స్, మెసేజ్‌లతో నిండిపోయిందని సర్ఫరాజ్ గుర్తుచేసుకున్నాడు.

“నేను బాధపడ్డాను. ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే కాల్స్, మెసేజ్‌లు రావడం మొదలయ్యాయి. సోషల్ మీడియాలో చాలా రాశారు. BGT ముగిసి 20-25 రోజులైంది. BGTలో నాకు గాయమై NCAకు వెళ్లాను. ఉన్నట్టుండి డ్రెస్సింగ్ రూమ్ లీక్ వార్తలు రావడం మొదలయ్యాయి. నేను ఎవరితో మాట్లాడాలో అర్థం కాలేదు” అని చెప్పాడు.

వాస్తవం తెలుసుకునేందుకు క్రికెట్ వర్గాల్లో కొందరికి ఫోన్ చేస్తే చాలామంది సమాధానం ఇవ్వలేదని, అది తనను మరింత ఒంటరివాడిని చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

“నేను ఎవరికి చెప్పుకోవాలి? అలాంటిదేమీ జరగలేదు. అదే నిజమైతే నన్ను ఇండియా A జట్టుకు, ఆ తర్వాత శ్రీలంక సిరీస్‌కు ఎంపిక చేసేవారు కాదు. ఎవరు ఇలా అన్నారో నాకు తెలియదు. నేను బాధపడ్డాను, ఫోన్ చేస్తే సమాధానం రాలేదు. నా కుటుంబానికి అది చాలా చెడ్డ సమయం” అన్నాడు.

“ఎవరి పనిని చెడగొట్టలేకపోతే వారి పేరును చెడగొట్టు, పని ఆటోమేటిక్‌గా చెడిపోతుంది” అనే సామెతను గుర్తుచేసుకున్నాడు.

నా భార్య ఏడుస్తోంది.. గంభీర్ ఫోన్

వృత్తిపరమైన ఎదురుదెబ్బలను తట్టుకోగలిగినా.. తన ప్రియమైనవారు బాధపడటాన్ని చూడటం కష్టమైందని సర్ఫరాజ్ చెప్పాడు. ఆన్‌లైన్ రచ్చ పెరగడంతో ఫోన్ స్విచాఫ్ చేశాడు. భార్య రొమానా జహూర్, తండ్రి-కోచ్ నౌషాద్ ఖాన్ ముఖాల్లో బాధ స్పష్టంగా కనిపించిందని తెలిపాడు.

అత్యంత క్లిష్ట సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అండగా నిలిచాడు. బయటకు కఠినంగా కనిపించే గంభీర్.. సర్ఫరాజ్‌కు రెండుసార్లు ఫోన్ చేసి షరతులు లేని మద్దతు ఇచ్చాడు.

“నేను ఫోన్ స్విచాఫ్ చేయాల్సి వచ్చింది. GG సర్ (గంభీర్) నాకు రెండుసార్లు ఫోన్ చేశారు. ఇవన్నీ పనికిరాని మాటలు, ఈ రాజకీయాల్లో ఇరుక్కోవద్దు, నీ ఆటపై దృష్టి పెట్టు అని చెప్పారు. నేను అర్థం చేసుకోగలనని, కానీ మా నాన్న బాధపడుతున్నారని, నా భార్య కన్నీరు పెడుతోందని చెప్పాను” అని సర్ఫరాజ్ వెల్లడించాడు.

విషయం తెలుసుకున్న గంభీర్ స్వయంగా నౌషాద్ ఖాన్‌తో ఫోన్‌లో మాట్లాడి కుటుంబ ఆందోళనను తగ్గించారు. ఇలాంటి మాటలకు ప్రాధాన్యం ఇవ్వొద్దని, సర్ఫరాజ్ మంచి క్రికెటర్ అని, క్రికెట్ ఆడనివ్వాలని, అవసరమైతే సహాయం కోసం తనకు ఫోన్ చేయాలని చెప్పారు. “నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి ఆయనే” అని సర్ఫరాజ్ తెలిపాడు.

గంభీర్ సవాల్.. 20 కిలోలు తగ్గిన సర్ఫరాజ్

లీక్ వివాదంలో అండగా నిలవడమే కాకుండా సర్ఫరాజ్ కెరీర్‌ను మార్చిన ఫిట్‌నెస్ సవాల్‌ను కూడా గంభీరే ఇచ్చారు. రంజీల్లో పరుగుల వరద పారించి, తొలి 6 టెస్టుల్లో 37.10 సగటుతో 1 సెంచరీ, 3 హాఫ్ సెంచరీలు చేసినా.. అతడి ఫిజిక్‌పై విమర్శలు వచ్చేవి.

ఇంగ్లండ్ టూర్‌కు ముందు గంభీర్ స్పష్టమైన సవాల్ విసిరారు – మూడు-నాలుగు నెలల్లో 10 కిలోలు తగ్గాలి.

“గంభీర్ సర్ నాతో.. సర్ఫరాజ్, ఇంగ్లండ్ టూర్‌కు ముందు 10 కిలోలు తగ్గాలని చెప్పారు. నాకు 3-4 నెలల సమయం ఉంది, నేను 10 కిలోలు తగ్గాను” అని సర్ఫరాజ్ చెప్పాడు.

అంతటితో ఆగకుండా 97 కిలోల నుంచి 76-77 కిలోలకు చేరుకుని దాదాపు 20 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తండ్రి నౌషాద్‌తో కలిసి డైట్‌ను పూర్తిగా మార్చేశాడు. రోటీ, అన్నం, మైదా, బేకరీ ఐటమ్స్, చక్కెర పానీయాలు మానేశాడు. గ్రిల్డ్ ఫిష్, ఉడకబెట్టిన చికెన్, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, మొలకలు, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీతో డైట్ కొనసాగించి.. జిమ్, రన్నింగ్, స్విమ్మింగ్‌తో కష్టపడ్డాడు.

ప్రస్తుతం 2026-27 దేశవాళీ సీజన్‌లో రంజీల్లో హిమాచల్ ప్రదేశ్‌పై 154, రైల్వేస్‌పై 55తో, SMATలో మెరుపు ఇన్నింగ్స్‌లతో టీమిండియా పునరాగమనం కోసం తలుపు తడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us