‘ఇదెక్కడి షాకింగ్ భయ్యా.. వరుసగా విఫలమైనా శాంసన్‌కే ఛాన్స్.. ప్లేయింగ్ 11 నుంచి ఇషాన్ కిషన్ ఔట్?’
Sanju Samson vs Ishan Kishan: టీ20 ప్రపంచ కప్ కోసం సంజు శాంసన్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడా లేదా అనేది కీలక ప్రశ్నగా మారింది. ఈ విషయంపై మాజీ కెప్టెన్ అజింక్య రహానే కీలక ప్రకటన చేశాడు. భారత జట్టు యాజమాన్యం ఇషాన్ కిషన్ కంటే సంజు శాంసన్‌ను ఎంచుకుంటుందంటూ రహానే విశ్వసిస్తున్నాడు.

Sanju Samson vs Ishan Kishan: న్యూజిలాండ్ జట్టుతో జరగుతులోన్న ఐదు టీ20ఐల సిరీస్‌లో భారత జట్టు 2-0తో దూసుకెళ్తోంది. అటు బౌలర్లు, ఇటు బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఫీల్డింగ్ విషయంలోనూ ఆకట్టుకుంటున్నారు. అయితే, ఓ ప్లేయర్ విషయంలో మాత్రం భారత జట్టుకు టెన్షన్ పట్టుకుంది. ఆయనే సంజూ శాంసన్. సంజు శాంసన్ వరుసగా మూడు టీ20 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే, తిలక్ వర్మ టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తిరిగి వస్తే.. ఎవరిని తప్పిస్తారోనని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంజు శాంసన్ లేదా ఇషాన్ కిషన్? ఈ విషయంలో భారత మాజీ కెప్టెన్ అజింక్య రహానే శాంసన్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇషాన్ కిషన్‌ను జట్టు నుంచి తప్పించి, సంజు శాంసన్‌కు అవకాశం ఇస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. రహానే ప్రకారం, సూర్యకుమార్ యాదవ్, గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా శాంసన్‌కు అండగా నిలుస్తారంటూ చెప్పుకొచ్చాడు.
సంజు శాంసన్ గురించి అజింక్య రహానే ఏమన్నాడంటే?
క్రిక్‌బజ్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అజింక్య రహానే మాట్లాడుతూ, సంజు శాంసన్ గొప్ప ప్లేయర్, ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ అతను టీ20 ప్రపంచ కప్‌లో అవకాశం పొందేందుకు అర్హుడని అన్నాడు. “యాజమాన్యం, కెప్టెన్ అతనిపై నమ్మకం ఉంచుతారు, అతనికి అండగా నిలుస్తారు. సంజు శాంసన్ నాణ్యమైన ఆటగాడు. అతనికి అపారమైన సామర్థ్యం ఉంది. ఈ ఫార్మాట్‌లో, మీరు ముందుగానే ఔట్ అయితే తప్పులు ఎంచుతుంటారు. మీరు ఔట్ అయ్యే విధానం అందరినీ చికాకుపెడుతుంది. కానీ అది పర్వాలేదు. ఈ ఫార్మాట్‌లో, మీరు పూర్తి స్వేచ్ఛతో ఆడాలి. మీరు మీపై నమ్మకం ఉంచాలి” అంటూ రహానే తెలిపాడు.
ఇషాన్ కిషన్‌ను దూరంగా ఉంచుతానంటూ షాకింగ్ కామెంట్స్..
సంజు శాంసన్ తిరిగి ఫామ్‌లోకి రావడానికి ఏం చేయాలో అజింక్య రహానే సూచించాడు. “అతను క్రీజులో సమయం గడపాలి. మొదటి రెండు ఓవర్లు చూసి ఆ తర్వాత ఆడటం ప్రారంభించాలి. ఇషాన్ కిషన్ బయట కూర్చోవాల్సి ఉంటుందని నేను భావిస్తున్నాను. సంజు శాంసన్ ప్లేయింగ్ ఎలెవన్‌లోనే ఉంటాడు. తదుపరి రెండు మ్యాచ్‌లలో అతను పరుగులు సాధించకపోయినా, అతను నా కోసం ప్లేయింగ్ ఎలెవన్‌లోనే ఉంటాడు” అని అతను చెప్పుకొచ్చాడు.
శాంసన్ పరుగులు సాధించాల్సిందే..
టీమిండియా తదుపరి టీ20 మ్యాచ్ జనవరి 28న జరగనుంది. ఈ మ్యాచ్ విశాఖపట్నంలో జరుగుతుంది. ఇక్కడ సంజు శాంసన్ పరుగుల స్కోరు చేయడం చాలా కీలకం. అతను బాగా రాణిస్తే, అతన్ని ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తొలగించే అవకాశం లేదు. అయితే, అతని పేలవమైన ప్రదర్శన ఇలాగే కొనసాగితే, టీ20 ప్రపంచ కప్ ప్రమాదంలో ఉన్నందున, టీమిండియా కీలక నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది.




