Sai Sudharsan : ఆయన లేని లోటు తీర్చాల్సిందే.. లేకపోతే జట్టు నుండి సాయి సుదర్శన్ గెట్ అవుట్
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ అక్టోబర్ 10న ఢిల్లీలో జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం టీమిండియా ఆడే తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు చాలా తక్కువ. అయితే, జట్టులో ఉన్న సాయి సుదర్శన్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకం కానుంది. ఎందుకంటే విరాట్ కొహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతని స్థానాన్ని భర్తీ చేసే సరైన ఆటగాడి కోసం బీసీసీఐ అన్వేషిస్తోంది.

Sai Sudharsan : భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసిన తర్వాత ముఖ్యంగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, అతని అత్యంత కీలకమైన స్థానాన్ని (మూడో స్థానం) భర్తీ చేయడానికి బీసీసీఐ కసరత్తు చేస్తోంది. ఈ స్థానాన్ని భర్తీ చేయడానికి మొదట కర్ణాటక ఆటగాడు కరుణ్ నాయర్కు అవకాశం ఇచ్చినా, ఆయన ఆశించిన ప్రదర్శన చేయలేకపోయారు. ఇప్పుడు కోహ్లీ స్థానంలో ఆడుతున్న యువ ఆటగాడు సాయి సుదర్శన్ కూడా తమ ప్రభావాన్ని చూపడంలో విఫలమవుతున్నారు. అందుకే అక్టోబర్ 10 నుండి ఢిల్లీలో జరగబోయే వెస్టిండీస్‌తో జరిగే రెండవ టెస్ట్ మ్యాచ్, సాయి సుదర్శన్‌కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడకపోతే అతను టెస్ట్ జట్టు నుంచి బయటికి వెళ్లడం ఖాయం.
సాయి సుదర్శన్‌ను భారత టెస్ట్ జట్టు నుండి తొలగించడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, అతని పేలవమైన ప్రదర్శన. రెండవది జట్టులో ఆ మూడో స్థానం కోసం నలుగురు యువ ఆటగాళ్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాయి సుదర్శన్ తన స్థానాన్ని పదిలం చేసుకోవాలంటే, రాబోయే మ్యాచ్‌లో పెద్ద స్కోర్ చేయాల్సిన అవసరం ఉంది.
వెస్టిండీస్‌తో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా సాయి సుదర్శన్ కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఇది అతని కెరీర్‌లో ఏడవ ఇన్నింగ్స్. ఈ ఏడాది జూన్-జూలైలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటన సమయంలో అతనికి టెస్ట్ అరంగేట్రం చేసే అవకాశం లభించినా, అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పటివరకు అతను ఆడిన 7 ఇన్నింగ్స్‌లలో, కేవలం 21 సగటుతో 147 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది.
వెస్టిండీస్‌తో ఢిల్లీలో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌లో సాయి సుదర్శన్ ప్రదర్శన ఇదే విధంగా కొనసాగితే, తదుపరి సిరీస్‌కు జట్టు యాజమాన్యం కొత్త పేర్లను పరిశీలించడంలో ఎలాంటి సందేహం లేదు. సాయి సుదర్శన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లలో అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్ వంటి యంగ్ ప్లేయర్లు ఉన్నారు. వీరంతా మంచి దేశవాళీ రికార్డుతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ పోటీ వాతావరణంలో సాయి సుదర్శన్‌కు మెరుగైన ప్రదర్శన ఇవ్వడం తప్ప వేరే మార్గం లేదు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




