Rohit Sharma : మళ్లీ అదే సెంటిమెంట్.. డ్రెస్సింగ్ రూమ్ ఎమోషనల్ ఫోటోల వెనుక అసలు కథ ఇదేనా?
Rohit Sharma : లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డేతో రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బీసీసీఐ మౌనం, డ్రెస్సింగ్ రూమ్ ఎమోషనల్ ఫోటోలు, యశస్వి జైస్వాల్‌కు అవకాశాలపై ప్రచారం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.

Rohit Sharma : భారత్, ఇంగ్లాండ్ మధ్య జూలై 19న జరగబోయే మూడో వన్డే మ్యాచ్ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. లార్డ్స్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌తో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు శాశ్వతంగా వీడ్కోలు పలుకుతారనే వార్తలు క్రీడా వర్గాల్లో దావానలంలా వ్యాపిస్తున్నాయి. టీమిండియాను విజయపథంలో నడిపిన ఈ పరుగుల వీరుడి ఆఖరి అంతర్జాతీయ పోరు ఇదే కానుందని పలు జాతీయ మీడియా సంస్థలు వరుస కథనాలను ప్రచురిస్తున్నాయి. దీంతో భారత క్రికెట్ అభిమానులలో తీవ్ర చర్చ మొదలైంది.
హిట్ మ్యాన్ రిటైర్మెంట్‌పై బీసీసీఐ మౌనం
రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు సోషల్ మీడియాను ఊపేస్తున్నప్పటికీ ఈ విషయమై ఇప్పటివరకు అటు రోహిత్ శర్మ గానీ, ఇటు బీసీసీఐ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. అతని కెరీర్ చుట్టూ రిటైర్మెంట్ పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ గెలిచినప్పుడు కూడా అతని రిటైర్మెంట్ గురించి ఇలాంటి ప్రచారమే సాగింది. తాజాగా లార్డ్స్ మ్యాచ్ ముంచుకొస్తుండటంతో మరోసారి ఈ వార్త ట్రెండింగ్‌లోకి వచ్చింది.
మళ్లీ అదే సెంటిమెంట్
ఇటీవల ఇంగ్లాండ్ టూర్ డ్రెస్సింగ్ రూమ్‌కు సంబంధించిన కొన్ని ఎమోషనల్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అందులో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ ఆలింగనం చేసుకున్న దృశ్యాలు అభిమానులను కలవరపెడుతున్నాయి. గతంలో భారత జట్టులో కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించే ముందు ఇలాంటి భావోద్వేగపూరితమైన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయని, ఇప్పుడు రోహిత్ కూడా అదే బాటలో నడుస్తున్నారంటూ నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెస్టులకూ ఇప్పటికే గుడ్‌బై
ఇప్పటికే టీ20 ఇంటర్నేషనల్స్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ, ఈ ఏడాది మే 7వ తేదీన టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టెస్ట్ ఫార్మాట్ నుంచి తప్పుకున్న తర్వాత జరిగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రోహిత్ తన రిటైర్మెంట్ ఆలోచనలపై స్పష్టత ఇచ్చాడు. “నేను మైదానంలో ఆశించిన రీతిలో రాణించలేకపోతున్నానని నాకు అనిపించిన రోజే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాను. కానీ ప్రస్తుతం నేను ఆడే ఆట జట్టు విజయాలకు ఉపయోగపడుతోందని గట్టిగా నమ్ముతున్నాను. నా మనసుకు ఎప్పుడు చాలు అనిపిస్తే అప్పుడే ఆపేస్తాను” అని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.
యశస్వి జైస్వాల్ కోసం సెలక్టర్ల భారీ ప్లాన్
మరోవైపు, రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ సెలక్టర్లు ఇప్పటికే ఒక కఠినమైన నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం.. 2027 లో జరగబోయే వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని సెలక్షన్ కమిటీ భావిస్తోంది. గత కొంతకాలంగా అద్భుతమైన ప్రదర్శనతో అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు రోహిత్ స్థానంలో వన్డేలలో ఓపెనర్‌గా సుదీర్ఘ అవకాశాలు ఇవ్వాలని సెలక్టర్లు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే రోహిత్‌కు సెలక్టర్లు ఒక క్లారిటీ ఇచ్చారని, ఇక రిటైర్మెంట్ ప్రకటించడమే మిగిలిందని వార్తలు వస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
