Rohit Sharma : లండన్ చేరుకున్న రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. లార్డ్స్ వన్డేతోనే వీడ్కోలు దాదాపు ఖాయం
Rohit Sharma : లార్డ్స్ వేదికగా జరిగే మూడో వన్డేతో రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నారనే ప్రచారం మరింత బలపడింది. హిట్ మ్యాన్ తల్లిదండ్రులు లండన్ చేరుకోవడం, సెలక్టర్ల భవిష్యత్ ప్రణాళికలపై వస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి.

Rohit Sharma : భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో ఒకరైన రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. జూలై 19న ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే మ్యాచ్‌తోనే హిట్ మ్యాన్ అంతర్జాతీయ వన్డే కెరీర్‌కు ముగింపు పలకబోతున్నారనే ప్రచారం నిజమేననిపిస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ తల్లిదండ్రులైన గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మ హుటాహుటిన లండన్ చేరుకున్నారు. కొడుకు ఆడే ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌కు మైదానంలో ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచేందుకే వారు లండన్ వెళ్లారని మీడియా వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.
ఉత్కంఠ రేపుతున్న పేరెంట్స్ ఎంట్రీ
రోహిత్ కెరీర్‌లో అత్యంత భావోద్వేగపూరితమైన ఈ క్షణంలో అతని కుటుంబ సభ్యులు లండన్‌కు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆదివారం లార్డ్స్ మైదానంలో జరిగే ఈ చారిత్రాత్మక మ్యాచ్‌ను వారు స్టేడియం నుంచి వీక్షించనున్నారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు బీసీసీఐ గానీ లేదా స్వయంగా రోహిత్ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, లండన్‌కు అతని తల్లిదండ్రులు రావడం ఈ ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది.
అజిత్ అగార్కర్, గౌతమ్ గంభీర్ క్లారిటీ
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గత వారమే రోహిత్ శర్మను కలిసి సుదీర్ఘంగా చర్చించారు. భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికల గురించి వారు రోహిత్‌కు స్పష్టత ఇచ్చారు. 2027 వన్డే ప్రపంచకప్ దృష్ట్యా యువ ఆటగాళ్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తోందని, అందువల్ల రోహిత్ శర్మను ఆ టోర్నీ కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదని తేల్చి చెప్పారు. భవిష్యత్తు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేయాలని బోర్డు యోచిస్తోంది. దీంతో ఈ ఇంగ్లాండ్ సిరీస్ రోహిత్‌కు చివరిది కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.
అఫ్గానిస్థాన్ సిరీస్‌లోనే పడాల్సిన ముగింపు కార్డు
వాస్తవానికి అంతకుముందు జరిగిన అఫ్గానిస్థాన్ వన్డే సిరీస్‌తోనే రోహిత్ కెరీర్‌కు ముగింపు పలకాలని సెలక్టర్లు భావించారట. అయితే ఆ సిరీస్‌లో రోహిత్ శర్మ ఒక చక్కని హాఫ్ సెంచరీ బాదడంతో అతని రిటైర్మెంట్ నిర్ణయాన్ని సెలక్టర్లు మరికొంత కాలం ముందుకు నెట్టారు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రోహిత్ ఘోరంగా విఫలమయ్యాడు. మొదటి వన్డేలో 11 రన్స్, కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో 47 బంతుల్లో కేవలం 26 రన్స్ మాత్రమే చేశాడు. వరుస వైఫల్యాలు కూడా రోహిత్‌ను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా పురికొల్పినట్లు తెలుస్తోంది.
రెండు ఫార్మాట్లకు ఇప్పటికే గుడ్‌బై
రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లోని రెండు ప్రధాన ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశారు. 2024 జూన్ 29న బార్బడోస్‌లో టీమిండియాకు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన వెంటనే ఆయన టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత 2025 మే నెలలో ఒక భావోద్వేగపూరితమైన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా టెస్ట్ క్రికెట్‌కు కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు లార్డ్స్ వేదికగా జరగనున్న వన్డే మ్యాచ్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌కు పూర్తి స్థాయిలో వీడ్కోలు పలికేందుకు హిట్ మ్యాన్ సిద్ధమయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
