Rinku Singh: భారత జట్టులో నో ఛాన్స్.. కట్ చేస్తే.. సెలెక్టర్లకు గట్టిగా సమాధానమిచ్చిన రింకూ.!
ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనదైన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు మాత్రం సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు.
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన యువ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, తిలక్ వర్మలకు టీ20 జట్టులో చోటు దక్కిన విషయం తెలిసిందే. వెస్టిండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు వీరిరువురూ ఎంపికయ్యారు. అయితే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో తనదైన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ రింకూ సింగ్‌కు మాత్రం సెలెక్టర్లు మొండిచెయ్యి చూపించారు. అయితే రింకూ సింగ్ జట్టును ఎంపిక చేసిన 24 గంటల్లోనే సెలెక్టర్లకు తన బ్యాట్‌తో గట్టిగా సమాధానం ఇచ్చాడు.
ప్రస్తుతం రింకూ సింగ్ దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్ తరపున ఆడుతున్నాడు. అతడు మొదటి ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశాడు. ఇదేంటి.. ఈ ఇన్నింగ్స్‌తోనే సెలెక్టర్లకు సమాధానం ఇచ్చాడా.? అని అనుకోవచ్చు. దులీప్ ట్రోఫీ సెమీ-ఫైనల్స్‌లో వెస్ట్ జోన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో, సెంట్రల్ జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 128 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇందులో రింకూ సింగ్ 48 పరుగులు ఉన్నాయి. బౌలర్లకు ఎంతగానో సహకరించే పిచ్‌పై రింకూ చివరి వరకు తన అద్భుతమైన టెక్నిక్‌తో ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా 69 బంతుల్లో 48 పరుగులు చేశాడు.
సూర్యకుమార్ యాదవ్, పుజారా, సర్ఫరాజ్ లాంటి ప్లేయర్స్ ఈ పిచ్‌పై పూర్తిగా విఫలమైనప్పటికీ.. రింకూ సింగ్ తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్, ఛతేశ్వర్ పుజారా, సర్ఫరాజ్ ఖాన్ వెస్ట్ జోన్ తరఫున ఆడుతుండగా, ఈ ముగ్గురు ఆటగాళ్లు.. రింకూ సింగ్ చేసినంత పరుగులు కూడా రాబట్టలేకపోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ 7 పరుగులు మాత్రమే చేయగా.. సర్ఫరాజ్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. ఇక పుజారా 28 పరుగులకు ఔట్ అయ్యాడు. దీన్ని బట్టి చూస్తే ముగ్గురు స్టార్ ప్లేయర్స్ విఫలమైన పిచ్‌పై రింకూ సింగ్ తన సత్తా చాటాడని స్పష్టమవుతోంది.