Team India: పొమ్మనలేక పొగబెడుతున్నారు.. రోహిత్, కోహ్లీ టీ20 కెరీర్ ఇక ముగిసినట్టే.?
విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కకపోవడం గమనార్హం..
విండీస్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికైన జట్టులో స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లను వరుసగా 4వ టీ20 సిరీస్‌కు పక్కనపెట్టింది బీసీసీఐ. ప్రస్తుతం వీరు విండీస్ పర్యటనలో ఉన్నారు. అక్కడ ఇరువురూ రెండు టెస్టులు, ఆ తర్వాత మూడు వన్డేలు ఆడతారు. అయితే విరాట్, రోహిత్‌ను టీ20లకు ఎంపిక చేయకపోవడం వెనుక ఓ కారణం ఉందట. టీ20 ప్రపంచకప్ 2024ను దృష్టిలో ఉంచుకుని భారత జట్టు మేనేజ్‌మెంట్.. హార్దిక్ పాండ్యా నేతృత్వంలో యువ ఆటగాళ్లతో కూడిన జట్టును సిద్దం చేసేందుకే రోహిత్-విరాట్‌లపై వేటు వేశారట.
ఇదిలా ఉండగా.. ఈ స్టార్ ఆటగాళ్లు టీ20లకు ఎంపిక కాకపోవడం ఇదేం తొలిసారి కాదు. టీ20 ప్రపంచకప్ 2022 నుంచి, ఇది వరుసగా నాలుగో సిరీస్‌కి వారు దూరమయ్యారు. గతేడాది న్యూజిలాండ్ టూర్‌లో కూడా రోహిత్-విరాట్‌లను టీ20 జట్టు నుంచి తప్పించారు. దీని తర్వాత, ఈ ఏడాది శ్రీలంక ఆ తర్వాత న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో ఈ ఇద్దరిని ఎంపిక చేయలేదు. కాగా, రోహిత్, కోహ్లీ నవంబర్ 10, 2022న అడిలైడ్‌లో ఇంగ్లాండ్‌తో చివరిసారిగా టీ20 ఆడారు.