Anvay Dravid : తండ్రిని గుర్తుచేసిన కొడుకు.. కష్టాల్లో గోడలా నిలబడి టీమిండియాను ఆదుకున్న అన్వయ్ ద్రావిడ్
Anvay Dravid : శ్రీలంక అండర్-19తో జరిగిన రెండో అనధికార వన్డేలో రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ 87 పరుగులతో అద్భుతంగా రాణించాడు. 81/4 కష్టాల్లో ఉన్న భారత్‌ను గట్టెక్కించి 285 పరుగుల గౌరవప్రద స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు.

Anvay Dravid : భారత క్రికెట్ దిగ్గజం, ది వాల్ రాహుల్ ద్రావిడ్ వారసుడు అన్వయ్ ద్రావిడ్ జూనియర్ క్రికెట్లో తన మార్కును చూపిస్తున్నాడు. శ్రీలంక అండర్-19 జట్టుతో జరిగిన రెండో అన్అఫీషియల్ వన్డే మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు 285 పరుగుల మంచి స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ద్రావిడ్ కుమారుడు అన్వయ్ ద్రావిడ్ ఆడిన బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ జట్టుకు కొండంత అండగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ యశవర్ధన్ చౌహాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత్‌కు ఆశించిన స్థాయిలో ఆరంభం లభించలేదు. కెప్టెన్ యశవర్ధన్ కేవలం 6 పరుగులు, మరో ఓపెనర్ సాగర్ వర్క్ 4 పరుగులకే అవుట్ కావడంతో భారత్ తీవ్ర కష్టాల్లో పడింది.
ఒకానొక దశలో కేవలం 81 పరుగులకే టాప్-4 వికెట్లు కోల్పోయి భారత యువ జట్టు తీవ్ర ఒత్తిడిలో మునిగిపోయింది. ఆ సమయంలో రాహుల్ ద్రావిడ్‌ను అభిమానులు ఎందుకు ది వాల్ అని పిలిచేవారో ఆయన కొడుకు అన్వయ్ ద్రావిడ్ మరోసారి నిరూపించాడు. గతంలో ఎన్నోసార్లు ద్రావిడ్ జట్టును కష్టాల్లోంచి ఒడ్డుకు పడేసినట్లే, అన్వయ్ కూడా క్రీజులో పాతుకుపోయాడు. అతడు ఐదో వికెట్‌కు అర్జున్ రాజ్‌పుత్‌తో కలిసి లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. ఈ జోడి ఐదో వికెట్‌కు ఏకంగా 141 పరుగుల అద్భుతమైన శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును సంక్షోభం నుంచి రక్షించింది. ఈ ఇద్దరూ నిలకడగా ఆడుతున్నంత సేపు భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించినా, ఈ జోడి విడిపోయాక టీమిండియా మళ్లీ వరుస వికెట్లు కోల్పోయి 285 పరుగులకు ఆలౌట్ అయింది.
ఈ మ్యాచ్‌లో అన్వయ్ ద్రావిడ్ తన అండర్-19 క్రికెట్ కెరీర్లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 67 బంతులు ఎదుర్కొన్న అతడు 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి జట్టులో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇటు అతనికి చక్కని సహకారం అందించిన అర్జున్ రాజ్‌పుత్ 81 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 76 పరుగులు చేసి రాణించాడు. భారత్ వైపు నుండి ఈ మ్యాచ్‌లో నమోదైన అత్యధిక స్కోరు అన్వయ్దే కావడం విశేషం. అయితే జట్టును మంచి పొజిషన్లో నిలబెట్టిన అన్వయ్ దురదృష్టవశాత్తూ తన సెంచరీ మార్కును అందుకోలేకపోయాడు. ఇన్నింగ్స్ 44వ ఓవర్లో శ్రీలంక బౌలర్ గిమ్హాన్ మెండిస్ వేసిన అద్భుతమైన బంతికి అతడు బౌల్డ్ అయ్యాడు.
అన్వయ్ ద్రావిడ్ 7వ వికెట్ రూపంలో అవుట్ అయ్యే సమయానికి భారత జట్టు స్కోరు 263 పరుగులుగా ఉంది. సెట్ అయిన బ్యాటర్ అన్వయ్ అవుట్ కావడంతో భారత్ తక్కువ పరుగులకే పరిమితమైంది. ఆ తర్వాత వచ్చిన లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో భారత్ చివరి ఓవర్లలో కేవలం 22 పరుగులు మాత్రమే జోడించగలిగింది. శ్రీలంక బౌలర్లలో గిమ్హాన్ మెండిస్ భారత బ్యాటర్లను ముప్పతిప్పలు పెట్టాడు. అతడు కేవలం 8.2 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 41 పరుగులిచ్చి కీలకమైన 5 వికెట్లను పడగొట్టి భారత్‌ను దెబ్బతీశాడు. ఏదేమైనా భవిష్యత్తు వన్డే వరల్డ్ కప్ స్టార్లను తయారుచేసే ఈ టోర్నీలో జూనియర్ ద్రావిడ్ ప్రదర్శనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
