AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యూటీ డైట్.. ఇవి తింటే వృద్ధాప్యం టచ్ కూడా చేయదు.. కొలెస్ట్రాల్‌, బీపీకి కూడా చెక్..

50 ఏళ్ల వయస్సు జీవితంలో కీలకమైన దశ. ఈ వయసు తర్వాత శరీరంలో సహజంగా అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఎముకలు, గుండె, ఊపిరితిత్తులు, కళ్ల ఆరోగ్యంతో పాటు కొలెస్ట్రాల్, బీపీ, రక్తంలో చక్కెర వంటి సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బ్యూటీ డైట్.. ఇవి తింటే వృద్ధాప్యం టచ్ కూడా చేయదు.. కొలెస్ట్రాల్‌, బీపీకి కూడా చెక్..
Healthy Diet
Shaik Madar Saheb
|

Updated on: Aug 16, 2026 | 1:40 PM

Share

మనిషి జీవితంలో 50 ఏళ్ల వయస్సు ఒక ముఖ్యమైన మలుపు. ఈ దశలో శరీరం సహజంగానే అనేక శారీరక, జీవక్రియ మార్పులకు గురవుతుంది. కణాల పనితీరు తగ్గి, కణజాలం బలహీనపడటం వల్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం తప్పనిసరి. ఈ వయసులో వచ్చే సాధారణ ఆరోగ్య సమస్యలను నివారించి, యవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలంటే ఆహార నియమాలు, జీవనశైలిలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేసుకోవడం అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్య సమస్యలు:

ముఖ్యంగా 45-50 దాటాక ఊపిరితిత్తులు, వెన్నెముక, ఎముకలు, గుండె, కళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా ఎముకల సాంద్రత తగ్గడం (ముఖ్యంగా మహిళల్లో), గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. న్యూమోనియా వంటి అంటువ్యాధులు కూడా రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల ఎక్కువ అవుతాయి.. దీంతోపాటు కొలెస్ట్రాల్ సమస్య కూడా పెరుగుతుంది. సరైన ఆహారం, వ్యాయామం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షల ద్వారా ఈ సమస్యలను చాలా వరకు నివారించవచ్చు.

ఆహార నియమాలు:

తాజా పండ్లు, కూరగాయలు: రోజువారీ ఆహారంలో వీటిని భాగం చేసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఫైబర్: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.

కాల్షియం, విటమిన్ డి: ఎముకల ఆరోగ్యానికి కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. పన్నీర్, పెరుగు, నువ్వులు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు వంటివి కాల్షియం అందిస్తాయి. ఉదయం సూర్యరశ్మిలో అరగంట పాటు గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది.

మాంసాహారం: మాంసాహారం తీసుకునే వారు కొవ్వు లేని చికెన్, చేపలు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాలను తగ్గించాలి. వీటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉండటమే కాకుండా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

వీటిని తగ్గించండి.. : అధిక కొవ్వు (సంతృప్త కొవ్వు), ఉప్పు, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలు (బేకరీ ఉత్పత్తులు, డెజర్ట్స్), కూల్ డ్రింక్స్, పచ్చళ్లు వంటి నిల్వ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి.

నీరు: డీహైడ్రేషన్ వల్ల చర్మం సాగే గుణం కోల్పోవడం, అజీర్తి, శక్తి లేకపోవడం వంటివి జరుగుతాయి. వయసు పెరిగే కొద్దీ దాహం సంకేతాలు తగ్గవచ్చని గుర్తుంచుకొని, తరుచుగా నీరు తాగుతూ ఉండాలి.

జీవనశైలి మార్పులు:

వ్యాయామం: క్రమం తప్పకుండా కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సరైన బరువును నిలబెట్టుకోవడానికి సహాయపడుతుంది. నడక వంటి తేలికపాటి వ్యాయామాలను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలి.

నిద్ర: ప్రతిరోజు 7-8 గంటల పాటు తగినంత నిద్రపోవడం శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

ఒత్తిడి నిర్వహణ: ఒత్తిడి మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. యోగా, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను అందిస్తాయి.

ధూమపానం, మద్యపానం: ఆల్కహాల్, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

ముఖ్యమైన వైద్య పరీక్షలు:

50 దాటిన తర్వాత క్రమం తప్పకుండా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం:

రక్తంలో చక్కెర స్థాయిలు: మధుమేహాన్ని గుర్తించడానికి.

కొలెస్ట్రాల్ స్థాయిలు: గుండె జబ్బుల ప్రమాదాన్ని అంచనా వేయడానికి.

రక్తపోటు (బీపీ): హైపర్‌టెన్షన్, గుండె, కిడ్నీ సమస్యలను నివారించడానికి.

ఈ నియమాలన్నీ పాటిస్తూ, ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించి, వారి సూచనల మేరకు జీవనశైలిని అనుసరించడం ద్వారా 50 ఏళ్ల వయస్సులో కూడా ఆరోగ్యంగా, చలాకీగా, ప్రశాంతమైన జీవనాన్ని గడపవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us