Bangladesh Cricket: టెస్టుల్లో బంగ్లాదేశ్ దాటికి లొంగని రెండు జట్లు ఇవే ? ఆసిస్‌ను ఓడించినా ఆ రికార్డు మాత్రం బాకీనే
Bangladesh Cricket: డార్విన్ టెస్టులో ఆస్ట్రేలియాపై చారిత్రాత్మక విజయం సాధించి ప్రపంచ క్రికెట్‌ను బంగ్లాదేశ్ ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు టెస్టుల్లో 11 ప్రత్యర్థి జట్లతో తలపడిన బంగ్లాదేశ్, దాదాపు అన్ని బలమైన జట్లపై గెలుపొందింది. అయితే ఇప్పటికీ ఆ జట్టు ఒక్కసారి కూడా ఓడించలేని రెండు బలమైన జట్లు ఉన్నాయి.

Bangladesh Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఓడించలేని మొదటి జట్టు భారత్. టీమిండియాతో ఆడిన 15 టెస్టు మ్యాచ్‌ల్లో బంగ్లాదేశ్ 13 మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. 2022 డిసెంబర్‌లో ఢాకా వేదికగా జరిగిన రెండో టెస్టులో బంగ్లాదేశ్ గెలుపుకు చాలా దగ్గరగా వచ్చింది. 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 74 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. మెహదీ హసన్ మిరాజ్ 5 వికెట్లతో చెలరేగడంతో బంగ్లా గెలుపు ఖాయమని భావించారు. శ్రేయస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్ అద్భుత పోరాటంతో భారత్‌ను గెలిపించి బంగ్లాదేశ్ ఆశలపై నీళ్లు చల్లారు.
భారత్‌తో మళ్లీ టెస్టు పోరు ఎప్పుడు?
సెప్టెంబర్ 2024 తర్వాత భారత్, బంగ్లాదేశ్ మధ్య టెస్టు మ్యాచ్ జరగలేదు. ఇరు దేశాల మధ్య రాజకీయ, దౌత్యపరమైన పరిస్థితుల కారణంగా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆలస్యమయ్యాయి. 2026 చివరి నాటికి పరిమిత ఓవర్ల సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, టీమిండియా బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ఏడాది టెస్టు సిరీస్ సాధ్యం కాకపోవచ్చు. 2027 నాటికి మాత్రమే భారత్, బంగ్లాదేశ్ మధ్య రెడ్ బాల్ సిరీస్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సౌతాఫ్రికా దెబ్బకు తలవంచిన బెంగాల్ టైగర్స్
బంగ్లాదేశ్ చేతిలో ఇప్పటివరకు ఓడిపోని రెండో జట్టు సౌతాఫ్రికా. ప్రొటీస్ జట్టుతో ఆడిన 16 టెస్టుల్లో బంగ్లాదేశ్ 14 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవ్వగా, మరో రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. 2008లో మీర్పూర్ వేదికగా జరిగిన టెస్టులో బంగ్లాదేశ్ గెలిచే అవకాశాన్ని తృటిలో చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికాను 170 పరుగులకే ఆలౌట్ చేసి, ప్రత్యర్థి ముందు 205 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. షాహదత్ హొస్సేన్ 6 వికెట్లతో చెలరేగినప్పటికీ, ఏబీ డివిలియర్స్, మార్క్ బౌచర్ ధైర్యంగా పోరాడి సౌతాఫ్రికాకు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు.
సౌతాఫ్రికాను ఓడించేందుకు సువర్ణ అవకాశం
దక్షిణాఫ్రికాపై ఉన్న ఈ ఓటముల రికార్డును తిరగరాసేందుకు బంగ్లాదేశ్‌కు నవంబర్ 2026లో మంచి అవకాశం రానుంది. నవంబర్ 15, 2026న జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ ప్రొటీస్ జట్టుతో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 23న సెంచూరియన్‌లో రెండో టెస్టు జరగనుంది. ఈ సిరీస్‌లో గెలిచి సౌతాఫ్రికాపై తొలి టెస్టు విజయాన్ని నమోదు చేయాలని బంగ్లాదేశ్ పట్టుదలతో ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
