AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PBKS vs RCB, IPL 2022: స్మిత్‌, షారుఖ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌.. బెంగళూరుపై పంజాబ్‌ స్టన్నింగ్‌ విక్టరీ..

PBKS vs RCB: ఓడిన్ స్మిత్ (8బంతుల్లో 25..3 సిక్స్‌లు, ఒక ఫోర్‌), షారుఖ్ ఖాన్ ( 20 బంతుల్లో 24 ..2 సిక్స్‌లు, ఒక ఫోర్‌) చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  పంజాబ్ కింగ్స్ (PBK) ఐదు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ని ఓడించింది

PBKS vs RCB, IPL 2022: స్మిత్‌, షారుఖ్‌ల మెరుపు ఇన్నింగ్స్‌.. బెంగళూరుపై పంజాబ్‌ స్టన్నింగ్‌ విక్టరీ..
Rcb Vs Pbks
Basha Shek
|

Updated on: Mar 28, 2022 | 12:22 AM

Share

PBKS vs RCB: ఓడిన్ స్మిత్ (8బంతుల్లో 25..3 సిక్స్‌లు, ఒక ఫోర్‌), షారుఖ్ ఖాన్ ( 20 బంతుల్లో 24 ..2 సిక్స్‌లు, ఒక ఫోర్‌) చివరి ఓవర్లలో మెరుపులు మెరిపించడంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో  పంజాబ్ కింగ్స్ (PBK) ఐదు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ని ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఒకదశలో పంజాబ్‌కు ఈ లక్ష్యాన్ని సాధించడం కష్టంగా అనిపించినా స్మిత్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడు షారుఖ్‌ ఖాన్‌ కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్ 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. కాగా పంజాబ్ విజయానికి చివరి మూడు ఓవర్లలో 36 పరుగులు చేయాల్సి ఉంది. 18వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన మూడు సిక్సర్లు, ఒక ఫోర్ సాయంతో 25 పరుగులు చేసిన స్మిత్ బెంగళూరు ఆశలపై నీళ్లు చల్లాడు. ఇక19వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టి జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు షారుఖ్‌.

శుభారంభం అందించిన ఓపెనర్లు..

206 పరుగుల టార్గెట్‌తో ఛేజింగుకు దిగిన పంజాబ్కు ఓపెనింగ్ జోడీ కెప్టెన్ మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్ గట్టి పునాది అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఎనిమిదో ఓవర్ తొలి బంతికే వనిందు హసరంగ మయాంక్‌ను ఔట్‌చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. కానీ అతని స్థానంలో వచ్చిన శ్రీలంక బ్యాటర్‌ భానుక రాజపక్సే ధాటిగా ఆడాడు. మరో ఓపెనర్‌ ధావన్‌తో కలిసి జట్టు స్కోరును100 దాటించాడు. ధావన్ హాఫ్ సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో హర్షల్ పటేల్ అనూజ్ రావత్ చేతికి చిక్కాడు. ధావన్ 29 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. మయాంక్ 24 బంతుల్లో 32 పరుగులు చేశాడు. మయాంక్ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ధావన్ తర్వాత పంజాబ్ విజయం బాధ్యత రాజపక్సేపైనే ఉన్నప్పటికీ 14వ ఓవర్ తొలి బంతికే మహ్మద్ సిరాజ్ అతడిని పెవిలియన్‌కు పంపాడు. రాజపక్సే 22 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో, రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లు కొట్టాడు. ఆ తర్వాత అరంగేట్రం మ్యాచ్‌ ఆడుతున్న రాజ్‌ అంగద్‌ బావా తొలి బంతికే సిరాజ్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు.

మెరుపు ఇన్నింగ్స్‌తో మలుపు తిప్పారు..

కాగా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుండడంతో ఒకానొక దశలో పంజాబ్‌కు పరాజయం తప్పదని భావించారు. అయితే స్మిత్‌, షారుఖ్‌ పట్టుదలగా ఆడారు. వీరికి బెంగళూరు పేలవమైన ఫీల్డింగ్‌ బాగా కలిసొచ్చింది. వీరిద్దరూ 25 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. RCB ఫీల్డర్లు కూడా క్యాచ్‌లతో పాటు రనౌట్ అవకాశాలను కూడా వదిలేశారు.

డుప్లెసిస్‌ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌..

అంతకుముందు, టాస్ ఓడిపోయిన RCB ఓపెనర్లు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, అనుజ్ రావత్ మొదట బ్యాటింగ్‌కు దిగారు. వీరిద్దరి భాగస్వామ్యం కారణంగా బెంగళూరు పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 41 పరుగులు జోడించింది. ఈ ఓపెనింగ్ జోడీ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. అయితే రాహుల్ చాహర్‌ అనూజ్ (21)ను బౌల్డ్‌ చేసి ఈ భాగస్వామ్యాన్ని బ్రేక్‌ చేశాడు. మూడో స్థానంలో వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ డు ప్లెసిస్‌తో కలిసి 12 ఓవర్లలోనే జట్టు స్కోరును 100 దాటించాడు. ఈ సమయంలో, కెప్టెన్ 41 బంతుల్లో బ్యాక్ టు బ్యాక్ సిక్సర్లు కొట్టి తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. దీని తర్వాత కూడా హర్‌ప్రీత్ బరాద్ వేసిన 14వ ఓవర్‌లో డు ప్లెసిస్, కోహ్లి 21 పరుగులు పిండుకున్నారు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసింది బెంగళూరు. ఇక చివరి ఐదు ఓవర్లలో పంజాబ్ బౌలర్లను ఊచకోత కోశారు. కేవలం 51 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేశారు. అర్ష్‌దీప్ వేసిన 18వ ఓవర్లో డుప్లెసిస్ షారుక్‌ఖాన్‌ చేతికి చిక్కాడు. దీంతో 61 బంతుల్లో 118 పరుగుల అద్భుతమైన భాగస్వామ్యానికి బ్రేక్‌ పడింది. ఇక నాలుగో స్థానంలో వచ్చిన దినేష్ కార్తీక్, కోహ్లీతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించారు. ఓడిన్‌ స్మిత్‌ వేసిన 19 ఓవర్‌లో ఇద్దరూ కలిసి 18 పరుగులు రాబట్టారు. ఇక సందీప్‌ శర్మ వేసిన 20వ ఓవర్లోనూ ఫోర్లు, సిక్సర్లు బాది జట్టును 200 దాటించాడు కార్తీక్‌. కోహ్లి 29 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సాయంతో 41 పరుగులతో అజేయంగా నిలవగా… కార్తీక్ 14 బంతుల్లో మూడు ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు. వీరు కేవలం 17 బంతుల్లో 37 పరుగులతో జోడించడంతో బెంగళూరు భారీ స్కోరు చేసింది.

Also Read: Pak: 40 ఏళ్లుగా దోచుకుంటున్నవారిని అడ్డుకున్నాను.. అందుకే కూల్చాలని ప్రయత్నిస్తున్నారు.. ఇస్లామాబాద్‌లో సభలో పాక్ ప్రధాని..

Yadadri: మూతపడనున్న బాలాలయం.. పంచకుండాత్మక యాగం పూర్తి అవుతూనే..

Aadhaar Card: ఆధార్‌లో మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసినా OTP రావడం లేదా? కారణమిదే.. అయితే, ఇలా చేయండి..