AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PSL 2026 : పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు.. విదేశీ ప్లేయర్లు తప్పుకోవాలని టీటీపీ వార్నింగ్

PSL 2026 : పాకిస్థాన్ సూపర్ లీగ్ 11 (PSL 11)పై తాలిబన్ల ముప్పు పొంచి ఉంది. విదేశీ ఆటగాళ్లు తప్పుకోవాలని టీటీపీ హెచ్చరించడంతో ఇప్పటికే పాక్ చేరుకున్న అంతర్జాతీయ క్రికెటర్లలో భయాందోళనలు మొదలయ్యాయి. ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్‌లు నిర్వహించాలని పీసీబీ నిర్ణయించింది.

PSL 2026 : పాక్ సూపర్ లీగ్‌కు ఉగ్ర ముప్పు.. విదేశీ ప్లేయర్లు తప్పుకోవాలని టీటీపీ వార్నింగ్
Psl 2026
Rakesh
|

Updated on: Mar 23, 2026 | 7:01 PM

Share

PSL 2026 : పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL) 11వ సీజన్‌పై ఉగ్రవాద నీడలు కమ్ముకున్నాయి. మార్చి 26 నుంచి టోర్నీ ప్రారంభం కావాల్సి ఉండగా, అంతలోనే నిషేధిత ఉగ్రవాద సంస్థ తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్(TTP)కి చెందిన జమాత్-ఉల్-అహ్రార్ గ్రూప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ ఆటగాళ్లు వెంటనే ఈ టోర్నీ నుంచి తప్పుకోవాలని, లేదంటే వారి భద్రతకు తాము బాధ్యులం కాదంటూ చిల్లింగ్ అల్టిమేటం ఇచ్చింది. దీంతో ఇప్పటికే పాక్ చేరుకున్న అంతర్జాతీయ క్రికెటర్లలో భయాందోళనలు మొదలయ్యాయి.

తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ ప్రతినిధి అసద్ మన్సూర్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు. “పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వా, బలూచిస్థాన్ ప్రాంతాల్లో ప్రజలు ఆర్మీ అణచివేతతో అల్లాడుతుంటే, ఇక్కడ పీఎస్ఎల్ పేరిట వేడుకలు జరపడం వారి గాయాలపై కారం చల్లడమే” అని పేర్కొన్నారు. ముఖ్యంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, గ్లెన్ మాక్స్‌వెల్ వంటి విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. “తమ సొంత భద్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే టోర్నీ నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో జరిగే పరిణామాలకు మేము బాధ్యులం కాము” అని హెచ్చరించారు. ఈ మేరకు క్రికెట్ బోర్డులకు కూడా సమాచారం పంపినట్లు తెలుస్తోంది.

ఒకవైపు ఉగ్రవాద ముప్పు, మరోవైపు దేశంలో తీవ్రమైన ఇంధన సంక్షోభం పాక్ క్రికెట్ బోర్డును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆదివారం మాట్లాడుతూ.. ఈసారి పీఎస్ఎల్ మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదని సంచలన ప్రకటన చేశారు. పశ్చిమ ఆసియాలో (ఇరాన్-ఇజ్రాయెల్-అమెరికా) ఉద్రిక్తతల వల్ల చమురు సరఫరా ఆగిపోవడం, పాకిస్థాన్‌లో పెట్రోల్ కొరత ఏర్పడటంతో ప్రజలు కదలికలను తగ్గించుకోవాలని ప్రభుత్వం కోరింది. అందుకే స్టేడియాలకు 30 వేల మంది రావడం వల్ల వనరులు వృథా అవుతాయని భావించి క్లోజ్డ్ డోర్స్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

తొలుత ఆరు నగరాల్లో పీఎస్ఎల్ నిర్వహించాలని భావించినప్పటికీ, ప్రస్తుత భద్రతా పరిస్థితుల దృష్ట్యా కేవలం కరాచీ, లాహోర్‌లలోని రెడ్ జోన్ ప్రాంతాలకే మ్యాచ్‌లను పరిమితం చేశారు. లాహోర్‌లో ఘనంగా జరగాల్సిన ఓపెనింగ్ సెర్మనీని కూడా రద్దు చేశారు. ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల నుంచి నిరంతరం దాడులు జరుగుతుండటం, ఇంధన కొరతతో రవాణా ఇబ్బందులు కలగడం పీసీబీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి దేశాల ఆటగాళ్లు ఇప్పటికే పాక్ చేరుకున్న తరుణంలో, టీటీపీ హెచ్చరికల నేపథ్యంలో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ ప్లేయర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

పాకిస్థాన్‌లో ఇలాంటి అస్థిర పరిస్థితులు ఉండటంతో, ఇప్పటికే కొందరు విదేశీ ఆటగాళ్లు పీఎస్ఎల్ ఒప్పందాలను రద్దు చేసుకుని మార్చి 28 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ (IPL)లో రిప్లేస్‌మెంట్ ప్లేయర్లుగా చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ విదేశీ ప్లేయర్లు భారీగా నిష్క్రమిస్తే పీఎస్ఎల్ 11 సీజన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us