IPL 2025: స్వామీ నీదే దయా.. తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకున్న ప్రీతీ!
పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా హనుమాన్ జయంతిని పురస్కరించుకుని తాడ్‌బండ్ వీరాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన జట్టు విజయాన్ని కోరుతూ ప్రార్థనలు చేసిన ఆమె భక్తులతో కలిసి సాదాసీదాగా కనిపించారు. పంజాబ్ జట్టు మంచి ఫామ్‌లో ఉండగా, వరుస ఓటములతో SRH తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఈ మ్యాచ్ రెండుజట్ల భవితవ్యాన్ని నిర్ణయించబోతుంది.

పంజాబ్ కింగ్స్ యజమాని, బాలీవుడ్ ప్రముఖ నటి ప్రీతి జింటా శనివారం సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ వీరాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ప్రీతి జింటా అక్కడి భక్తులతో కలిసి ప్రార్థనలు చేస్తూ, ప్రత్యేకంగా అక్షింతలు తీసుకుని వెళ్లారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. అయితే భక్తులు ఆమెను చూసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్బంగా ప్రీతి తన ముఖాన్ని మాస్క్‌తో కప్పుకొని, నెత్తిపై చున్నీ వేసుకుని సాదాసీదాగా కనిపించడానికి ప్రయత్నించారు. ఈ విషయాన్ని బోయినపల్లి ఇన్‌స్పెక్టర్ బి.లక్ష్మినారాయణ రెడ్డి ధృవీకరించారు.
ఈ రోజు ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనున్న నేపథ్యంలో, తన జట్టు విజయం సాధించాలని కోరుతూ ప్రీతి జింటా ఈ పూజలు నిర్వహించారు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ జట్టు మంచి ఫామ్‌లో ఉంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణిస్తూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ప్రియాన్ష్ ఆర్య, శశాంక్ సింగ్, ప్రభ్ సిమ్రాన్ సింగ్, నేహాల్ వధేరా వంటి యువ ఆటగాళ్లు బ్యాటింగ్‌లో ఆకట్టుకుంటుండగా, అర్ష్ దీప్ సింగ్, ఫెర్గూసన్, యుజ్వేంద్ర చాహల్, మార్కో యాన్సెన్ వంటి బౌలర్లు బౌలింగ్ విభాగాన్ని బలపరిచారు. ఈ నేపథ్యంలో పంజాబ్ జట్టు ఐదో విజయంపై కన్నేశింది.
ఇంకోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్‌లో తీవ్ర ఒత్తిడిలో ఉంది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఎస్ఆర్‌హెచ్ జట్టు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. 5 మ్యాచ్‌లలో కేవలం ఒక విజయం మాత్రమే సాధించి మిగతా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. వరుస ఓటములతో నెమ్మదిగా పాయింట్ల పట్టిక చివరి స్థానానికి జారిపోయింది. ఈ మ్యాచ్ ద్వారా ఎస్‌ఆర్‌హెచ్ గెలుపు బాట పట్టాలని ఆశిస్తోంది. మొత్తం మీద ఈ పోరు రెండు జట్లకూ కీలకంగా మారింది. ఒకవైపు పంజాబ్ జట్టు టాప్ ఫోర్‌లో నిలవాలనే లక్ష్యంతో నిలిచి ఉండగా, మరోవైపు ఎస్‌ఆర్‌హెచ్ తమ పునరాగమనాన్ని ప్రారంభించాలనే పట్టుదలతో ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..