Team India : టీమిండియాలో కీలక మార్పు.. మహ్మద్ సిరాజ్ అవుట్.. ప్రసిద్ధ్ కృష్ణ ఇన్
Team India : ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. మహ్మద్ సిరాజ్‌కు విశ్రాంతి ఇవ్వగా ప్రసిద్ధ్ కృష్ణను ఎంపిక చేశారు. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా జట్టును ముందుకు నడిపించనున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది.

Team India : భారత క్రికెట్ జట్టు త్వరలోనే ఐర్లాండ్, ఇంగ్లాండ్ దేశాలలో సుదీర్ఘ పర్యటనలు చేయడానికి సిద్ధమైంది. ఈ పర్యటనలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ కూడా విడుదలైంది. జూన్ 26న ఐర్లాండ్‌తో భారత్ తన మొదటి టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 28న రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఐర్లాండ్ పర్యటన ముగిసిన వెంటనే జూలై 1 నుంచి ఇంగ్లాండ్‌తో అసలైన సిరీస్ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్‌ల భారీ టీ20 సిరీస్‌లో తలపడనుంది.
ఈ విదేశీ పర్యటనల కోసం బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. టీమిండియా లీడింగ్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు ఈ సిరీస్‌ల నుంచి విశ్రాంతి ఇచ్చారు. నిరంతరాయంగా క్రికెట్ ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా చూసేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సిరాజ్ స్థానంలో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను 15 మంది సభ్యుల భారత జట్టులోకి ఎంపిక చేశారు. బోర్డు వైద్య బృందం, టీమ్ మేనేజ్‌మెంట్‌తో సుదీర్ఘంగా చర్చించిన తర్వాతే సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వాలని సెలెక్టర్లు నిర్ణయించారు.
ఇదిలా ఉంటే ఈ జట్టు ఎంపికపై కొందరు మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున అదరగొట్టిన ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా సెలెక్షన్ విషయంలో బోర్డు అనుసరించిన తీరుపై టీమిండియా మాజీ ఓపెనర్ ఒకరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. “మిగిలిన ఆటగాళ్లకు ఒక రూల్.. హర్షిత్ రాణాకు మరొక రూల్ పెట్టడం ఎంతవరకు న్యాయం?” అంటూ ఆయన ప్రశ్నించారు. ఆటగాళ్ల ఎంపికలో పారదర్శకత ఉండాలని, అందరికీ ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేయాలని ఆయన సెలెక్టర్లకు హితవు పలికారు.
ఈ పర్యటనల కోసం బీసీసీఐ ఎక్కువగా యువ ఆటగాళ్లతో కూడిన జట్టును రంగంలోకి దించుతోంది. ఈ లైనప్‌కు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్ బాధ్యతలను అప్పగించారు. జట్టులో సంజు శాంసన్, ఇషాన్ కిషన్ రూపంలో ఇద్దరు నాణ్యమైన వికెట్ కీపర్లు ఉన్నారు. అలాగే అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లతో పాటు అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ కూడా జట్టు బలాన్ని పెంచుతున్నారు.
భారత పూర్తి జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ, ప్రసిద్ధ్ కృష్ణ.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
