Vaibhav Sooryavanshi : ఆ దేశంలో ఐపీఎల్ బ్యాన్.. అయినా వైభవ్ సూర్యవంశీపై కురుస్తున్న ప్రశంసల వర్షం
Vaibhav Sooryavanshi : పాకిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026 లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన 15 ఏళ్ల భారత సంచలనం వైభవ్ సూర్యవంశీపై పాక్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ ప్రశంసలు కురిపించాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించాడు.

Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో అత్యంత చిన్న వయసులోనే సంచలన బ్యాటింగ్‌తో ప్రపంచాన్ని ఆకర్షించిన వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ పేరు ఇప్పుడు సరిహద్దులు దాటి మరీ మారుమోగిపోతోంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున బరిలోకి దిగిన ఈ యువ ఓపెనర్, తన అద్భుతమైన ఆటతీరుతో అందరినీ మంత్రముగ్ధులను చేశాడు. విచిత్రం ఏంటంటే.. పాకిస్తాన్‌లో ఐపీఎల్ ప్రసారాలపై నిషేధం ఉన్నప్పటికీ, అక్కడ కూడా వైభవ్ బ్యాటింగ్‌పై విపరీతమైన చర్చ సాగుతోంది. పాక్ మాజీ క్రికెటర్లు సైతం ఈ భారత బుడ్డోడిని ఆకాశానికెత్తేస్తున్నారు.
ఐపీఎల్ 2026 లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. ఆడిన 16 మ్యాచ్‌ల్లోని 16 ఇన్నింగ్స్‌లలో ఏకంగా 776 పరుగులు సాధించి, ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఆరెంజ్ క్యాప్ అవార్డును కైవసం చేసుకున్నాడు. 15 ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ దిగ్గజ బౌలర్లను చిత్తు చేస్తూ అతను ఆడిన ఇన్నింగ్స్‌ల గురించే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం ఆటలపై కూడా పడింది. గత ఏడాది భారతదేశంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలను బ్యాన్ చేయడంతో, దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ ప్రభుత్వం కూడా తమ దేశంలో ఐపీఎల్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలను పూర్తిగా నిషేధించింది. అక్కడ టీవీల్లో మ్యాచ్‌లు రాకపోయినప్పటికీ, సోషల్ మీడియా, డిజిటల్ మాధ్యమాల ద్వారా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ వీడియోలు చూసి పాక్ క్రికెట్ అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
వైభవ్ సూర్యవంశీ పాపులారిటీపై పాకిస్తాన్ మాజీ బ్యాటర్ బాసిత్ అలీ ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. “నాకు ఎప్పుడూ క్రికెట్ మాత్రమే ముఖ్యం. నా యూట్యూబ్ ఛానల్‌లో నేను క్రికెట్ విశ్లేషణలు చేసేటప్పుడు ఆటగాడు ఏ దేశస్థుడో అస్సలు చూడను. అతను ఇండియా, బంగ్లాదేశ్, సౌతాఫ్రికా లేదా వెస్టిండీస్.. ఇలా ఏ దేశానికి చెందినవాడైనా సరే, మైదానంలో మంచి ప్రదర్శన ఇస్తే కచ్చితంగా మెచ్చుకుంటాను మరియు నా నిజాయితీ గల అభిప్రాయాన్ని చెప్తాను” అని బాసిత్ అలీ పేర్కొన్నాడు.
గతంలో జరిగిన ఒక సంఘటనను బాసిత్ అలీ ఈ సందర్భంగా గుర్తుచేశాడు. “గతంలో అండర్-19 ఆసియా కప్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో వైభవ్ సూర్యవంశీ పాకిస్తాన్ బౌలర్‌తో మైదానంలో దురుసుగా ప్రవర్తించాడు. ఆ సమయంలో నేను నా ఛానల్‌లో అతడిని తీవ్రంగా విమర్శించాను. ఇలాంటి పిచ్చి వేషాలు మానేసి క్రికెట్‌పై దృష్టి పెట్టాలని హితవు పలికాను. ఇప్పుడు అతను నా మాటను విన్నట్లుగా కేవలం ఆటపైనే దృష్టి పెట్టి ఐపీఎల్‌లో అద్భుతాలు చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది” అని బాసిత్ అలీ ప్రశంసించాడు.
రాజకీయాలను, ఆటను ఎప్పుడూ ముడిపెట్టకూడదని బాసిత్ అలీ అన్నాడు. “క్రీడలకు ఎలాంటి సరిహద్దులు ఉండవు, అందులో రాజకీయాలకు చోటు లేదు. ఆట ఎప్పుడూ ఆటే. నా ఛానల్ ఫాలో అయ్యేవాళ్లు నా నుంచి నిష్పక్షపాతమైన రివ్యూలు కోరుకుంటారు, నేను ఎప్పుడూ పర్ఫార్మెన్స్ ఆధారంగానే రివ్యూ ఇస్తాను” అని ముగించాడు. బోర్డర్ అవతల మ్యాచ్‌లు ప్రసారం కాకపోయినా ఈ రేంజ్‌లో ప్రశంసలు వస్తున్నాయంటే వైభవ్ సృష్టించిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
