AbhiShek Sharma : 6 బంతులు, 22 పరుగులు.. ఒకే ఓవర్‌లో మ్యాచ్ తిప్పేసిన అభిషేక్ శర్మ
AbhiShek Sharma : భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ కేవలం ఒకే ఒక్క ఓవర్‌తో మలుపు తిరిగింది. గెలుపుపై ఆశలు పెట్టుకున్న కివీస్ ఆశలను ఆ ఆరు బంతులు ఆవిరి చేసేశాయి. వన్డే సిరీస్ కోల్పోయిన కసిలో ఉన్న టీమిండియా, టీ20ల్లో మాత్రం ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తోంది. గౌహతిలో జరిగిన ఈ పోరులో భారత్ అద్భుత విజయం సాధించడమే కాకుండా, మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే సిరీస్‌ను జేబులో వేసుకుంది. అసలు ఆ ఒకే ఒక్క ఓవర్‌లో ఏం జరిగింది? మ్యాచ్ ఎలా మలుపు తిరిగింది? అన్నది వివరంగా తెలుసుకుందాం.

AbhiShek Sharma : గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేసిన భారత బౌలర్లు మొదటి నుంచే కివీస్ బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన మొదటి బంతికే వికెట్ తీసి అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా కూడా వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చివర్లో కాస్త పోరాడటంతో ఆ జట్టు 153 పరుగులు చేయగలిగింది. భారత్ లాంటి పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ముందు ఇది చిన్న స్కోరే అని అందరూ భావించారు.
అయితే 154 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు మొదటి ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ డకౌట్‌గా వెనుతిరగడంతో స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఆ తర్వాత ఇషాన్ కిషన్ (28) కొన్ని మెరుపు షాట్లు ఆడినా, అతను కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దీంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారుతుందని, న్యూజిలాండ్ పుంజుకుంటుందని అంతా అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే మ్యాచ్‌ను మలుపు తిప్పే ఆ ఓవర్ వచ్చింది. అది ఇన్నింగ్స్ 6వ ఓవర్.. అంటే పవర్‌ప్లేలో చివరి ఓవర్.
జేకబ్ డఫీ వేసిన ఆ ఓవర్‌లో అభిషేక్ శర్మ విశ్వరూపం చూపించాడు. తొలి బంతి నుంచే వేటాడటం మొదలుపెట్టిన అభిషేక్.. ఆ ఓవర్‌లో రెండు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో ఏకంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఆ ఒక్క ఓవర్‌తో భారత్ స్కోరు 72 నుంచి ఒక్కసారిగా 94కి చేరింది. పవర్‌ప్లే ముగిసే సమయానికే భారత్ విజయానికి చేరువ కావడంతో కివీస్ బౌలర్ల ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్నది. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కలిసి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం 10 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించేశారు.
ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. అంటే సిరీస్ ఫలితం అప్పుడే తేలిపోయింది. వచ్చే రెండు మ్యాచ్‌లలో న్యూజిలాండ్ గెలిచినా ట్రోఫీ మాత్రం టీమిండియాదే. వన్డే సిరీస్ ఓటమికి టీ20ల్లో భారత్ పక్కాగా రివేంజ్ తీర్చుకుంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఆడిన ఆ 14 బంతుల హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఈ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. యువ ఆటగాళ్లు ఇంతలా రెచ్చిపోతుంటే రాబోయే 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్ అజేయంగా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
