On This Day: 13 ఫోర్లు, 12 సిక్సర్లతో ఊచకోత.. వరల్డ్ రికార్డుతో భార్యకు రోహిత్ శర్మ మర్చిపోలేని గిఫ్ట్
Rohit Sharma: ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు చేయడం అంత ఈజీ కాదు. దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన..
ఒకప్పుడు వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు చేయడం అంత ఈజీ కాదు. దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ 2010లో తొలిసారిగా దక్షిణాఫ్రికాపై 200 పరుగులు చేశాడు. ఆ తర్వాత టీమిండియా ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో మూడుసార్లు డబుల్ సెంచరీ సాధించాడు. ఆస్ట్రేలియాపై ఒక్కసారి, శ్రీలంకపై రెండుసార్లు డబుల్ సెంచరీ బాదేశాడు హిట్‌మ్యాన్. 2017, డిసెంబర్ 13న అంటే ఈరోజు మొహాలీ వేదికగా రోహిత్ వన్డేల్లో మూడో డబుల్ సెంచరీ కొట్టాడు. తద్వారా వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా రోహిత్ శర్మ వరల్డ్ రికార్డు సాధించాడు.
ఈ వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ.. తొలి మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవి చూడాల్సి వచ్చింది. 2017, డిసెంబర్ 10న శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు కేవలం 112 పరుగులకు ఆలౌట్ అయింది. ధోని తప్ప మరెవ్వరూ కూడా రాణించలేదు. ఇందులో లంకేయులు సునాయాసంగా విజయం సాధించారు. అయితే టీమిండియా మాత్రం ఈ ఓటమిని పక్కనపెట్టి.. రెండో వన్డే కోసం మొహాలీకి చేరుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్లకు 394 పరుగుల భారీ స్కోరు సాధించడమే కాదు.. రోహిత్ శర్మ ఏకంగా డబుల్ సెంచరీ బాదేశాడు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఆ రోజు రోహిత్ శర్మ మ్యారేజ్ అనివర్సరీ.. ఈ సందర్భంగా భార్య రితికకు డబుల్ సెంచరీతో పాటు అద్భుత విజయాన్ని కూడా గిఫ్ట్‌గా అందించాడు హిట్‌మ్యాన్. రోహిత్, రితిక 13 డిసెంబర్ 2015న వివాహం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సెంచరీ పూర్తి చేసిన తర్వాత రోహిత్ తన పెళ్లి ఉంగరాన్ని ముద్దాడటం తెలిసిందే.
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ టాస్ ఓడిపోయాడు. అయితేనేం శ్రీలంక కెప్టెన్ తిసార పెరీరా భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ క్రమంలోనే రోహిత్ శ్రీలంక బౌలర్లను దారుణంగా చిత్తు చేశాడు. అతడు మొదట తన ఓపెనింగ్ పార్టనర్ శిఖర్ ధావన్(68)తో కలిసి 115 పరుగుల భాగస్వామ్యాన్ని.. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్(88)తో కలిసి మరో డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ 46వ ఓవర్ మూడో బంతికి అయ్యర్ ఔట్ కాగా.. అనంతరం వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ ఐదు బంతుల్లో ఏడు పరుగులు మాత్రమే చేయగలిగాడు. 50వ ఓవర్ చివరి బంతికి హార్దిక్ పాండ్యా ఎనిమిది పరుగుల వద్ద ఔట్ కాగా, రోహిత్ శర్మ మాత్రం అజేయంగా చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. 153 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 13 ఫోర్లు, 12 సిక్సర్లతో అజేయంగా 208 పరుగులు చేశాడు.
శ్రీలంకకు ఘోర పరాజయం..
టీమిండియా నిర్దేశించిన 393 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు నిర్ణీత ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 251 పరుగులు చేసింది. లంక సీనియర్ బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ అజేయంగా 111 పరుగులు చేశాడు. 132 బంతులు ఎదుర్కొన్న అతడు తొమ్మిది ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. జట్టులో అతడొక్కడే టాప్ స్కోరర్. భారత్ తరఫున యుజ్వేంద్ర చాహల్ మూడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, భువనేశ్వర్ కుమార్, పాండ్యా, వాషింగ్టన్ సుందర్ ఒక్కో వికెట్ తీశారు.