IPL 2025: నో చీర్ లీడర్స్.. నో డీజే.. ఓన్లీ క్రికెట్! అప్పుడే వారి త్యాగానికి నిజమైన నివాళి అన్న లెజెండ్
ఇండియా-పాకిస్తాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో IPL 2025ను నిరాడంబరంగా నిర్వహించాలని సునీల్ గావస్కర్ BCCIకి సూచించారు. మిగిలిన 17 మ్యాచ్‌లలో మ్యూజిక్, DJలు, చీర్లీడర్లు లేకుండా కేవలం ఆటకే ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. మే 9న నిలిపివేసిన IPLకు బీసీసీఐ మే 17నుంచి మళ్లీ ప్రారంభించేందుకు కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. 6 వేదికలపై జరగనున్న ఈ మ్యాచ్‌లు జూన్ 3న ఫైనల్‌తో ముగియనున్నాయి.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో, IPL 2025 మళ్లీ ప్రారంభమవుతున్న సమయంలో భారత క్రికెట్ లెజెండ్ సునీల్ గావస్కర్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి కొన్ని కీలక సూచనలు చేశారు. మే 17 నుంచి IPL 2025 మళ్లీ ప్రారంభంకానున్న తరుణంలో, గావస్కర్ మాట్లాడుతూ దేశంలోని ప్రజల మనోభావాలను బోధించేలా, ఈ సీజన్ మిగిలిన మ్యాచ్‌లు నిరాడంబరంగా జరగాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
“కేవలం క్రికెట్ ఉండాలి” – గావస్కర్
గావస్కర్ ఆశిస్తున్నారు – క్రికెట్‌ను ప్రేమించే అభిమానులు మైదానాలకు భారీగా హాజరై, ఆటను ఆస్వాదించాలని. అయితే, పహల్గామ్ ఘటనలో ఆ తర్వాత జరిగిన ఇండియా – పాకిస్తాన్ సరిహద్దు ఘర్షణల వల్ల అనేక కుటుంబాలు తమ ప్రియమైనవారిని కోల్పోయాయి. అటువంటి బాధాకర పరిస్థితుల్లో క్రికెట్‌ను ఓ గౌరవార్పణ కార్యక్రమంగా జరపాలని గావస్కర్ అభిప్రాయపడ్డారు. “ఇలాంటి సమయంలో సాధారణంగా జరిగే ఆర్భాటాలన్నీ తగ్గించాలి. బాధిత కుటుంబాలకు గౌరవం తెలిపేలా ఆట జరగాలి. క్రికెట్‌ను మనం ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఒక హద్దు లోపల ఉండాలి,” అని ఆయన Sports Todayకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
DJలు, మ్యూజిక్, చీర్లీడర్లు వద్దు – గావస్కర్
గావస్కర్ సూచించారు – మిగిలిన 17 IPL మ్యాచ్‌లలో మ్యూజిక్, DJల అరుపులు, చీర్లీడర్ల డ్యాన్స్ వంటి వినోదం అవసరం లేదని. మధ్య ఓవర్లలో DJల అరుపులు కాకుండా, ఆటపై మాత్రమే దృష్టి పెట్టాలని అన్నారు. “ప్రేక్షకులు మైదానాలకు రావాలి, కానీ మ్యూజిక్ అవసరం లేదు. DJలు ఓవర్ మధ్యలో అరవకూడదు. చీర్లీడర్లు ఉండకూడదు. కేవలం ఆట ఉండాలి – అదే బాధితులకు నిజమైన గౌరవం,” అని గావస్కర్ స్పష్టం చేశారు. ఈ IPL మ్యాచ్‌లు “కేవలం ఆట కోసం” అనే సందేశాన్ని అందిస్తూ, దేశం గుండెల్లో మిగిలిపోయిన బాధను గౌరవించాలి అనే అభిప్రాయంతో ఆయన BCCIకి విజ్ఞప్తి చేశారు.
భారతదేశం – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత కారణంగా మే 9న BCCI ఐపీఎల్‌ను ఒక వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే.. అంతకుముందు మే 8న పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ మధ్యలో ఆగిపోయింది. అయితే, ఇప్పుడు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ తర్వాత, మిగిలిన మ్యాచ్‌లకు బీసీసీఐ కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. TATA IPL 2025 మిగిలిన మ్యాచ్‌లు మే 17 నుండి ప్రారంభమై జూన్ 3న జరిగే ఫైనల్‌తో ముగిస్తాయి.. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగుతాయి. సవరించిన షెడ్యూల్‌లో రెండు డబుల్-హెడర్‌లు ఉన్నాయి.. ఇవి రెండు ఆదివారాల్లో జరుగుతాయని.. BCCI ప్రకటించింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



