Next T20I Captain: భారత టీ20 కెప్టెన్‌గా ఐపీఎల్ సెన్సేషన్ ? గంభీర్ మనసులో మాట ఇదేనట!
Next T20I Captain: టీమిండియా తదుపరి టీ20 కెప్టెన్‌గా సంజూ శాంసన్‌ను నియమించాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావిస్తున్నారు. అయితే సెలెక్టర్లు మాత్రం శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. వారు కెప్టెన్సీ మెటీరియల్ కాదని సెలెక్టర్లు భావిస్తున్నారు.

Next T20I Captain: భారత టీ20 క్రికెట్ జట్టులో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఇందుకు సంబంధించిన కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త సారథిని ఎంపిక చేసేందుకు బీసీసీఐ కసరత్తు చేస్తోంది. అయితే, కొత్త కెప్టెన్ ఎవరనే విషయంలో కోచ్ గంభీర్ ఆలోచనలకు, బీసీసీఐ సెలెక్టర్ల అభిప్రాయాలకు అస్సలు కుదరడం లేదని సమాచారం. గంభీర్ ఈ బాధ్యతలను కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అప్పగించాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు పీటీఐ నివేదిక వెల్లడించింది.
గౌతమ్ గంభీర్ ప్రతిపాదనను బీసీసీఐ సెలెక్టర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌లను కెప్టెన్లుగా నియమించడం సెలెక్టర్లకు అస్సలు ఇష్టం లేదు. వీరిద్దరూ అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ కాలం స్థిరమైన ప్రదర్శన చేయలేరని, కాబట్టి సుదీర్ఘ కాలం పాటు జట్టును నడిపించే కెప్టెన్సీ మెటీరియల్ కాదని సెలెక్టర్లు భావిస్తున్నారు. దీంతో రేసులో కేవలం శ్రేయస్ అయ్యర్, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మాత్రమే మిగిలారు. ఈ ఇద్దరిలోనే ఒకరిని భవిష్యత్తు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్‌తో గంభీర్‌కు విభేదాలు?
ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఛాంపియన్‌గా నిలిచినప్పుడు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా, గౌతమ్ గంభీర్ టీమ్ మెంటార్‌గా ఉన్నారు. అయితే, శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌గా చేయడానికి గంభీర్ కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కేకేఆర్ విజయానికి గల క్రెడిట్ మొత్తం గంభీర్ ఖాతాలోకి వెళ్లడంతో శ్రేయస్ అయ్యర్ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ కారణంగానే వీరిద్దరి మధ్య అప్పట్లో కొన్ని విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి. బహుశా ఇదే కారణంతో గంభీర్ ఇప్పుడు శ్రేయస్‌కు కెప్టెన్సీ ఇవ్వడానికి వెనకాడుతున్నట్లు ఇన్సైడ్ టాక్.
సూర్యకుమార్ యాదవ్‌పై ఎందుకు వేటు?
రోహిత్ శర్మ రిటైర్మెంట్ తర్వాత కెప్టెన్సీ అందుకున్న 35 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా అద్భుతమైన రికార్డులను సృష్టించింది. 2025 ఆసియా కప్, 2026 టీ20 వరల్డ్ కప్ విజయాలు సూర్య కెప్టెన్సీలోనే వచ్చాయి. ఆయన సారథ్యంలో భారత్ ఆడిన 52 మ్యాచ్‌ల్లో ఏకంగా 42 విజయాలు అందుకొని 84 శాతం సక్సెస్ రేట్‌తో రికార్డు సృష్టించింది. కానీ, కెప్టెన్సీ భారం పడ్డాక సూర్య బ్యాటింగ్ ఫామ్ ఘోరంగా పడిపోయింది. జూలై 2024 నుంచి ఆడిన 45 మ్యాచ్‌ల్లో కేవలం 25.88 సగటుతో 932 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ 2026 ఎడిషన్‌లో కూడా ముంబై ఇండియన్స్ తరఫున 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 270 పరుగులే చేయడంతో ఆయనను కెప్టెన్సీ నుంచి తప్పించాలని బీసీసీఐ భావిస్తోంది.
రేపే తుది నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ
టీమిండియా రాబోయే రోజుల్లో ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌లు (జూన్ 26, 28), ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌లు (జూలై 1 నుంచి జూలై 11 వరకు) మొత్తం ఏడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌ల కంటే ముందే కొత్త కెప్టెన్‌ను ప్రకటించనున్నారు. దీనిపై చర్చించేందుకు రేపు బీసీసీఐ గవర్నింగ్ కమిటీ అత్యవసర సమావేశం కానుంది. ఈ మీటింగ్‌లో గంభీర్ కోరుకుంటున్న సంజూ శాంసన్‌కు పగ్గాలు అందుతాయా? లేక సెలెక్టర్ల ఛాయిస్ అయిన శ్రేయస్ అయ్యర్, తిలక్ వర్మలలో ఒకరికి లక్ చిక్కుతుందా అనేది తేలిపోనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
