Zakary Foulkes: ఎవడ్రా నువ్వు.. తొలి మ్యాచ్ ఆడుతూ చరిత్ర సృష్టించావ్..!
న్యూజిలాండ్ జింబాబ్వేపై బులవాయోలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 359 పరుగుల తేడాతో గెలుచుకుని, 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. జాకరీ ఫాక్స్ అద్భుత బౌలింగ్‌తో 9 వికెట్లు పడగొట్టి న్యూజిలాండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర సెంచరీలు సాధించారు.

బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆతిథ్య జింబాబ్వే, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి మ్యాచ్‌ను కివీస్ కేవలం మూడు రోజుల్లోనే గెలుచుకుంది. దీనితో సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. న్యూజిలాండ్ తరపున టెస్ట్ అరంగేట్రం చేసిన యువ పేసర్ జాకరీ ఫాక్స్, జింబాబ్వేను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 117 పరుగులకే ఆలౌట్ చేశాడు. దీనితో కివీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌ను ఇన్నింగ్స్, 359 పరుగుల భారీ తేడాతో గెలుచుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇన్నింగ్స్, పరుగుల తేడా పరంగా ఇది మూడవ అతిపెద్ద విజయం.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే తమ బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 601 పరుగులకు తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కివీస్ తరపున డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్, రచిన్ రవీంద్ర సెంచరీలు సాధించారు. ఈ ముగ్గురు వరుసగా 153, 150, 165 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది.
ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. నిక్ వెల్చ్ జట్టు తరఫున 47 పరుగులతో టాప్ స్కోరర్ ఇన్నింగ్స్ ఆడగా, కెప్టెన్ క్రెయిగ్ ఇర్విన్ 17 పరుగులతో రాణించాడు. మిగతా ఆటగాళ్లందరూ సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్ చేరారు. మరోవైపు కివీస్ ఘోరమైన దాడికి నాయకత్వం వహించిన జాకరీ ఫాక్స్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో అతను కేవలం 75 పరుగులకు మొత్తం 9 వికెట్లు పడగొట్టి, న్యూజిలాండ్ తరఫున అత్యుత్తమ అరంగేట్ర బౌలర్ గా నిలిచాడు. దీనికి ముందు విల్ ఓ’రూర్కే తన తొలి టెస్ట్ మ్యాచ్ లో 9 వికెట్లు పడగొట్టాడు, కానీ అతను 93 పరుగులు ఇచ్చాడు. వీరితో పాటు మాట్ హెన్రీ, జాకబ్ డఫీ కూడా చెరో 2 వికెట్లు పడగొట్టాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కివీస్ కు ఇది అతిపెద్ద విజయం కాగా, జింబాబ్వేకు ఇది అతిపెద్ద ఓటమి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




