BPL 2026 : ఎవడు మమ్మీ వీడు..7 రన్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు..61 పరుగులకే టీమ్ మొత్తం ఖాళీ
BPL 2026 : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఒక్కడు బంతితో మాయాజాలం చేశాడు. సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 13వ మ్యాచ్‌లో నసుమ్ అహ్మద్ అనే స్పిన్నర్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల పని పట్టాడు.

BPL 2026 : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఒకే ఒక్కడు బంతితో మాయాజాలం చేశాడు. సిల్హెట్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన 13వ మ్యాచ్‌లో నసుమ్ అహ్మద్ అనే స్పిన్నర్ నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల పనిపట్టాడు. కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి సగం టీమ్‌ను పెవిలియన్‌కు పంపి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఈ దెబ్బకు నోఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టు కుప్పకూలిపోయింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నోఖాలీ ఎక్స్‌ప్రెస్ జట్టుకు నసుమ్ అహ్మద్ రూపంలో పెద్ద గండం ఎదురైంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై నసుమ్ బంతిని గిరగిర తిప్పుతూ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మొదట స్టార్ ప్లేయర్ సౌమ్య సర్కార్‌ను అవుట్ చేసి వేట మొదలుపెట్టిన నసుమ్, ఆ తర్వాత కెప్టెన్ హైదర్ అలీని కూడా తక్కువ పరుగులకే సాగనంపాడు. ఇక చివరి ఓవర్లో నసుమ్ అసలు నరకం చూపించాడు. ఒకే ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో ముగ్గురు బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేసి నోఖాలీ పతనాన్ని శాసించాడు.
ఒక దశలో 5 వికెట్ల నష్టానికి 55 పరుగులు చేసిన నోఖాలీ ఎక్స్‌ప్రెస్, గౌరవప్రదమైన స్కోరు సాధిస్తుందని అందరూ భావించారు. కానీ నసుమ్ ఎంట్రీతో సీన్ మొత్తం మారిపోయింది. కేవలం 7 పరుగులు జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయి 61 పరుగులకే ఆ జట్టు కుప్పకూలిపోయింది. నసుమ్ అహ్మద్ తన 4 ఓవర్ల కోటాలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్ లోనే బెస్ట్ స్పెల్ నమోదు చేశాడు. మెహదీ హసన్ రాణా, జహీర్ ఖాన్, బిలాల్ సమీ వంటి వారు నసుమ్ దాటికి క్రీజులో నిలవలేకపోయారు.
Player of the match: Nasum Ahmed (Sylhet Titans), 5 Wickets
Sylhet Titans won by 6 wickets | Noakhali Express 🆚 Sylhet Titans | Match 13 | BASHUNDHARA CEMENT BPL 2026
Post-match presentation guests:
Fokrul Islam, Franchise Owners, Sylhet Titans.
A.S.M Roquibul Hassan,… pic.twitter.com/LUDdwqUhmx
— Bangladesh Cricket (@BCBtigers) January 5, 2026
62 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సిల్హెట్ టైటాన్స్ 8.4 ఓవర్లలోనే పని పూర్తి చేసింది. ఓపెనర్ తౌఫిక్ ఖాన్ 18 బంతుల్లో 32 పరుగులతో మెరుపులు మెరిపించగా, జాకీర్ హసన్ 24 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మధ్యలో జహీర్ ఖాన్ మూడు వికెట్లు తీసి సిల్హెట్ ను భయపెట్టే ప్రయత్నం చేసినా స్కోరు తక్కువగా ఉండటంతో అది సాధ్యపడలేదు. చివరకు 6 వికెట్ల తేడాతో సిల్హెట్ ఘన విజయం సాధించింది. అద్భుత ప్రదర్శన చేసిన నసుమ్ అహ్మద్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
