Rohit Sharma: క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ చేసిన హిట్ మ్యాన్.. ప్రపంచంలో నంబర్ 1 బ్యాటర్‌గా రోహిత్
Rohit Sharma: వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించారు. 28 ఇన్నింగ్స్‌లలో 54 సిక్సర్లతో క్రిస్ గేల్‌ను అధిగమించారు. గేల్ 49 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ 31 సిక్సర్లు బాదడం మరో అరుదైన రికార్డుగా నిలిచింది. భారత బ్యాటర్లలో సచిన్, గంగూలీ, శ్రేయస్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Rohit Sharma: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ జట్లన్నీ రాబోయే 2027 వన్డే వరల్డ్ కప్ సన్నాహాలలో నిమగ్నమయ్యాయి. భారత మేనేజ్‌మెంట్ కూడా పటిష్టమైన జట్టును సిద్ధం చేసే పనిలో ఉంది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ ఆటగాళ్ళు జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నారు. అయితే క్రికెట్ ప్రపంచంలో ప్రతి వరల్డ్ కప్ టోర్నమెంట్‌లోనూ కొత్త రికార్డులు పుట్టుకొస్తుంటాయి, కొన్ని పాత రికార్డులు కనుమరుగవుతుంటాయి. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎన్నో రికార్డుల రారాజుగా నిలిచినప్పటికీ, కొన్ని ప్రత్యేక రికార్డులతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటి అగ్రగామి రికార్డులలో ‘వరల్డ్ కప్‌లో అత్యధిక సిక్సర్లు’ బాదిన ఘనత ఒకటి. ఈ రికార్డు సాధించిన ఆటగాళ్ల వివరాలు చూద్దాం.
అగ్రస్థానంలో రోహిత్ శర్మ
వన్డే ప్రపంచ కప్ ఐదు దశాబ్దాల చరిత్రలో మరే ఇతర బ్యాటర్ సాధించని అరుదైన మైలురాయిని మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అందుకున్నారు. ఇప్పటివరకు 28 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసిన రోహిత్ ఏకంగా 54 సిక్సర్లు బాదారు. ప్రపంచ కప్ చరిత్రలో 50కి పైగా సిక్సర్లు కొట్టిన ఏకైక బ్యాటర్‌గా ఆయన ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఒకే ఒక్క వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా ఆయన పేరిటే ఉంది. 2023 ప్రపంచ కప్‌లో రోహిత్ ఒక్కడే 31 సిక్సర్లు సాధించి చరిత్ర సృష్టించారు.
రెండో స్థానంలో క్రిస్ గేల్
ఈ సిక్సర్ల జాబితాలో వెస్టిండీస్ మాజీ డాషింగ్ ఓపెనర్ క్రిస్ గేల్ రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ కప్ చరిత్రలో ఆయన మొత్తం 49 సిక్సర్లు బాదారు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ 43 సిక్సర్లతో మూడో స్థానంలో ఉండగా, డేవిడ్ వార్నర్ 41 సిక్సర్లతో నాలుగో స్థానాన్ని దక్కించుకున్నారు. సంచలన బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించిన ఈ ఆటగాళ్లు వరల్డ్ కప్ టోర్నమెంట్లలో తమదైన ముద్ర వేశారు.
భారత్ తరఫున టాప్-5 సిక్సర్ల వీరులు
వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారతీయ బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే, రోహిత్ శర్మ తర్వాత సచిన్ టెండూల్కర్ 27 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ 25 సిక్సర్లు, శ్రేయస్ అయ్యర్ 24 సిక్సర్లు సాధించారు. ఆ తర్వాత స్థానాలలో వీరేంద్ర సెహ్వాగ్ (18 సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (15 సిక్సర్లు), కేఎల్ రాహుల్(14 సిక్సర్లు), కపిల్ దేవ్ (14 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (14 సిక్సర్లు) నిలిచారు. ఆశ్చర్యకరంగా విరాట్ కోహ్లీ ఈ జాబితాలో టాప్-5లో కూడా లేకపోవడం గమనార్హం.
2027 వరల్డ్ కప్ లక్ష్యంగా టీమిండియా సన్నాహాలు
రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ ప్రణాళికలు రచిస్తోంది. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూనే సీనియర్ల అనుభవాన్ని జట్టు విజయం కోసం ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. రోహిత్ శర్మ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు. ప్రపంచ కప్ వేదికలపై భారత జట్టు మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచి మరోసారి ట్రోఫీని ముద్దడాలని అభిమానులు ఆశిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
